యాంటీ బయాటిక్ గోలీలతో గోస

యాంటీ బయాటిక్ గోలీలతో గోస

సరిత  హౌజ్ వైఫ్. తనకు ఎప్పుడు ఒంట్లో బాగుండకపోయినా ఇంట్లో ఉండే యాంటీబయాటిక్ మాత్రలు వేసుకుని సరిపెడుతుంది.  జ్వరం వచ్చినా, జలుబు చేసినా మెడికల్ షాపులో అడిగి టాబ్లెట్స్ తీసుకురమ్మని భర్తకు చెప్తుంది. అయితే, సరితకు ఒకసారి విపరీతమైన ఛాతీనొప్పి, జ్వరం, జలుబు, దగ్గు మొదలయ్యాయి. ఎప్పటిలాగే టాబ్లెట్స్ వేసుకుంది. కానీ,  వారం రోజులైనా జ్వరం, జలుబు తగ్గలేదు. ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైంది. హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్తే.. న్యుమోనియా వచ్చిందన్నారు. ఇప్పటికే చాలా లేట్ అయిందన్నారు. ఐసీయూలో పెట్టి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అయితే డాక్టర్లు చేస్తున్న ట్రీట్మెంట్‌‌‌‌కు సరిత శరీరం రెస్పాండ్ అవ్వట్లేదు. పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ మందులు వాడినా ఫలితం లేదు. కండిషన్ సివియర్ అయింది. కిడ్నీలపై ఎఫెక్ట్ పడింది. ‘ఎందుకిలా జరిగింది?’ అని డాక్టర్స్‌‌‌‌ని అడిగితే యాంటీ బయాటిక్స్‌‌‌‌కు ఆమె శరీరం రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పారు. సరితకు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉందన్నారు.  అందుకే ఎన్ని మందులు వాడినా ఆమెకు జబ్బు తగ్గలేదు. 

ఇప్పుడిదే సమస్య ప్రపంచం మొత్తాన్నీ భయపెడుతోంది. యాంటీబయాటిక్స్‌ ఎక్కువగా వాడడం వల్ల అవి మ్యుటేషన్‌ చెంది మందులకు లొంగని సూపర్‌‌ బగ్స్‌ గా తయారవుతున్నాయి. ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్  సమస్యను ఎలా ఎదుర్కోవాలి? డాక్టర్లు ఏమంటున్నారు? మందులు ఎప్పుడు, ఎలా వాడాలి? ఈ విషయాలపై ఈ వారం కవర్ స్టోరీ.

ఏ చిన్న హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా యాంటీబయాటిక్స్ వేసుకోవడం అలవాటు చాలామందికి. ఇప్పుడు ఆ అలవాటే ప్రాణాలు తీస్తోంది. ఒకప్పుడు మనుషుల ప్రాణాలు కాపాడేందుకు సంజీవనిలా పనిచేసిన యాంటీబయాటిక్స్.. ఇప్పుడు పనిచేయకుండా పోతున్నాయి. ఐసీయూలో ట్రీట్మెంట్ కోసం వాడే శక్తివంతమైన యాంటీబయాటిక్స్‌‌‌‌లో కొన్ని ఇకపై మనదేశంలో ఉపయోగపడవని ఐసీఎంఆర్‌‌‌‌ చెప్తోంది. ఆ రేంజ్‌‌‌‌లో యాంటీ మైక్రోబియల్‌‌‌‌ రెసిస్టెన్స్‌‌‌‌ పెరిగింది మరి. దీనికి కారణం ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్స్ వాడటమే. ఇలా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరగడం వల్ల కొన్ని రకాల జబ్బులకు ఇప్పుడున్న మందులు పనిచేయడం లేదు. దాంతో ట్రీట్మెంట్ కష్టమవుతోంది. ఇది ప్రాణాలు కోల్పోయే స్థితికి కారణమవుతోంది.
 

యాంటీబయాటిక్స్ అంటే..

సాధారణంగా శరీరంలో, బయట వాతావరణంలో కంటికి కనిపించని రకరకాల చిన్న చిన్న క్రిములు ఉంటాయని,  వీటిని బ్యాక్టీరియా, వైరస్  అంటారని తెలిసిందే. వైరస్‌‌‌‌ల సంగతి అటుంచితే బ్యాక్టీరియాలో ఆరోగ్యానికి మంచి చేసేవి, హాని చేసేవి రెండు రకాలుంటాయి. మంచి చేసే బ్యాక్టీరియాను ‘ప్రోబ్యాక్టీరియా’ అంటారు. ఇవి కాకుండా మిగతావన్నీ చెడు బ్యాక్టీరియా కిందకే వస్తాయి. ఇవి శరీరంలోకి ప్రవేశిస్తే రకరకాల జబ్బులు, ఇన్ఫెక్షన్లు వస్తాయి. శరీరంలోకి చొరబడిన చెడు బ్యాక్టీరియాను చంపేందుకు మనుషులు కనిపెట్టిన మందులే యాంటీబయాటిక్స్. వీటిలో ఉండే కెమికల్స్.. శరీరంలోని బ్యాక్టీరియాను చంపి, అవి వ్యాపించకుండా చేస్తాయి. అలా జబ్బులు తగ్గడానికి హెల్ప్ చేస్తాయి.

