కామన్వెల్త్ గేమ్స్... భారత్ ఖాతాలో మరో స్వర్ణం

కామన్వెల్త్ గేమ్స్... భారత్ ఖాతాలో మరో స్వర్ణం

బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్‌ పతకాల వేట కొనసాగిస్తోంది. తాజాగా పారా పవర్‌ లిఫ్టింగ్‌ ఈవెంట్‌లో సుధీర్‌ భారత్‌కు తొలి బంగారు పతకాన్ని సాధించి పెట్టాడు. గురువారం (ఆగస్టు4) అర్ధరాత్రి జరిగిన పురుషుల హెవీవెయిట్ విభాగంలో సుధీర్ 134.5 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. తద్వారా కామన్వెల్త్ క్రీడల చరిత్రలో పారా పవర్ లిఫ్టింగ్ స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. దీంతో ఈ గేమ్స్‌లో ఇప్పటివరకు భారత్‌ బంగారు పతకాల సంఖ్య 6కు చేరగా, మొత్తం పతకాల సంఖ్య 20కి చేరుకుంది. ఇందులో 7 రజతాలు, 7 కాంస్యాలు ఉన్నాయి. 

2018లో ఆసియా పారా గేమ్స్ కాంస్య పతక విజేత అయిన సుధీర్.. తాజా పోటీలో తన తొలి ప్రయత్నంలోనే 280 కిలోల బరువు ఎత్తి 212 కిలోలకు పెంచి రెండో ప్రయత్నంలో 134.5 పాయింట్లు సాధించి సరికొత్త రికార్డును బద్దలు కొట్టాడు.  హర్యానాలోని సోనిపట్ లో ఓ రైతు కుటుంబంలో సుధీర్ జన్మించారు. తీవ్ర జ్వరం కారణంగా నాలుగేళ్ల వయసులో పోలియో బారిన పడ్డాడు. కానీ అతనికి వైకల్యం అడ్డురాలేదు. క్రీడలపై జీవితాంతం ఆసక్తిని కనబర్చాడు.

మోడీ ప్రశంసలు...

ఇక పాారా పవర్ లిఫ్టింగ్ లో సుధీర్ స్వర్ణం సాధించడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. "సుధీర్ పారా-స్పోర్ట్స్ మెడల్ కౌంట్‌కి గొప్ప ప్రారంభం! అతను ప్రతిష్టాత్మకమైన బంగారాన్ని గెలుచుకున్నాడు. మరోసారి సుధీర్ అంకితభావాన్ని, దృఢనిశ్చయాన్ని చాటుకున్నాడు. మైదానంలో నిలకడగా రాణించాడు. భవిష్యత్తులో సాధించే మరిన్ని విజయాలకు శుభాకాంక్షలు"అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.