దిగి వస్తున్న ధరలు

దిగి వస్తున్న ధరలు
  • 7.04 శాతానికి పడిపోయిన రిటైల్​ ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ: దేశమంతటా ధరలు కొద్దికొద్దిగా తగ్గుతున్నాయి.  పోయిన నెల రిటైల్ ద్రవ్యోల్బణం కొంచెం పడిపోయింది. అయినప్పటికీ.... వరుసగా ఐదవ నెలలోనూ ఆర్​బీఐ అప్పర్​ టోలరెన్స్​ లెవెల్​ (ఎగువ సహన పరిమితి) కంటే ఇప్పటికీ ఇది ఎక్కువగానే ఉంది. వినియోగదారుల ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో 7.79 శాతం నుంచి 7.04 శాతానికి పడిపోయిందని సోమవారం విడుదల చేసిన ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 

అయితే, 2021 మే నెలలో ఇది 6.3 శాతమే ఉంది.  చమురు కంపెనీలు నష్టాల భారాన్ని భరించకపోతే ధరలు మళ్లీ పెరుగుతాయని ఎనలిస్టులు అంటున్నారు. ఫుడ్​ ద్రవ్యోల్బణం​ 8.38 శాతం నుంచి 7.97 శాతానికి, ఫ్యూయెల్​, లైట్​ ద్రవ్యోల్బణం 10.80 శాతం నుంచి 9.54 శాతానికి, క్లోథింగ్​, ఫుట్​వేర్​ ద్రవ్యోల్బణం ​9.85 శాతం నుంచి 8.85 శాతానికి పడిపోయాయి. వెజిటేబుల్​ ద్రవ్యోల్బణం మాత్రం అనూహ్యంగా 15.41 శాతం నుంచి 18.26 శాతానికి పెరిగింది. అమెరికాలో ధరలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి  ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల దూకుడును కొనసాగిస్తోందని, ఆర్​బీఐ కూడా రెపోరేట్లను పెంచే అవకాశం ఉందని ఫైనాన్షియల్​ ఎనలిస్టులు చెబుతున్నారు.

పెరుగుతున్న ధరల నుంచి వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించేందుకు పోయిన నెల చివర్లో డీజిల్, పెట్రోల్‌‌‌‌‌‌‌‌పై పన్ను తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీని పూర్తిస్థాయి ఎఫెక్ట్​ ఈ ఏడాది జూన్ వరకు కనిపించదని పేర్కొంది. ఈ ఏడాది డాలర్‌‌‌‌‌‌‌‌తో రూపాయి మారకం విలువ భారీగా తగ్గడం వల్ల దిగుమతుల ఖర్చు ఎక్కువయింది.