ఎలా పనిచేస్తాయి

మామూలుగా ఇన్ఫెక్షన్ సోకితే శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్ దాంతో పోరాడి తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఇమ్యూనిటీ కూడా పోరాడలేనంతగా బ్యాక్టీరియా పెరిగిపోయినప్పుడు యాంటీబయాటిక్స్ సాయం అవసరం అవుతుంది అంటున్నారు డాక్టర్ గురు ప్రసాద్​. “యాంటీబయాటిక్స్ మందులు వేసుకున్నప్పుడు అవి శరీరంలోకి వెళ్లి, ఇన్ఫెక్షన్‌‌‌‌కు కారణమైన బ్యాక్టీరియాను పసిగడతాయి. తర్వాత వాటిపై దాడి చేసి  క్రిముల సంఖ్య పెరగకుండా వాటి కణాల గోడలను పగలగొడతాయి. అలా బ్యాక్టీరియా సంఖ్యను తగ్గిస్తాయి. అప్పుడు శరీరంలోని ఇమ్యూనిటీ మళ్లీ పుంజుకుని ఇన్ఫెక్షన్‌‌‌‌తో పోరాడి దాన్ని తగ్గిస్తుంది. ఏ ఇన్ఫెక్షన్లకు ఏ బ్యాక్టీరియా కారణం? వాటికి ఏ యాంటీబయాటిక్స్‌‌‌‌ ఇవ్వాలి? అనేది డాక్టర్లకు తెలుసు కాబట్టి వాళ్లు డోసేజ్ ప్రకారం ఎన్నిరోజులు వాడాలో చెప్తారు. అలా వాడితే జబ్బు తగ్గుతుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు మాత్రలు వేసుకుంటే కొంతకాలానికి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరుగుతుంది.

రెసిస్టెన్స్ అంటే..

కరోనా వైరస్ తన శక్తిని పెంచుకుంటూ కొత్తకొత్త మ్యుటేషన్లుగా ఎలా డెవలప్ అయిందో బ్యాక్టీరియా కణాలు కూడా అంతే. యాంటీబయాటిక్ మాత్రలు ఎక్కువగా వేసుకునేవాళ్లలో బ్యాక్టీరియా కణాలు వాటిని తట్టుకునే శక్తిని పొందుతాయి. మందులను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటాయి. దీన్నే ‘యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్‌‌‌‌)’ అంటారు . 

ఉదాహరణకు ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌‌‌‌ వల్ల జ్వరంతో బాధపడే వ్యక్తికి డాక్టర్ యాంటీబయాటిక్‌‌‌‌ మందులు రాసి, వారం రోజులు వాడాలని చెప్తాడు. కానీ, ఆ మందులు వేసుకున్నాక రెండుమూడు రోజుల్లో జ్వరం తగ్గిపోగానే ఆ వ్యక్తి మందులు వాడడం ఆపేస్తాడు. దీనివల్ల అతడి శరీరంలో మిగిలి ఉన్న  బ్యాక్టీరియా కణాలు యాంటీబయాటిక్‌‌‌‌ మందుకి ఎక్స్‌‌‌‌పోజ్‌‌‌‌ అవుతాయి. అవి.. దాన్ని అలవాటు చేసుకుని బతకడం నేర్చుకుంటాయి. ఇలాగే ఎక్కువసార్లు జరిగితే ఆ బ్యాక్టీరియాను ఆ మందు ఏమీ  చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీన్నే ‘యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్‌‌‌‌’ అంటారు” అని వివరించారు. -డాక్టర్ గురు ప్రసాద్.

రెసిస్టెన్స్ ఎక్కువైతే..

అయితే ఈ రెసిస్టెన్స్ అనేది మనుషులకే కాదు, బ్యాక్టీరియా జాతికి కూడా పెరుగుతుంది. ఇలా రెసిస్టెన్స్ పెంచుకున్న బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించినప్పుడు వాళ్లకు కూడా మందులు పనిచేయవు. అంటే ఇది ఒకరి సమస్య కాదు. అందరి సమస్య. ఎక్కువమంది విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడుతుండడం వల్ల కొన్నిరకాల బ్యాక్టీరియాలు విపరీతమైన రెసిస్టెన్స్‌‌‌‌ పెంచుకుంటున్నాయి. దాంతో ఎవరికి ఆ బ్యాక్టీరియా సోకినా మందులు వాటిపై ప్రభావం చూపలేకపోతున్నాయి. ఇలా అతిగా మందులు వాడే అలవాటు వల్ల తెలియకుండానే రాబోయే తరాలపై ఎఫెక్ట్ పడుతుంది.
యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరిగిన వాళ్లకు కొన్నిరకాల యాంటీబయాటిక్ మందులు ఎలాంటి రిజల్ట్ చూపించవు. ఎందుకంటే వాళ్ల శరీరంలో ఉన్న బ్యాక్టీరియాకు యాంటీబయాటిక్ మందులకు దొరక్కుండా పెరగడం తెలుసు. దీనివల్ల ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మందులు పనిచేయవు. అప్పుడు డాక్టర్లు ఎక్కువ పవర్ ఉన్న యాంటీబయాటిక్స్ లేదా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ డోస్ ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి. కొన్ని ఆర్గాన్స్ దెబ్బతింటాయి.  ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న సమస్య ఇదే. ఇలా రెసిస్టెన్స్ పొందిన బ్యాక్టీరియాల్లో  ‘క్లెబ్సియెల్లా న్యుమోనియా’ ముందుంది. ఇది న్యుమోనియాకు కారణమయ్యే బ్యాక్టీరియా.  దీనివల్ల 2019లో దక్షిణాసియాలో 61,800 మంది చనిపోయారు. అలాగే ‘ఇ.కొలి(ఎక్చరిషియా కొలి)’ అనే మరో బ్యాక్టీరియా వల్ల 63,300 మరణించారు.

