
భూమిపై, జలమార్గాలలో పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1950ల నుంచి ఉత్పత్తి చేసిన సుమారు10 బిలియన్ టన్నుల ప్లాస్టిక్‌లో, అధ్యయనాల ప్రకారం 8 బిలియన్ టన్నులకుపైగా వ్యర్థాలు అని, ప్రతి సంవత్సరం మిలియన్ టన్నుల ప్లాస్టిక్ సముద్ర వాతావరణంలోకి లీక్ అవుతుందని గణాంకాలు తెలుపుతున్నాయి.
ఈ సంఖ్య 2050 నాటికి మూడురెట్లు పెరుగుతుందని, 2020 నాటికి ఉత్పత్తి చేసిన ప్లాస్టిక్‌లలో కేవలం 10 శాతం మాత్రమే పునర్వినియోగం (రీసైకిల్) అయ్యాయి అని ఒక అంచనా. ప్లాస్టిక్‌లలో విషపూరిత రసాయనాల ఉనికి వల్ల రీసైక్లింగ్ చేస్తే మానవ ఆరోగ్యంపై ప్రభావాల గురించి కనీస సమాచారం లేదు. ప్లాస్టిక్ ఉత్పత్తిలో ఆ తరువాత కూడా 13,000 కంటే ఎక్కువ రసాయనాలు ఉపయోగిస్తున్నారు. వాటిలో అత్యధికశాతం రసాయనాల దుష్ప్రభావాల మీద అధ్యయనాలు లేవు.
ప్లాస్టిక్ వల్ల మానవ ఆరోగ్యం మీద దుష్ప్రభావంతోపాటు భూమి, సముద్ర పర్యావరణ వ్యవస్థల మీద కూడా ప్రభావం పెరుగుతున్నది. 2021 నివేదికలో మానవ శరీరంలో మైక్రోప్లాస్టిక్ కణాలు కనుగొన్నారు. 2022లో మానవ ఊపిరితిత్తులలో మానవరక్తంలో ప్లాస్టిక్ కణాలు కనుగొన్నట్లు నివేదికలు వచ్చాయి.
ప్లాస్టిక్ కాలుష్యంపై తీర్మానం
పెరుగుతున్న ఈ ఆందోళనలకు ప్రతిస్పందనగా, ప్లాస్టిక్ కాలుష్యాన్ని పరిష్కరించడానికి ఉత్తమ మార్గాలను చర్చించడానికి ఐక్యరాజ్యసమితి పర్యావరణ అసెంబ్లీ (యూఎన్ఏఇ) అనేక తీర్మానాలను ఆమోదించింది. 2018లో నిపుణుల బృందాన్ని (ఏహెచ్ఈజీ) ఏర్పాటు చేసింది. ఈ బృందం 2018–-20 మధ్య నాలుగుసార్లు సమావేశమై ప్లాస్టిక్ ఒప్పందం దిశగా అవసరమయిన పునాదులు వేసింది. మొదటి సమావేశాలు సముద్రాలలో ప్లాస్టిక్ సమస్య మీద ఎక్కువగా దృష్టి పెట్టాయి. 2021లో మంత్రుల సమావేశం జరిగింది. అనంతరం 2022లో ఐక్యరాజ్యసమితి పర్యావరణ అసెంబ్లీ ఆధ్వర్యంలో నైరోబి నగరంలో జరిగిన సమావేశంలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించాలని తీర్మానం చేస్తూ, ఆ దిశగా ఒక అంతర్జాతీయ చట్టం తీసుకురావాలని నిర్ణయం చేశారు.
ప్లాస్టిక్ కాలుష్యంపై అంతర్జాతీయ చట్టబద్ధమైన సాధనం అభివృద్ధి చేయడానికి అంతర్ ప్రభుత్వ చర్చల కమిటీ (ఐఎన్సీ) ఏర్పాటు చేయాలని 2 మార్చి 2022న తీర్మానం ద్వారా నిర్ణయమైంది. సముద్ర పర్యావరణంలో ప్లాస్టిక్ వ్యర్థాలతోపాటు, పూర్తి ప్లాస్టిక్ జీవితచక్రం పట్ల సమగ్ర దృష్టితో పరిష్కరించే విధానం ఆధారంగా విధిగా పాటించాల్సిన విధానాలతోపాటు, స్వచ్ఛంద స్పందనకు కూడా అవకాశం కల్పించే అంతర్జాతీయ చట్టబద్ధ సాధనం తయారుచేయడం ఈ కమిటీ పని. స్వచ్ఛంద స్పందన ద్వారా సాధారణంగా జాతీయ పరిస్థితులు, తగిన సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం కల్పిస్తుంది.
జీరో ప్లాస్టిక్ ట్రీట్
ఐఎన్సీ ఏర్పాటు తరువాత వరుసగా 2021 నుంచి 2024 వరకు ఉరుగ్వే, ఫ్రాన్స్, కెన్యా, ఈక్వెడార్ దేశాలలో నాలుగు సమావేశాలు నిర్వహించారు. 4 సెప్టెంబర్ 2023న 31 పేజీల ముసాయిదా అంతర్జాతీయ ప్లాస్టిక్ ఒప్పందం ( జీరో ప్లాస్టిక్
ట్రీట్) తయారైంది. 28 డిసెంబర్ 2023 నాటికి సవరించిన ముసాయిదా 69 పేజీలకు పెరిగింది. తదుపరి సమావేశాలలో ఈ ముసాయిదా మీద చర్చలు సాగుతున్నాయి. అనేక అంశాల మీద చర్చలు, మార్పులు, చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ వరుస సమావేశాల నేపథ్యంలో ప్లాస్టిక్ మీద ఒక ఒప్పందం రూపుదిద్దుకుంటుంది అనే ఆశ చాలామందికి కలిగింది.
