హుజూరాబాద్​ బై ఎలక్షన్​లో ఇచ్చిన కమ్యూనిటీ హాల్స్ క్యాన్సిల్

హుజూరాబాద్​ బై ఎలక్షన్​లో ఇచ్చిన కమ్యూనిటీ హాల్స్ క్యాన్సిల్
  • వీణవంక మండలంలో 12 ఊళ్లకు కేటాయించిన రూ.2.69 కోట్లు వెనక్కి
  • మరికొన్ని అభివృద్ధి పనులకు కూడా మంగళం
  • ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి  సిఫార్సుతో ఉత్తర్వులు ఇచ్చిన అప్పటి కలెక్టర్ కర్ణన్
  • నిధులన్నీ వీణవంక  విలేజ్ కు మళ్లింపు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సర్పంచులు

కరీంనగర్,  వెలుగు: హుజూరాబాద్  బై ఎలక్షన్ టైంలో వీణవంక మండలంలోని పలుగ్రామాలకు మంజూరైన కమ్యూనిటీ హాళ్లు,  ఇతర పనులు క్యాన్సిల్ అయ్యాయి.  మండలంలోని 12 గ్రామాల్లో రూ.2.69 కోట్ల విలువైన 32 పనులను క్యాన్సిల్ చేస్తూ జులై 14న అప్పటి కలెక్టర్ కర్ణన్ రిలీజ్ చేసిన ఉత్తర్వులు ఆలస్యంగా వెలుగు చూశాయి.  ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్రపోజల్ ​మేరకు పనులను రద్దు చేసిన కలెక్టర్.. మొత్తం ఫండ్స్​ను వీణవంక మండల కేంద్రానికి మళ్లించారు. అక్కడ సీసీ రోడ్లు,  డ్రెయిన్స్, కమ్యూనిటీ హాళ్లకు సంబంధించి 86 చోట్ల కొత్త పనులకు ప్రపోజల్స్​ పంపగా ఆమోదం తెలిపారు. 


2021లో జరిగిన బై ఎలక్షన్ టైంలో వివిధ కుల సంఘాలకు కమ్యూనిటీ హాళ్లు కట్టిస్తామని హడావిడిగా శంకుస్థాపనలు చేసి.. ఎలాంటి నిర్మాణం చేపట్టకుండానే తీరా రెండేళ్ల తర్వాత వాటిని క్యాన్సిల్ చేయడంపై ఆయా కుల సంఘాల నాయకులతోపాటు సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
క్యాన్సిల్ అయిన పనులు ఇవే.. 
వీణవంక మండలంలోని చల్లూరులో బీసీ కాలనీ శ్మశాన వాటికలో సౌలతుల కల్పన, పబ్లిక్ కమ్యూనిటీ హాల్, అలాగే పద్మశాలీవాడ, యాదవకాలనీ, వడ్దెర కాలనీల్లో వేర్వేరుగా శాంక్షన్​ అయిన కమ్యూనిటీ హాళ్లు క్యాన్సిల్ అయ్యాయి.  దేశాయిపల్లిలో ఓపెన్ జిమ్, ఘన్ ముక్ల గ్రామంలోని ఎస్సీ కాలనీ, హైస్కూల్ సమీపంలో, పాకాల బక్కారెడ్డి ఇంటి సమీపంలో, ఎల్లమ్మ టెంపుల్ సమీపంలో వేర్వేరు కమ్యూనిటీ హాళ్లు, హిమ్మత్ నగర్ లోని మున్నూరు కాపు కాలనీలోని స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్, ఇప్పలపల్లిలోని బీసీకాలనీలో కమ్యూనిటీ హాల్, కనపర్తిలోని  గౌడ స్ట్రీట్ లో, ఎస్సీ కాలనీలో వేర్వేరు కమ్యూనిటీ హాళ్లు,  కొండపాకలోని హెల్త్ సబ్ సెంటర్ సమీపంలో, యాదవకాలనీలో, గాంధీ విగ్రహం సమీపంలో, మాలవాడలో వేర్వేరు కమ్యూనిటీ హాళ్లు క్యాన్సిల్ అయిన పనుల జాబితాలో ఉన్నాయి.  