భయపెడుతున్న సూపర్ బగ్స్

యాంటీబయాటిక్  రెసిస్టెన్స్‌‌‌‌ను పొందిన బ్యాక్టీరియా నుంచి వచ్చే తరువాతి తరాల బ్యాక్టీరియాలను ‘సూపర్‌‌‌‌ బగ్స్‌‌‌‌’ లేదా ‘డ్రగ్‌‌‌‌ రెసిస్టెంట్‌‌‌‌ మైక్రోబ్స్‌‌‌‌’ అంటారు. ఇవి సాధారణ యాంటీబయాటిక్స్‌‌‌‌కు లొంగవు.  ఇవి ఎంతటి యాంటీ డోస్‌‌‌‌నైనా తట్టుకునేలా తయారవుతాయి. అందుకే వీటినే ‘సూపర్ బగ్స్’ అని పిలుస్తున్నారు. వీటిని ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులేవీ చంపలేవు.  వీటి కోసం కొత్త మందులు కనిపెట్టాలి. అందుకే  సూపర్ బగ్స్‌‌‌‌ను ‘సీక్రెట్ ప్యాండెమిక్’ అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ).

కొన్నేండ్ల క్రితం ఢిల్లీలో పుట్టి, ఇతర దేశాలకు వ్యాపించిన ఓ సూపర్ బగ్‌‌‌‌ను స్వీడన్‌‌‌‌లో  కనుగొన్నారు. ఈ సూపర్ బగ్ పేరు ‘ఎన్‌‌‌‌.డి.ఎమ్(న్యూఢిల్లీ మెటాలో బీటా లాక్టమేజ్)’. ఈ సూపర్ బగ్ దాదాపు అన్ని రకాల యాంటీబయాటిక్స్‌‌‌‌ను తట్టుకునే పవర్ సంపాదించింది. ఈ బ్యాక్టీరియాను చంపాలంటే కొత్త మందు కనిపెట్టాలి. యాంటీబయాటిక్స్ వాడకంలో దేశంలో ఢిల్లీ టాప్ లో ఉంది. ఢిల్లీలో ఉండేవాళ్లు ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల అక్కడ వ్యాపించే బ్యాక్టీరియాలు మ్యుటేషన్ చెంది, వాటి నుంచి ఈత కొత్త సూపర్ బగ్ తయారైంది. అదే ఎన్‌‌‌‌.డి.ఎమ్‌‌‌‌. ఇలాంటి సూపర్ బగ్స్ ఇప్పుడు చాలా పుట్టుకొస్తున్నాయి. 

గొప్ప ఇన్వెన్షన్

యాంటీబయాటిక్స్‌‌‌‌తో వస్తున్న ప్రాబ్లమ్స్ చూసి చాలామంది అసలు యాంటీబయాటిక్ మందులే మంచివి కావనుకుంటారు. కానీ, నిజానికి యాంటీబయాటిక్స్ అనేవి ఒక గొప్ప ఇన్వెన్షన్. ఏ మందునైనా అవసరమైనప్పుడు తగిన డోసేజ్‌‌‌‌లో వాడితే మంచి రిజల్ట్ వస్తుంది. అనవసరంగా వాడితే మంచి జరగకపోగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఒకప్పుడు ‘కలరా’ లాంటి అంటు వ్యాధులు సోకినప్పుడు ‘పెన్సిలిన్‌‌‌‌’ వంటి యాంటీబయాటిక్స్‌‌‌‌ కొన్ని కోట్లమంది  ప్రాణాలు కాపాడాయి. ఒకరి నుంచి మరొకరికి సోకే అంటు వ్యాధుల నుంచి, తీవ్ర ఇన్ఫెక్షన్ల వరకు మనషులను,  జంతువులను, మొక్కలను కాపాడటంలో యాంటీబయాటిక్స్ ఎంతో తోడ్పడ్డాయి. ముఖ్యంగా సర్జరీలు, అవయవ మార్పిడి, కేన్సర్‌‌‌‌ ట్రీట్మెంట్స్‌‌‌‌ను ఇవి మరింత ఈజీ చేశాయి. అయితే, రానురాను జనాలు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల ఆ మందులకు కొన్ని బ్యాక్టీరియాలు లొంగట్లేదు.  పేషెంట్ల ప్రాణాల్ని కాపాడేందుకు చివరి ప్రయత్నంగా చేసే ట్రీట్మెంట్స్‌‌‌‌లో కూడా ఇవి పనిచేయడం లేదు. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్‌‌‌‌ వల్ల ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వారిలో 90 శాతం మంది ఆసియా, ఆఫ్రికా దేశాల వాళ్లే. ఈ సైలెంట్ మహమ్మారిని కంట్రోల్  చేయకపోతే 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి కోటి మంది చనిపోతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఇప్పటికే యాంటీబయాటిక్స్ మందులు రెండు జనరేషన్స్ దాటి మూడో జనరేషన్‌‌‌‌కు చేరుకున్నాయి. అంటే.. రెండు జనరేషన్స్‌‌‌‌లో తయారైన మందులు పనిచేయకుండా పోయాయని అర్థం.

