ప్రజల సమక్షంలో చర్చిద్దాం: అమిత్ షాకు కేజ్రీవాల్ సవాల్

ప్రజల సమక్షంలో చర్చిద్దాం: అమిత్ షాకు కేజ్రీవాల్ సవాల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించాలంటూ ఆప్ అధినేత డిమాండ్ చేశారు. ఇవాళ్టి మధ్యాహ్నం వరకు డెడ్ లైన్ విధించారు. డెడ్ లైన్ సమయం కాస్తా ముగిసిపోవడంతో కేజ్రీవాల్ మీడియా ముందుకు వచ్చారు. వారి సీఎం అభ్యర్థి ఎవరనే విషయాన్ని కూడా అమిత్ షా చెప్పలేకపోతున్నారన్నారు. తనతో బహిరంగ చర్చకు రావాలంటూ అమిత్ షాకు సవాల్ విసిరారు.

బహిరంగ చర్చ అనేది ఎప్పుడూ మంచిదేనన్న కేజ్రీవాల్…ఢిల్లీ ప్రజల సమక్షంలో శనివారం చర్చ జరుపుదామన్నారు. మాకు ఓటు వేయండి, మీకు సీఎంను ఇస్తామని అమిత్ షా చెబుతున్నారని… అసలు బీజేపీకి ఓటు ఎందుకు వేయాలనే విషయాన్ని ఢిల్లీ తెలుసుకోవాలనుకుంటోందన్నారు కేజ్రీవాల్.

ఢిల్లీలోని షహీన్ బాగ్ రోడ్డును ఎందుకు తెరవలేదనే విషయాన్ని అమిత్ షా నుంచి ఢిల్లీ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని తెలిపారు. ఢిల్లీకి చెందిన తాను ఎలా టెర్రరిస్టును అయ్యానని ప్రశ్నించారు.