పండుగ సీజన్​కు కంపెనీలు రెడీ..   ప్రొడక్షన్​ జూమ్‌

పండుగ సీజన్​కు కంపెనీలు రెడీ..   ప్రొడక్షన్​ జూమ్‌

న్యూఢిల్లీ: ఈసారి పండుగ సీజన్​లో అమ్మకాలు బాగుంటాయని నమ్ముతున్న ఆటోమొబైల్, కన్జూమర్​ఎలక్ట్రానిక్స్​ కంపెనీలు పోయిన సంవత్సరం కంటే ఉత్పత్తిని 10–20 శాతం వరకు పెంచుతున్నాయి. ఈసారి విడిభాగాల కొరత లేదు కాబట్టి సప్లైలు భారీగా ఉంటాయని కంపెనీల ఎగ్జిక్యూటివ్​లు చెబుతున్నారు. మారుతీ సుజుకీ, హుండై, టాటా, టోయోటా, మహీంద్రా అండ్​ మహీంద్రా ఇప్పటికే పూర్తి సామర్థ్యంతో ప్లాంట్లను నడుపుతున్నాయి. వచ్చే నెల నాటికి తమ ప్లాంట్లు కూడా పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయని స్మార్ట్​ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్​లు, వాషింగ్​ మెషీన్లు తయారు చేసే బ్రాండ్స్​, కాంట్రాక్ట్​ మాన్యుఫాక్చరర్స్​ చెబుతున్నాయి.

పాత స్టాక్​కూడా భారీగా తగ్గిందని అంటున్నాయి. ఈ ఏడాది జులై, ఆగస్టులో ఇవి భారీ అమ్మకాలు సాధించడంతో ఉత్పత్తిని పెంచుతున్నాయి. ఈసారి కేరళలో ఓనమ్  ​పండుగకు ఆటో కంపెనీలు తమ అమ్మకాలను 30 శాతం పెంచుకున్నాయి. ఈసారి ఓనమ్​తో తమకు ఫెస్టివల్​ సీజన్ ​మొదలయిందని మారుతీ సుజుకీ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ (మార్కెటింగ్​, సేల్స్​) శశాంక్​ శ్రీవాస్తవ చెప్పారు. సెమీకండక్టర్లు దొరక్క గతంలో ఎంతో ఇబ్బంది పడ్డామని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ప్రొడక్షన్​ పెరగడంతో కస్టమర్ల వెయిటింగ్​ పీరియడ్​ తగ్గుతోందన్నారు. బ్రెజా, ఎర్టిగా, ఎక్స్​ఎల్​6, ఫ్రాంక్స్​, జిమ్నీ డెలివరీలను వేగవంతం చేశామని అన్నారు.

ప్రస్తుతం 3.42 లక్షల డెలివరీలు పెండింగ్​లో ఉన్నాయని శశాంక్​ వివరించారు. మనదేశంలో ఓనమ్​ నుంచి దీపావళి వరకు ఫెస్టివల్​ సీజన్​ నడుస్తుంది.  పండుగ సీజన్  కోసం టెలివిజన్‌‌‌‌‌‌‌‌లు,  వాషింగ్ మెషీన్‌‌‌‌‌‌‌‌లు, ఫోన్ల కోసం భారీగా ఆర్డర్లు వస్తున్నాయని భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ తయారీదారులలో ఒకటైన డిక్సన్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ లాల్ అన్నారు. గత ఏడాది కంటే ఈసారి పండుగ సీజన్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌లలో మరింత వృద్ధిని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు.  బ్రాండ్‌‌‌‌‌‌‌‌లు భారీగా ఇన్వెంటరీని పెంచుకుంటున్నందున ఆర్డర్ల విషయంలో తాము ఆశాజనకంగా ఉన్నామని వివరించారు. 

అన్ని సెగ్మెంట్లలోనూ డిమాండ్​..

ఎంట్రీ- లెవల్ ప్రొడక్టులు సహా, అన్నింటికీ ఈ సంవత్సరం పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌లో డిమాండ్ మెరుగుపడుతుందని చీఫ్ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌లు ఇప్పటికే అంచనా వేశారు. ప్యాసింజర్ వెహికల్స్​ తయారీదారులు జూన్ నుంచి జులైలో ఉత్పత్తిని 18.4 శాతం పెంచి 3,93,094 యూనిట్లకు చేర్చారు. మార్కెట్ లీడర్ మారుతి సుజుకి ఉత్పత్తి 37శాతం పెరిగింది. మహీంద్రాలో 15 శాతం, హుండైలో 3శాతం పెరిగింది. "పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌లో వెయిటింగ్ పీరియడ్‌‌‌‌‌‌‌‌ను తగ్గించడానికి,  డెలివరీలను వేగవంతం చేయడానికి ఉత్పత్తిని పెంచుతున్నాం.

అయితే తాజా బుకింగ్‌‌‌‌‌‌‌‌లు బలంగా ఉన్నాయి. దీనివల్ల పెండింగ్​ఆర్డర్ల సంఖ్య పెరగొచ్చు అని మహీంద్రా సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఎలక్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌లో అమ్ముడుపోని ఇన్వెంటరీ ఎక్కువ ఉన్న కారణంగా కంపెనీలు జూన్,- జులైలో ఉత్పత్తికి కోత పెట్టాయి. అయితే, జులై నుంచి అమ్మకాలు మెరుగయ్యాయి. గోద్రేజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది మాట్లాడుతూ ఈ ఏడాది ఆగస్ట్ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 18–-20 శాతం వృద్ధి చెందాయని, స్వాతంత్య్ర దినోత్సవ విక్రయాలు జోరందుకున్నాయన్నారు. 

ట్రేడ్ ఇన్వెంటరీ స్థాయి తగ్గిందని చెప్పారు. స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్ ఇండస్ట్రీ రీసెర్చర్​ కౌంటర్‌‌‌‌‌‌‌‌ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ,  గత ఏడాది పండుగ సీజన్​లో ఎక్కువ ఇన్వెంటరీతోకంపెనీలు చేతులు కాల్చుకున్నాయని చెప్పారు. జులై నుంచి అమ్మకాలు మెరుగుపడుతున్నప్పటికీ, చాలా బ్రాండ్‌‌‌‌‌‌‌‌లు పాత పద్ధతుల్లోనే వెళ్తున్నాయని చెప్పారు. యాపిల్​, శామ్​సంగ్​వన్​ప్లస్​ వంటి బ్రాండ్‌‌‌‌‌‌‌‌లు తమ ప్రీమియం పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియో ఉత్పత్తిని,  సరఫరాలను గత సంవత్సరం కంటే పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌లో 15–-20శాతం పెంచుతాయని, ఈ విభాగంలో డిమాండ్ చాలా  ఉందని ఆయన చెప్పారు.

2022లో దాదాపు 8,92,000 యూనిట్లను అమ్మిన ఆటో కంపెనీలు ఈ సంవత్సరం పది లక్షల బండ్లను విక్రయించాలని కోరుకుంటున్నాయి.  ఆటో డీలర్లు ఈసారి దీపావళి తమకు బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నారు. ఆటోమేకర్లు ఇన్వెంటరీలను బాగా పెంచగలిగితే రికార్డు స్థాయిలో పండుగ అమ్మకాలను సాధించవచ్చని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్​కు చెందిన నికుంజ్ సంఘీ అన్నారు.