- ఏ ఎన్నికలు వచ్చినా సత్తా చాటాలి.. మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపు
- సర్పంచ్‌లను దౌర్జన్యంగా హరీశ్‌రావు బీఆర్ఎస్లోకి లాక్కుంటున్నారని ఫైర్
- మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన సర్పంచులు
సిద్దిపేట, హత్నూర, వెలుగు: రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక వచ్చినా సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లో మంత్రి వివేక్ సమక్షంలో సిద్దిపేట అర్బన్ మండలం నాంచారుపల్లి గ్రామ సర్పంచ్ పురమాండ్ల నరసింహారెడ్డి, రాజగోపాల్ పేట సర్పంచ్ చేర్యాల వాణి కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వీరికి మంత్రి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పారు. అనంతరం ఆయన మాట్లాడారు. సిద్దిపేట నియోజకవర్గంలో బెదిరింపు రాజకీయాలు ఎక్కువ అయ్యాయన్నారు. కొత్త సర్పంచ్‌లను దౌర్జన్యంగా స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు బీఆర్ఎస్లోకి లాక్కుంటున్నారని.. అయినా పలువురు సర్పంచులు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు.
రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటి హరీశ్‌రావు పతనానికి బీజం వేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ పూజల హరికృష్ణతోపాటు సీనియర్ నాయకులు బొమ్మల యాదగిరి, కొత్త మహిపాల్ రెడ్డి, ఎర్ర మహేందర్, అంబటి మహేష్ గౌడ్, బాలరాజు కృష్ణమూర్తి పాల్గొన్నారు.
స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని వినతి
పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు అధిక ప్రాధాన్యం కల్పించాలని మంత్రి వివేక్ వెంకటస్వామికి శనివారం సంగారెడ్డి జిల్లా గుండ్ల మాచునూర్ సర్పంచ్ బేగరి శ్రీహరి వినతిపత్రం అందజేశారు. ఆ గ్రామ పంచాయతీ పరిధిలోని హానర్ ల్యాబ్, ఎపిటోరియా యూనిట్ - 1, కోవాలేంట్ లేబరేటరీస్ పరిశ్రమలు ఉండగా.. స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మంత్రి దృష్టికి ఆయన తీసుకెళ్లారు.
క్రమశిక్షణ ఉంటేనే సక్సెస్
- కేసీ పుల్లయ్యలా కాకా వెంకటస్వామి కష్టపడి పైకొచ్చారు: వివేక్
హైదరాబాద్, వెలుగు: క్రమశిక్షణ ఉంటేనే లైఫ్‌లో సక్సెస్ అవుతారని.. విజేతలందరి సీక్రెట్క్రమశిక్షణేనని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం లక్డీకపూల్ లోని కేసీ పుల్లయ్య ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న స్టూడెంట్లకు మంత్రి వివేక్ సర్టిఫికెట్లు అందజేశారు. మొత్తం 712 మందికి ట్రైనింగ్ ఇవ్వగా వీరికి ఐటీ, హెల్త్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లు కల్పించటం గొప్ప విషయమని అన్నారు. కేసీ పుల్లయ్య లా కాకా వెంకటస్వామి సైతం చాలా పేద కుటుంబం నుంచి వచ్చి ఎంతో కష్టపడ్డారని మంత్రి గుర్తుచేశారు. యూత్ కాంగ్రెస్ వర్కర్ నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారని, రాష్ట్రపతి కావాలనేది కాకా వెంకటస్వామి డ్రీమ్ అని ఆయన అన్నారు. ప్రతి స్టూడెంట్ లైఫ్ లో ఏం కావాలో నిర్ణయించుకోవాలని, ఆ డ్రీమ్ కు తగ్గట్టుగా కష్టపడి పనిచేయాలని మంత్రి సూచించారు.
స్టూడెంట్స్ కు ఫౌండేషన్ సీఈవో ఎంతో విలువైన సలహాలు ఇస్తున్నారన్నారు. పిల్లల మీద తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారని.. పిల్లలు సక్సెస్ అయితే వారి సంతోషం మాటల్లో చెప్పలేనిదని మంత్రి వెల్లడించారు. ఉద్యోగ ప్రయత్నాల కోసం వెళ్లినపుడు ఎంతో ఓపిక ఉండాలని, సెమినార్ లకు వెళ్లినపుడు స్పీకర్స్ చెప్పే విషయాలు జాగ్రత్తగా వినాలని, అపుడే మీకు ఎంతో సీరియస్ నెస్ , ఓపిక ఉందని అర్థం అవుతుందని మంత్రి సూచించారు.
ఎంతో కష్టపడి ఫౌండేషన్ ట్రైనింగ్ ఇచ్చిందని, ఉద్యోగాలు సాధించిన తరువాత సైతం కనీసం ఐదు మందిని మార్చాలని, వారు సైతం లైఫ్ లో సక్సెస్ అయ్యేలా సలహాలు ఇవ్వాలని, అదే సొసైటీకి ఇచ్చే గిఫ్ట్ అని మంత్రి వివేక్ తెలిపారు.