ఈక్వెడార్ దేశంలో ముసాయిదా మీద చర్చల సందర్భంగా ఒప్పందం దృష్టి దేనిమీద, విస్తృతి ఎంతమేరకు ఉంటుందో చర్చకు వచ్చింది. మొదటగా, ప్రాథమిక ప్లాస్టిక్ పాలిమర్‌ల సుస్థిరమైన వినియోగం, ఉత్పత్తిని సాధించడంతోపాటు ప్రమాదకరమైన పాలిమర్‌లు, రసాయనాలు, ఆందోళనకరమైన ఉత్పత్తులను తొలగించడం ఈ ఒప్పందంలో పొందుపరిచే ప్రయత్నం జరిగింది. కొందరు ప్రతినిధులు ప్రాథమిక ప్లాస్టిక్ పాలిమర్‌లపై ఎటువంటి నిబంధన లేకుండా ఉండాలనే తమ ప్రాధాన్యతను పునరుద్ఘాటించారు. ఇది యూఎన్ఈఏ తీర్మానం 5/14 పరిధిని దాటుతున్నదని అభ్యంతరం చెప్పారు. 2023లోనే ప్రపంచ ప్లాస్టిక్ ఒప్పందం వచ్చేసింది అని అందరూ ఆశించగా, 2025 నాటికి కూడా అది రూపుదిద్దుకోలేదు.
రసాయనాల గుర్తింపునకు ప్రమాణాలు
ఇంకొక ప్రధాన అంశం ప్లాస్టిక్ ఉత్పత్తిలో వాడే రసాయనాలు. వీటి పట్ల కొందరు ప్రతినిధులు ప్రపంచవ్యాప్తంగా కట్టుబడి ఉండే నిబంధనలను ప్రతిపాదించారు. రసాయనాలు, పాలిమర్‌ల వాడకాన్ని నియంత్రించడానికి ఒక జాబితా తయారుచేసి జాతీయ ప్రణాళికలలో అమలు చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి. కొందరు రెండు జాబితాలను ప్రతిపాదించారు: ప్లాస్టిక్‌లలో నిషేధించాల్సిన రసాయనాలు, రెండోది.. నివారించాల్సిన, తగ్గించాల్సిన రసాయనాలు. కొందరు ప్రతినిధులు ప్రమాదకరమైన రసాయనాలను గుర్తించడానికి ప్రతిపాదిత ప్రమాణాలను, అలాగే ఆయా జాబితాలలో రసాయనాలను చేర్చడానికి ప్రారంభ ప్రతిపాదనలను సమర్పించారు.
మరికొందరు ఈ అంశం కూడా యూఎన్ఈఏ తీర్మానం 5/14 మించిందని, అసలు చర్చించనే వద్దు అని పట్టుబట్టారు. మైక్రో (అతిసూక్ష్మ) ప్లాస్టిక్స్ మీద, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ (సింగిల్ యూజ్) ఉత్పత్తుల మీద కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ప్లాస్టిక్ వలన వాటి జీవితకాలంలో ఉద్భవించే ఉద్గారాలు (వాయువులు), గుట్టలుగా ఎక్కడపడితే అక్కడ పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ మీద కూడా సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయాల గురించి కూడా మాట్లాడుతున్నా అవి అంతగా విస్తృతం కాలేదు.
విష రసాయనాలను నిషేధించాలి
ఆగస్ట్ 2025లో సౌత్ కొరియా బుసాన్ నగరంలో జరిగిన సమావేశంలో ముసాయిదా మీద చర్చలు ముందుకు సాగకుండా కొన్ని దేశాలు, దాదాపు 200 పెట్రోలియం కార్పొరేటు ప్రతినిధులు సర్వ ప్రయత్నాలు చేశారు. ఒప్పందంలో ఉత్పత్తి, రసాయనాలు ముఖ్యమైన అంశాలు అని ఒప్పుకున్న అమెరికా దేశం చట్టబద్ధంగా కట్టుబడి ఉండే చర్యల కోసం పిలుపునిచ్చిన 100 కంటే ఎక్కువ దేశాలలో చేరాలనే పిలుపుకు సమాధానం ఇవ్వడానికి, స్వచ్ఛంద చర్యలకు మించి ముందుకు సాగడానికి నిరాకరించింది. బుసాన్ నగరంలో జరిగిన అంతరప్రభుత్వ చర్చల కమిటీ 5వ సమావేశంలో పెట్రోదేశాల చిన్న కూటమి ఏకాభిప్రాయం ద్వారా మాత్రమే పురోగతి అని సూత్రం పెట్టుకుని చర్చలను పట్టాలు తప్పించే ప్రయత్నంచేశాయి.
ఇతర దేశాలు పురోగతి సాధన కోసం ఐక్యంగా ఉన్నప్పటికీ కార్పొరేట్ ప్రతినిధులు, కొన్ని దేశాలు చర్చలలో గందరగోళం సృష్టించాయి. అయినప్పటికీ, చాలా సభ్య దేశాలు ఐక్యంగా నిలిచాయి. అనూహ్యంగా 100 కంటే ఎక్కువ సభ్య దేశాలు ఐక్యంగా ఉండటంతోపాటు ప్రపంచ పర్యావరణ, ఆర్థిక, సామాజిక, పర్యావరణ సంక్షోభానికి ఆజ్యం పోసే ప్లాస్టిక్ ఉత్పత్తిని తగ్గించడం, విష రసాయనాలను నిషేధించడం చాలా ముఖ్యమని భావిస్తూ ప్రకటనలు కూడా చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పౌర సమాజ సంస్థలు ఒక సమగ్ర ప్లాస్టిక్ ఒప్పందం కోసం డిమాండ్ చేస్తున్నాయి.
- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్