మనమేం చేయాలి?

డాక్టర్ చిట్టీ లేకుండా మందులు తీసుకోవడం మానేయాలి. తలనొప్పి వచ్చినా, జలుబు చేసినా మెడికల్ షాపుకు వెళ్లి మాత్రలు అడిగి తీసుకోవడం తగ్గించాలి.  ప్రతి చిన్నదానికి యాంటీబయాటిక్స్ వాడితే కొంతకాలానికి శరీరం వాటికి అలవాటు పడిపోతుంది. అలాగే కొంతమంది డాక్టర్ ఇచ్చిన కోర్సు పూర్తవ్వకుండానే.. తగ్గింది కదా అని  మధ్యలోనే మందులు ఆపేస్తుంటారు. ఇది కూడా ప్రమాదమే. ఎందుకంటే.. లక్షణాలు తగ్గిన తర్వాత కూడా శరీరం లోపల బ్యాక్టీరియా ఉంటుంది. డాక్టర్లు ఇచ్చిన కోర్సును పూర్తిగా వాడితే బ్యాక్టీరియా పూర్తిగా చనిపోతుంది. మధ్యలో ఆపేస్తే మిగిలి ఉన్న కొద్దిపాటి బ్యాక్టీరియా మందులను అలవాటు చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఇంకోసారి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది యాంటీబయాటిక్స్‌‌‌‌ను తట్టుకుని నిలబడుతుంది. 

బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు రాకుండా పరిసరాలను క్లీన్‌‌‌‌గా ఉంచుకోవాలి. తినేముందు శానిటైజర్‌‌‌‌‌‌‌‌తో చేతులు కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి. ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ తీసుకుంటుండాలి. మాంసం, కూరగాయలను ఉప్పునీటితో కడిగి ఆ తర్వాత వండాలి. హాస్పిటల్స్‌‌‌‌కు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు చెయ్యి అడ్డుపెట్టుకోవాలి. టైంకి వ్యాక్సిన్లు వేయించుకోవాలి. ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ అవసరమో కాదో డాక్టర్‌‌‌‌‌‌‌‌ను అడగాలి. 

మందులు ఎలా వాడాలి

ఏదైనా జబ్బు చేసినప్పుడు అది వైరల్‌‌‌‌ ఇన్ఫెక్షనా? లేక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా? అన్నది తెలుసుకోవాలి. ‘బ్యాక్టీరియా కల్చర్‌‌‌‌ టెస్ట్’ లేదా ‘డ్రగ్ కల్చర్ టెస్ట్’  ద్వారా దాన్ని తెలుసుకోవచ్చు. ఒకవేళ వచ్చింది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే డాక్టర్‌‌‌‌‌‌‌‌ను అడిగి యాంటీబయాటిక్స్‌‌‌‌ కోర్సు వాడాలి. ఉదాహరణకు న్యుమోనియా అనేది వైరల్, బ్యాక్టీరియా, ఫంగస్‌‌‌‌ వంటి మూడు ఇన్ఫెక్షన్ల కారణంగా వస్తుంది. ఇది చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఈ జబ్బుకి మందులు వాడేటప్పుడు  బ్యాక్టీరియా కల్చర్, అవసరమైతే డ్రగ్‌‌‌‌ కల్చర్‌‌‌‌  టెస్ట్‌‌‌‌లు చేసి తప్పదని తేలితేనే యాంటీబయాటిక్స్‌‌‌‌ వాడాలి. 
యాంటీబయాటిక్స్‌‌‌‌లో రెండు రకాలు ఉంటాయి. ‘న్యారో స్ప్రెక్టమ్‌‌‌‌’ యాంటీబయాటిక్స్‌‌‌‌ ఒకే రకమైన బ్యాక్టీరియాకు పనిచేస్తాయి. ‘బ్రాడ్‌‌‌‌ స్ప్రెక్టమ్‌‌‌‌’ యాంటీబయాటిక్స్‌‌‌‌ రెండు మూడు రకాల బ్యాక్టీరియాల నివారణకు పనిచేస్తాయి. ఏ జబ్బుకు, ఏ యాంటీబయాటిక్స్ అవసరం అనేది డాక్టర్లకు మాత్రమే తెలుస్తుంది. గర్భిణులకు కొన్ని రకాల యాంటీబయాటిక్స్‌‌‌‌ వాడటం చాలా ప్రమాదకరం. డాక్టర్ చెప్పకుండా యాంటీబయాటిక్స్‌‌‌‌ వాడటం వల్ల  శిశువులో అవయవలోపాలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. అందుకే డాక్టర్ చెప్పకుండా యాంటీబయాటిక్స్‌‌‌‌తో ప్రయోగాలు చేయకూడదు. యాంటీబయాటిక్స్ వాడడం వల్ల శరీరంలో ఉండే మంచి బ్యాక్టీరియాపై కూడా ఎఫెక్ట్  పడుతుంది. దానివల్ల శరీరంలోని చాలా వ్యవస్థలు దెబ్బతింటాయి.  