అలాగే కొండపాక నుంచి కొచ్చెరువు ఆర్అండ్​బీ రోడ్డు, మున్నూరు కాపు కాలనీలో  స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్,  కోరకల్​లోని హైస్కూల్ సమీపంలో, యాదవ కాలనీలో, ఎస్సీ కాలనీలో, సబ్ స్టేషన్ సమీపంలో కమ్యూనిటీ హాళ్లు, హెల్త్ సబ్ సెంటర్ , లక్ష్మక్కపల్లి ఎస్సీ కాలనీలో అంబేద్కర్ భవనం, మల్లారెడ్డిపల్లిలో జీపీ బిల్డింగ్ కు ప్రహరీ నిర్మాణం, శ్మశాన వాటిక దగ్గరలో కమ్యూనిటీ హాల్, పాల సేకరణ కేంద్రం, నర్సింగాపూర్ ఎస్సీ కాలనీలో, హనుమాన్ టెంపుల్ సమీపంలో, నర్సింహులపల్లి జీపీ బిల్డింగ్ సమీపంలో శాంక్షన్ అయిన కమ్యూనిటీ హాళ్లు కూడా క్యాన్సిల్ అయ్యాయి. 


వీణవంకలో చేపట్టబోయే మేజర్ వర్క్స్ ఇవే.. 
గ్రామాల్లో 32 రకాల పనులను క్యాన్సిల్ చేసిన కలెక్టర్ వాటిని వీణవంక మండల కేంద్రంలో 86 పనులు చేపట్టేలా ప్రణాళికలు రెడీ చేశారు. ఇందులో మేజర్ గా రూ.20 లక్షలతో వెంకటేశ్వర కాలనీ దగ్గరలో విలేజీ కమ్యూనిటీ హాల్, రూ.13 లక్షలతో వీణవంక గ్రామపంచాయతీ బిల్డింగ్ విస్తరణ, రూ.8 లక్షలతో లైబ్రరీ బిల్డింగ్ నిర్మాణం ఉన్నాయి. మిగతావన్నీ సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్స్ పనులే. కేవలం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీణవంకలో సర్పంచ్ స్థానాన్ని గెలవాలన్న సింగిల్ టార్గెట్ తో ఒకేసారి ఇన్ని పనులు ఇచ్చినట్లు ఉందని బీఆర్ఎస్ కు చెందిన సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

మా ఊరి ఫండ్స్​ మళ్లించడం దారుణం.. 
బై ఎలక్షన్ టైంలో మా ఊరిలో గ్రామపంచాయతీ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.4 లక్షలు, శ్మశాన వాటిక సమీపంలో కమ్యూనిటీ హాల్ కు రూ.10 లక్షలు, పాల సేకరణ కేంద్రం నిర్మాణానికి రూ.10 లక్షలు శాంక్షన్ అయ్యాయి.  గ్రామంలోని పాల ఉత్పత్తిదారులు రూ.21లక్షలతో 3 గుంటల జాగ సొంతంగా కొనుగోలు చేసి పాల సేకరణ కేంద్రం బిల్డింగ్ ను అప్పట్లో శాంక్షన్ చేయించుకున్నారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ క్యాన్సిల్ కావడంతో వచ్చి నన్ను అడుగుతున్నారు. వాళ్లకు ఏం చెప్పాలో అర్థం కావట్లే.  బై ఎలక్షన్ టైంలో మా ఊరికి శాంక్షన్ చేసిన ఫండ్స్​ను మా ఊరికే ఖర్చు పెట్టాలి. 
- మేకల ఎల్లారెడ్డి, మల్లారెడ్డిపల్లె సర్పంచ్