బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై ఈసీ,ఈడీకి ఫిర్యాదు

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై ఈసీ,ఈడీకి ఫిర్యాదు
  • ప్రభుత్వ అధికారులతో ఫంక్షన్‌‌‌‌ హాల్‌‌‌‌లో మీటింగ్‌‌‌‌ పెట్టిండు: రఘునందన్ రావు
  • ఫ్లైయింగ్ స్క్వాడ్ వచ్చేసరికి అందరూ పారిపోయారని వెల్లడి
  • తమ కార్యకర్తలు తీసిన వీడియోల ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి 

బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్/ హైదరాబాద్ వెలుగు: పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లో ప్రభుత్వ అధికారులను ప్రలోభపెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి చూస్తున్నారని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. సిద్దిపేటలోని రెడ్డి పంక్షన్ హాల్‌‌‌‌లో ఆదివారం రాత్రి 9:30 గంటలకు వివిధ ప్రభుత్వ ఉద్యోగులతో పర్మిషన్ లేకుండా సమావేశం నిర్వహించారని తెలిపారు.

ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌‌‌‌లోని బీఆర్కే భవన్‌‌‌‌లోని‌‌‌‌ తెలంగాణ చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి(సీఈవో)ని కలిసి రఘునందన్‌‌‌‌ రావు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేటలో వెంకట్రామిరెడ్డిపై నిర్వహించిన సమావేశంపై అధికారులకు ఫిర్యాదు చేసినా వెంటనే స్పందించలేదన్నారు. దీంతో తమ కార్యకర్తలే ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్లి, వీడియో తీశారన్నారు.

ఆ తర్వాత ఫ్లైయింగ్ స్క్వాడ్ వచ్చేసరికి అందరూ గోడ దూకి పారిపోయారని తెలిపారు. వీడియోల ఆధారంగా వెంకట్రామి రెడ్డిపై కేసు నమోదైందని చెప్పారు. కోడ్‌‌‌‌ ఉల్లంఘన కింద కేసు నమోదు చేయాలని సీఈసీని కోరామని చెప్పారు. 

ఈడీకి ఫిర్యాదు..

ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ వ్యవహారానికి సంబంధించి వెంకట్రామిరెడ్డిపై ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌(ఈడీ)కు కూడా రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో టాస్క్‌‌‌‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆధారంగా వెంకట్రామి రెడ్డిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేయాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెల్లపూర్‌‌‌‌‌‌‌‌లోని వెంకట్రామిరెడ్డి నివాసం రాజపుష్ప అపార్ట్‌‌‌‌మెంట్స్‌‌‌‌ నుంచి కోట్ల రూపాయల నగదును పోలీస్ ఎస్కార్ట్ వెహికల్‌‌‌‌లో తరలించారని చెప్పారు. రాధాకిషన్ రావు చెప్పిన కన్ఫషన్ స్టేట్మెంట్ ఆధారంగా వెంకట్రామారెడ్డిపై ఈడీ దర్యాప్తు చేయాలని కోరారు. 

సిద్దిపేట కలెక్టర్, సీపీపై చర్యలు తీసుకోండి

సిద్దిపేట కలెక్టర్, పోలీసు కమిషనర్, ఏఆర్ఓలపై చర్యలు తీసుకోవాలని రఘునందన్​ రావు కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన సీఈఓ వికాస్​ రాజ్​కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్​ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను.. ప్రతిపక్షంలోనూ కొనసాగిస్తున్నారని తెలిపారు. కలెక్టర్​గా ఉన్నప్పడు అడ్డగోలుగా సంపాదించి.. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్న వెంకట్రామిరెడ్డి ఇప్పుడు ఇష్టారీతిన డబ్బులను పంచుతున్నారని విమర్శించారు.

ఇదే విషయమై సిద్దిపేట సీపీకి, కలెక్టర్​కు కంప్లయింట్​ చేసినా వాళ్లు పట్టించుకోలేదని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా అక్రమాలకు పాల్పడ్డారో ఇప్పుడు అలాగే జరుగుతోందని వివరించారు. అధికారులంతా వెంకట్రామిరెడ్డికి వంతా పడుతున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని సీఈఓకు రఘునందన్ రావు విజ్ఞప్తి చేశారు.