ఇవి పనిచేయడం లేదు

గతంలో ట్రీట్మెంట్ చేసి తగ్గించగలిగిన సాధారణ అంటువ్యాధులు కూడా ఇప్పుడు ప్రాణాలు తీస్తున్నాయి. ఎందుకంటే.. ఆ అంటువ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా.. మందులను తట్టుకోగలుగుతున్నాయి. ‘న్యుమోనియా’, ‘సెప్టిసేమియా’ లాంటి జబ్బులకు ఐసీయూలో ఉపయోగించే శక్తివంతమైన యాంటీబయాటిక్‌‌‌‌ ‘కార్బాపెనెమ్‌‌‌‌’ ఇకపై మనదేశంలో చాలామందికి ఉపయోగపడదని ఈ మధ్య  ఐసీఎంఆర్‌‌‌‌ చేసిన సర్వేలో తేలింది. 
‘ఇ.కోలి’ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల ట్రీట్మెంట్‌‌‌‌కు వాడే ‘ఇమిపెనెమ్‌‌‌‌’ రెసిస్టెన్స్ 2016లో 14 శాతం మందికే ఉండగా, 2021 నాటికి అది 36 శాతానికి చేరుకుంది. కొన్నిరకాల యాంటీబయాటిక్‌‌‌‌లతో ‘క్లెబ్సియెల్లా న్యుమోనియా’ 2016లో 65 శాతం తగ్గగా, 2020లో 45 శాతం, 2021లో 43 శాతం మాత్రమే తగ్గింది. ‘కార్బాపెనెమ్‌‌‌‌’ అనే మరో యాంటీబయాటిక్‌‌‌‌ను కూడా చాలా ఇన్ఫెక్షన్లు తట్టుకుంటున్నాయి. మూత్రకోశ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ‘ఎసినెటోబాక్టర్‌‌‌‌ బౌమని’ అనే బ్యాక్టీరియా కూడా ‘కార్బాపెనెమ్‌‌‌‌’ను తట్టుకుంటుంది. దాంతో ఆ పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయడం కష్టంగా మారుతోంది.

వందేండ్ల క్రితమే..

1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే సైంటిస్ట్ ‘పెన్సిలియమ్’ అనే ఫంగస్ నుంచి ‘పెన్సిలిన్’ అనే యాంటీబయాటిక్‌‌‌‌ను కనుగొన్నాడు. పెన్సిలిన్ తర్వాత మెడికల్ రంగం ఎంతగానో మారింది. అది కొన్ని కోట్ల ప్రాణాలను కాపాడింది. ప్రపంచానికి అంత గొప్ప మందును అందించిన ఫ్లెమింగ్..  నోబెల్ అవార్డు తీసుకునేటప్పుడు ఒకమాట చెప్పాడు. ‘ సరైన రీతిలో వాడకపోతే పెన్సిలిన్ మేలు కంటే ఎక్కువ కీడు చేయగలదు’ అని. అయితే, ఆయన చెప్పింది ఒక్క పెన్సిలిన్ గురించే  కాదు, అన్ని రకాల యాంటీబయాటిక్స్‌‌‌‌కూ ఆ మాట వర్తిస్తుంది. దాదాపు వందేండ్ల తర్వాత ఆయన చెప్పిన మాట నిజమే అనిపిస్తుంది. 

మనది మూడో ప్లేసు

ప్రపంచంలో మధ్య ఆసియా, దక్షిణాసియా, ఆఫ్రికా దేశాల్లో యాంటీబయాటిక్స్ వాడకం ఎక్కువగా ఉంది.  మనదేశంలో 2010 నుంచి 2020 మధ్య  యాంటీబయాటిక్స్ వాడకం 48 శాతం పెరిగింది.  కొవిడ్ తో ఇది ఇంకా ఎక్కువైంది. ఒక్క 2019లో 500 కోట్ల యాంటీబయాటిక్ మాత్రలు అమ్ముడైనట్లు లెక్కలు చెప్తున్నాయి. అందులో ‘అజిత్రోమైసిన్’ ఫస్ట్ ప్లేస్‌‌‌‌లో ఉంటే  ‘సెఫిక్సిమ్ 200 ఎంజీ’ టాబ్లెట్‌‌‌‌ రెండో ప్లేస్‌‌‌‌లో ఉంది .

