ఈ ఏడాది బిట్​కాయిన్​తో పోటీపడి పెరిగిన ఇరిడియం

ఈ ఏడాది బిట్​కాయిన్​తో పోటీపడి పెరిగిన ఇరిడియం

వెలుగు, బిజినెస్​డెస్క్​:ఈ ఏడాది ఒక మెటల్​ రేట్లు చుక్కలంటుతున్నాయి. ఈ మెటల్​ బంగారం కంటే మూడు రెట్లు విలువైంది. బిట్​కాయిన్​తోపాటు, కొన్ని ఇతర మెటల్స్​తోనూ రేట్ల విషయంలో  పోటీపడుతోంది ఈ మెటల్​. కాకపోతే, ఈ మెటల్​ కొనడం ఇన్వెస్టర్లకు మాత్రం పెద్ద సవాలుగానే నిలుస్తోంది. ఎక్కువ విలువుండే  ఆ మెటల్ ఇరిడియం. ప్లాటినమ్​, పలాడియమ్​ మైనింగ్​లో బై ప్రొడక్ట్​గా ఈ ఇరిడియం మెటల్​ దొరుకుతుంది. 2021 జనవరి నుంచి ఇప్పటిదాకా ఇరిడియం​ రేటు 131 శాతం పెరిగింది. ఇదే కాలంలో బిట్​ కాయిన్​ 85 శాతమే ఎగిసింది. గత ఏడాది కాలంలో సప్లయ్​లో సమస్యలు రావడంతోపాటు, డిమాండ్​ భారీగా పెరగడంతో రేట్లు ఊపందుకున్నట్లు ఎనలిస్టులు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్​ స్క్రీన్స్​ తయారీలో ఎక్కువగా వాడటం వల్లే డిమాండ్​ పెరిగినట్లు రిఫైనింగ్​ కంపెనీ హెరాస్​ గ్రూప్​ వెల్లడించింది. మిగిలిన మెటల్స్​తో పోలిస్తే ఇరిడియం​ మార్కెట్​ చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఈ మెటల్​ ప్రొడక్షన్​లో  ఏ చిన్న సమస్య తలెత్తినా రేట్లపై పెద్ద ప్రభావమే కనిపిస్తుంది. ఇండస్ట్రియల్​ యూజర్లే వాడుతుండటం వల్ల డిమాండ్​ను అంచనా వేసి, ఇరిడియం​ కొనుగోలు, అమ్మకాలు జరపడం కొంచం కష్టమైన పనేనని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఏ ఎక్స్చేంజ్​లోనూ లేదా ఎక్స్చేంజ్​ ట్రేడెడ్​ ఫండ్స్​లోనూ ఇరిడియం ట్రేడవడం లేదు. కొంత మంది డీలర్ల దగ్గర మాత్రమే దొరికే ఇన్​గాట్స్​ను రిటెయిల్​ బయ్యర్లు కొనగలుగుతున్నారు. ఇక పెద్ద ఇన్వెస్టర్లైతే మాత్రం నేరుగా ప్రొడ్యూసర్ల వద్దకే చేరుతున్నారు.


జాన్సన్​ మాథే పీఎల్​సీ డేటా ప్రకారం ఇరిడియం రేటు ఔన్సుకు 6 వేల డాలర్ల దాకా ఉంది. స్పార్క్​ ప్లగ్స్​ తయారీలో కూడా దీనిని ఎక్కువగానే వాడుతున్నారు. అంటే, ఈ రేటు ప్రకారం బంగారం కంటే ఇరిడియం విలువ మూడు రెట్లు ఎక్కువన్న మాట. ప్లాటినం ప్రొడక్షన్​ కోసం ఎక్కువగా పెట్టుబడులు పెట్టకపోవడం వల్లే ఇరిడియం అట్రాక్టివ్​గా మారుతోంది. ప్లాటినం మెటల్స్​ను ఆటోకేటలిస్ట్స్​గాను​, ఎమిషన్స్​ తగ్గించడానికీ ఉపయోగిస్తారు. ఇప్పుడు ఎలక్ట్రిక్​ వెహికల్స్​ తయారీ జోరందుకోవడంతో హైడ్రోజన్​ టెక్నాలజీస్​పై పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ మంది ఇన్వెస్టర్లు చూస్తున్నారు. సప్లయ్​ లిమిటెడ్​గా ఉండటంతో ప్లాటినం గ్రూప్​ మెటల్స్​ రేట్లు పెరగడానికి వీలు కలుగుతోంది. పలాడియం రేటు ఆల్​ టైమ్​ హైకి దగ్గరగా ఉంది. రోడియం రేటైతే ఈ వారం రికార్డు లెవెల్​లో ఔన్సు  29,800 డాలర్లకు చేరింది. రుథినియమ్​ కూడా 13 ఏళ్ల గరిష్టాన్ని తాకింది.