రాహుల్‌ కు సుప్రీం నోటీసులు: చౌకీదార్ చోర్ అంటూ వ్యాఖ్యలు

రాహుల్‌ కు సుప్రీం నోటీసులు: చౌకీదార్ చోర్ అంటూ వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టు కోర్టు దిక్కరణ కేసులో నోటీసులు జారీ చేసింది. రఫేల్‌ వివాదంపై సుప్రీంకోర్టు ఎన్నడూ చేయని వ్యాఖ్యలను రాహుల్‌ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారంటూ బీజేపీ ఎంపీ మీనాక్షీ లేఖీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ‘చౌకిదారే దొంగ’ అంటు తన అభిప్రాయాలను కోర్టుకు ఆపాదిస్తున్నారని ఆరోపించారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు రాహుల్‌కు నోటీసలు జారీ చేసింది. రాహుల్‌ గాంధీ మీడియాలో అన్నట్లుగా తాము ఎప్పుడూ వ్యాఖ్యానించలేదని, అలాంటి అభిప్రాయాలను కూడా వెల్లడించలేదని కోర్టు ఈ సందర్భంగా తెలిపింది. దీనిపై ఈ నెల 22లోగా రాహుల్‌ సమాధానం ఇవ్వాలని సుప్రీం స్పష్టం చేసింది. తర్వాత విచారణ ఏప్రిల్ 23కు వాయిదా వేసింది.

గతవారం అమేథీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా రాఫెల్ కేసులో మీడియా దగ్గర ఉన్న డాక్యుమెంట్లను సాక్ష్యంగా పరిగణిస్తామన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని ఆయన ప్రస్తావించారు. చౌకీదార్ చోర్ అని సుప్రీంకోర్టు కూడా భావిస్తోందని, అందుకు కోర్టుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. సత్యాన్ని ఎవరూ మార్చలేరని, ప్రతి ఒక్కరూ కాపలాదారే దొంగ అంటున్నారని మోడీని ఉద్దేశించి రాహుల్ ఆరోపణలు చేశారు.