2018–2019 లెక్కలకు గాను యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతున్న దేశాల్లో మనదేశం ఫస్ట్ ప్లేస్‌‌‌‌లో ఉంది.  రీసెంట్‌‌‌‌గా బోస్టన్  యూనివర్సిటీకి చెందిన టీం, ‘పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఇండియా’ కలిసి మనదేశంలో యాంటీబయాటిక్‌‌‌‌ మందుల వాడకంపై ఓ సర్వే చేశాయి. అందులో యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతున్న రాష్ట్రాల్లో ఢిల్లీ మొదటి ప్లేస్‌‌‌‌లో ఉంటే పంజాబ్, తెలంగాణ  వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, బీహార్, రాజస్తాన్, జార్ఖండ్, ఒడిశా ఉన్నాయి. అలాగే మనదేశంలో వాడుతున్న యాంటీబయాటిక్స్‌‌‌‌లో 90 శాతం ప్రైవేట్ హాస్పిటల్స్, డాక్టర్లు రాసినవి అయితే గవర్నమెంట్ హాస్పిటల్స్‌‌‌‌లో ఇచ్చినవి 10 శాతమే. 

2019లో  వాడిన మందుల్లో మొత్తం డిఫైన్డ్‌‌‌‌ డైలీ డోసేజ్‌‌‌‌ 5,071 మిలియన్లు. ఆ మెడిసిన్స్‌‌‌‌లో  ‘సెంట్రల్‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌ స్టాండర్డ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ ఆర్గనైజేషన్’ గుర్తింపు పొందినవి కేవలం 47.1 శాతమే. యాంటీబయాటిక్స్‌‌‌‌ను తట్టుకునే శక్తి పొందిన సూపర్ బగ్స్ వల్ల వచ్చే అంటువ్యాధుల కారణంగా 2019లో ప్రపంచవ్యాప్తంగా 12లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని రిపోర్ట్‌‌‌‌లు  చెప్తున్నాయి.

పేషెంట్లు చేసే తప్పులు

ఒకటి రెండు రోజుల జ్వరానికి కూడా ఓపిక పట్టలేక యాంటీబయాటిక్స్ మొదలుపెట్టడం.
జబ్బు చేసినప్పుడు సరైన టైంలో సరైన డాక్టర్‌‌‌‌‌‌‌‌ను కలవకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం.
డాక్టరు ఒకరి కోసం ఇచ్చిన మందుల్ని మరొకరు వాడడం. 
డాక్టర్ ఇచ్చిన కోర్సు పూర్తి చేయకుండా.. కాస్త రిలీఫ్ అనిపించగానే మందులు మధ్యలో ఆపేయడం.
హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు డైరెక్ట్‌‌‌‌గా మందులషాపుకి పరిగెత్తడం. 

డాక్టర్లు చేసే మిస్టేక్స్

పేషెంట్లు అడుగుతున్నారని అవసరం లేకపోయినా యాంటీబయాటిక్స్ రాయడం. 
ప్రభుత్వాలు సూచించిన యాంటీబయాటిక్ ప్రొటోకాల్​ను స్ట్రిక్ట్‌‌‌‌గా పాటించకపోవడం.
పేషెంట్‌‌‌‌కు ‘కల్చర్ టెస్ట్’, ‘డ్రగ్ టెస్ట్’ చేయకుండానే యాంటీబయాటిక్ మందులు రాయడం.
రెండు మూడు రకాల మందులు ఒకేసారి రాయడం, వైరల్ ఇన్ఫెక్షన్లకు కూడా యాంటీబయాటిక్స్ రాయడం. 

మెడికల్ షాపుల వాళ్లు చేసే మిస్టేక్స్

అడగ్గానే యాంటీబయాటిక్ మాత్రలు చేతిలో పెట్టేయడం.
డాక్టరు చిట్టీ లేకుండా యాంటీ బయాటిక్స్ ఇవ్వడం.
లక్షణాలు తెలుసుకుని సొంతంగా మందులు ఇవ్వడం.

సరిదిద్దాలంటే..

ప్రభుత్వాలు డ్రగ్స్ వాడకాన్ని, డిస్ట్రిబ్యూషన్‌‌‌‌ను కంట్రోల్ చేసే గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ తీసుకురావాలి. 
ఇతర దేశాల మాదిరిగా యాంటీబయాటిక్స్‌‌‌‌పై  స్ట్రిక్ట్ ప్రొటోకాల్ పాటించేలా చేయాలి.
యాంటీబయాటిక్ వాడకం, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్‌‌‌‌పై అవేర్‌‌‌‌‌‌‌‌నెస్ ప్రోగ్రామ్స్‌‌‌‌ తీసుకురావాలి

సూపర్ బగ్స్ ఇవే..

