మీటింగులు పెట్టడంలో కాదు, ప్రజలకు మంచి చేయడంలో పోటీ ఉండాలె

మీటింగులు పెట్టడంలో కాదు, ప్రజలకు మంచి చేయడంలో పోటీ ఉండాలె

పోటీ అనేది ప్రజలకు మంచి చేయడంలో, మంచి పాలన అందించడంలో చూపిద్దామని, మీటింగులు పెట్టడంలో కాదని శాసన సభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 75 వ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి... సెప్టెంబర్ 17, 1948 స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ గడ్డను కలిపిన రోజని చెప్పారు. 75 వ వసంతం నుండి 76 వ వసంతం వరకు ఒక సంవత్సరం పాటు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జాతీయ సమైక్యతా సంబరాలు జరుగుతాయని చెప్పుకొచ్చారు. నిన్న జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యతా ర్యాలీలో రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మంది పాల్గొన్నారన్న పోచారం.. ఈ రోజు తెలంగాణ బిడ్డలు జరుపుకునే పండుగ ఏ పార్టీకో, ఏ మతానికి సంబంధించినది కాదని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 5 మెడికల్ కళాశాలలు ఉంటే, ఈ రోజు ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాల ఉందన్నారు.

సమాఖ్య రాష్ట్రంలో వ్యవసాయం గురించి మాట్లాడాలంటే భయం వేసేదని, ఇప్పుడు వ్యవసాయం పండగలా మారిందని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గతంలో ఎన్నో తంటాలు పడితే నిధులు వచ్చేవని, అప్పట్లో ఒక ఏడాదిలో కాని పనులు ఇప్పుడు ఒక రోజులో అవుతున్నాయని చెప్పారు. హ్యండ్ బుక్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ సర్వే ప్రకారం వ్యవసాయ అభివృద్ది 98 శాతం పెరిగి, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని గొప్పగా చెప్పారు. రైతుల కష్టాల్లో నుండి వచ్చిందే రైతు బంధు, రైతు భీమా అన్న పోచారం, ముఖ్యమంత్రి ముందుచూపుతో 2015-16 లో ఉన్న వరి పంట సాగు 2021 -22 లో 4 రెట్లు పెరిగిందని తెలిపారు. కొంత మంది కొన్ని పథకాలు మావని అంటున్నారని, మరి వారి రాష్ట్రాల్లో డబుల్ బెడ్ రూం లాంటి సంక్షేమ పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. జిల్లాలో పరిపాలన, శాంతి భద్రతలు బాగున్నాయన్న ఆయన.. తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని కొనియాడారు. తెలంగాణ నూతన సచివాలయానికి అంబేడ్కర్ గారి పేరును పెట్టాలని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రానికి రోజుకొక కేంద్ర మంత్రి వస్తున్నారన్న పోచారం... పోటీ అనేది ప్రజలకు మంచి చేయడంలో, మంచి పాలన అందించడంలో చూపుదామని, మీటింగులు పెట్టడంలో కాదని స్పష్టం చేశారు.