ఆ తప్పుడు వార్తలతో దేశానికే చెడ్డ పేరు

ఆ తప్పుడు వార్తలతో దేశానికే చెడ్డ పేరు

సోషల్ మీడియా, వెబ్ పోర్టల్స్ లో తప్పుడు వార్తలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఓ వర్గం మీడియాలో ప్రతీదానిని మతానికి ముడిపెడుతూ... ప్రసారం చేయడం లేదా రాయడం చేస్తున్నారని సుప్రీంకోర్టు మండిపడింది. వెబ్ పోర్టల్స్ కు ఎలాంటి బాధ్యత లేదని విమర్శించింది. యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్ లపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది సుప్రీం. గతేడాది దేశంలో కరోనా మొదలైన కొత్తలో తబ్లీగి జమాత్ ఈవెంట్ నే ఫస్ట్ వేవ్ కు కారణంగా చూపుతూ.. అనేక కథనాలు వచ్చాయి. వీటికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై  సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఆ సమయంలో కొన్ని చానెళ్లు మతపరమైన విషయాలను ఆపాదిస్తూ చేయడాన్ని తప్పుబట్టింది. దేశంలో ఓ వర్గం మీడియా ప్రతి దానిని అదే కోణంలో చూపిస్తోందని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం వల్ల దేశానికి చెడ్డపేరు వస్తోందని, మీడియా, సోషల్ మీడియా బాధ్యతతో వ్యవహరించాలని సూచించింది. 

ఈ సందర్భంగా సీజే ఎన్వీ రమణ.. ‘‘వెబ్‌పోర్టల్స్‌ చాలా బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నాయి. కొంత మంది పవర్‌‌ ఫుల్‌ వ్యక్తుల చెప్పే మాటలకు తగ్గట్టు పని చేస్తాయి. జడ్జిలు, సంస్థలు, కామన్ పబ్లిక్ అంటే కూడా భయం లేదు. సంస్థలు, జడ్జిల గురించి కూడా తప్పుడు ప్రచారం చేస్తాయి” అని అన్నారు. ఈ విషయాలన్నీ మన అనుభవంలో చూసినవేనని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.  వెబ్‌పోర్టల్స్, యూట్యూబ్ చానెల్స్‌లో ఫేక్‌ న్యూస్‌ విచ్చలవిడిగా సర్క్యులేట్‌ అవుతున్నాయని, వీటిపై కంట్రోల్ ఉండాలని, ఇప్పటి వరకూ వీటిపై ఎటువంటి యాక్షన్ తీసుకున్న దాఖలాలు తాను చూడలేదని అన్నారు. 

తబ్లీగి జమాత్‌ ఈవెంట్‌పై వచ్చిన ఫేక్‌ న్యూస్‌ ఇప్పటికైనా సర్క్యులేట్‌ కాకుండా ఆపేలా కేంద్రాన్ని ఆదేశించాలని సుప్రీం కోర్టును పిటిషన్‌ వేసిన జమాత్‌ ఉలేమై హింద్ సంస్థ కోరింది. ఆ ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేసిన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అడిగింది. ఈ విషయంలో ఎటువంటి రెగ్యుటరీ విధానాలు ఫాలో అవుతున్నారో చెప్పాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ తషార్ మెహతా స్పందిస్తూ కొన్ని చానెళ్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కేవలం మత పరమైన కథనాలే కాక, ఫేక్ న్యూస్‌లు క్రియేట్ చేసి కూడా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌ కంటెంట్‌ను రెగ్యులేట్ చేయాలని కోరుతూ ఐటీ రూల్స్‌పై వేర్వేరు హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లతో కలిపి, దీనిని సుప్రీంలో విచారించాలని కోరారు. ఈ వాదనతో ఏకీభవించిన సుప్రీం కోర్టు విచారణను ఆరు వారాల పాటు వాయిదా వేసింది.