ప్రస్తుతం మనదేశంలో జెంటామైసిన్‌‌‌‌, అమికాసిన్‌‌‌‌, పెన్సిలిన్‌‌‌‌, ఆక్సాసిలిన్‌‌‌‌, జాల్పిడెమ్‌‌‌‌, సెఫాలెక్సిన్‌‌‌‌, నార్‌‌‌‌ఫ్లాక్సాసిన్‌‌‌‌, సెఫా క్లోర్‌‌‌‌, సెఫ్డినీర్‌‌‌‌, టైజిసైక్లిన్‌‌‌‌, టోబ్రామైసిన్‌‌‌‌, వాంకోమైసిన్‌‌‌‌, సెఫ్పిరోమ్‌‌‌‌, లైన్‌‌‌‌జోలిడ్‌‌‌‌, కోలిస్టిన్‌‌‌‌, డోరిపెనెమ్‌‌‌‌, మాక్సిఫ్లాక్సాసిన్‌‌‌‌, మోరోపినిమ్‌‌‌‌, ఇంపెనెమ్‌‌‌‌, ఎర్టాపెనెమ్‌‌‌‌, డైరోపెనెమ్‌‌‌‌ వంటి యాంటీబయాటిక్స్‌‌‌‌ వాడకం విపరీతంగా పెరిగిపోతోంది.  
ప్లూరోక్వినాలోన్స్‌‌‌‌, పెన్సిలిన్‌‌‌‌, మిథిసిలిన్‌‌‌‌, జెంటామైసిన్‌‌‌‌, అమికాసిన్‌‌‌‌, ప్లూరోక్వినాలోన్స్‌‌‌‌, 4వ జనరేషన్ సెఫలోస్పోరిన్లు, పెఫ్లాక్సిసిన్‌‌‌‌ లాంటి యాంటీబయాటిక్ మందులు ఎఫెక్టివ్‌‌‌‌గా పనిచేయడం లేదు.
మనదేశంలో ప్రస్తుతం ఇ.కొలి, క్లెబిసెల్లా న్యుమోనియా, స్ట్రెప్టోకాకస్‌‌‌‌ ఆరస్‌‌‌‌, ఎమ్‌‌‌‌ఆర్ఎస్ఏ,  స్ట్రెప్టోకాకస్‌‌‌‌ న్యుమోనే, సాల్మొనెల్లా (ఎన్‌‌‌‌టీఎస్‌‌‌‌), షిగెల్లా, గనేరియా లాంటి బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్ మందులను తట్టుకునేలా రెసిస్టెన్స్ పెంచుకున్నాయి. వీటిలో  ఎమ్‌‌‌‌ఆర్ఎస్ఏ (మెథిసిలిన్-రెసిస్టెంట్ స్టెఫిలోకాకస్ ఆరియస్) చాలా ప్రాణాంతకమైనదిగా తయారైంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మల్టీడ్రగ్ రెసిస్టెంట్ స్యూడోమోనాస్(చలిజ్వరం, స్కిన్ ఎలర్జీ, కీళ్లనొప్పులు, షాక్ కు గురవ్వడం, కన్ఫ్యూజన్), వాంకోమైసిన్ రెసిస్టెంట్ ఎంటెరోకోకస్(జ్వరం, పల్స్ పడిపోవడం, ఒళ్లు నొప్పులు), ఈఎస్‌‌‌‌బీఎల్- ప్రొడ్యూసింగ్ ఎంటెరోబ్యాక్టెరియేస్(రక్త విరేచనాలు, జ్వరం, కడుపునొప్పి, ఆకలి లేకపోవడం ), ఎంఆర్ఎస్ఏ, వీఆర్ఎస్ఏ(ఎర్రటి దుద్దుర్లు, నొప్పి, జ్వరం, వాపు),  కార్బపెనామ్ రెసిస్టెంట్ ఎంటెరోబ్యాక్టెరియేస్(ఊపిరి అందకపోవడం, స్కిన్ ఇన్ఫెక్షన్, కడుపునొప్పి, స్పృహ కోల్పోవడం), న్యూఢిల్లీ మెటాలో బీటా లాక్టమేజ్(బ్లడ్ ఇన్ఫెక్షన్, న్యుమోనియా, దద్దుర్లు) లాంటి సూపర్ బగ్స్ జబ్బులు భయపెడుతున్నాయి.

బ్యాక్టీరియా vs వైరస్

చాలామందికి తెలియని విషయమేంటంటే బ్యాక్టీరియా, వైరస్.. ఈ రెండు వేరు అని. జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షన్లు వైరస్ వల్ల వస్తాయి. వాటికి యాంటీబయాటిక్ మందులు పనిచేయవు. కానీ, అది తెలియక చాలామంది ప్రతి ఇన్ఫెక్షన్‌‌‌‌కు యాంటీబయాటిక్స్ వాడుతుంటారు. ప్రపంచంలో 40 నుంచి 70 శాతం యాంటీబయాటిక్స్‌‌‌‌ను వైరల్‌‌‌‌ జబ్బుల కోసమే వాడుతున్నట్టు ఓ అంచనా. వైరస్‌‌‌‌ల కంటే బ్యాక్టీరియాలు సైజులో పెద్దవిగా ఉంటాయి. బ్యాక్టీరియా సొంతంగా పెరగగలదు.  వైరస్‌‌‌‌లు పెరగాలంటే జీవమున్న వేరే కణాలపై ఆధారపడాలి. బ్యాక్టీరియాను ఎదుర్కోవడం తేలిక. యాంటీబయాటిక్స్‌‌‌‌ మందులతో వాటిని చంపేయొచ్చు. వైరస్‌‌‌‌లు వేరే కణాలపై ఆధారపడి పెరుగుతాయి. కాబట్టి వాటిపై యాంటీబయాటిక్స్‌‌‌‌ పనిచేయవు. వైరస్ రకాన్ని బట్టి యాంటీ వైరస్  మందులు వాడాలి. చికెన్‌‌‌‌పాక్స్, స్మాల్‌‌‌‌పాక్స్, మీజిల్స్, రేబిస్, ఎయిడ్స్, కొవిడ్‌‌‌‌ 19, హైపటైటిస్‌‌‌‌ ఏ, బి(కామెర్లు), తట్టు, ఆటలమ్మ, పోలియో, గవదబిళ్లలు, మెదడువాపు, ఫ్లూ, పోలియో , జలుబు, మలేరియా వంటివి వైరస్‌‌‌‌ల వల్ల వచ్చే జబ్బులు. క్షయ, న్యుమోనియా, డిఫ్తీరియా, పెర్టుసిస్ (కోరింత దగ్గు),  ప్లేగు, లెప్రసీ(కుష్టు ), ఆంథ్రాక్స్,  బొటులిజం(ఫుడ్ పాయిజనింగ్),  కలరా, షిజెల్లోసిస్, టైఫాయిడ్, ఇ.కొలి, టెటనస్ (ధనుర్వాతం),  గనేరియా వంటివి బ్యాక్టీరియా ద్వారా వచ్చే జబ్బులు.

అవేర్‌‌‌‌‌‌‌‌నెస్ ఒక్కటే మార్గం

“ఏ రోగమైనా తగ్గించుకోవడానికి ఓ పద్ధతి ఉంది. తగ్గడానికి కొంత టైం పడుతుంది. కానీ, ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌‌‌‌స్టైల్ కారణంగా రోగం త్వరగా తగ్గాలని షార్ట్ కట్స్ కోసం వెతుకుతున్నారు చాలామంది. అందుకే రోగాన్ని పూర్తిగా తగ్గించే మార్గాల వైపు చూడకుండా.. టెంపరరీ రిలీఫ్ కోసం చూస్తున్నారు. ‘యాంటీబయాటిక్ వేస్తే చాలు, ఏ రోగమైనా ఇట్టే తగ్గిపోతుంది’ అనుకుంటున్నారు. ‘కొన్ని రోజులకు మళ్లీ వచ్చినా.. ఇంకో టాబ్లెట్ వేసుకోవచ్చులే’ అన్న ధోరణి బాగా పెరిగిపోయింది. దీనివల్ల పేషెంట్లే నష్టపోతున్నారు. పదేపదే మందులు వాడి, ఇమ్యూనిటీ తగ్గించుకుంటున్నామని గుర్తించ లేక పోతున్నారు. 

యాంటీబయాటిక్స్ ‘ఓవర్ ద కౌంటర్’ అందుబాటులో ఉండడంతో వాళ్లకు వాళ్లే డాక్టర్లు అయిపోయి మందులు కొని, వేసుకుంటున్నారు. జలుబు చేసినప్పుడు యాంటీబయాటిక్ టాబ్లెట్స్ వేసుకుంటారు చాలామంది. కానీ, నిజానికి జలుబు బ్యాక్టీరియా వల్ల కాదు.. వైరస్ వల్ల వస్తుంది. ఆ సంగతి తెలియక యాంటీబయాటిక్స్ వేసుకుంటుంటారు.  బ్యాక్టీరియా వల్ల వచ్చే జబ్బులకు వాడాల్సిన మందులను.. పనిచేయవని తెలిసినా.. వైరస్ జబ్బులకు వాడుతున్నారు. యాంటీబయాటిక్స్ వాడితే ఏ రోగమైనా త్వరగా తగ్గిపోతుందనే ఫీలింగ్ బాగా ఉంది. ఒకవేళ డాక్టర్ రాయకపోయినా.. రోగులే అడిగి మరీ రాయించుకుంటున్నారు. రాయకపోతే.. మందుల షాపుకి వెళ్లి డైరెక్ట్‌‌‌‌గా కొనుక్కుంటున్నారు. అమెరికాలో యాంటీబయాటిక్స్ వాడకాన్ని కంట్రోల్ చేయడం కోసం నేషనల్ యాక్షన్ ప్లాన్‌‌‌‌ను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రూపంలో అమల్లోకి తెచ్చారు. బ్రిటన్‌‌‌‌లో కూడా తప్పనిసరి అయితేనే యాంటీబయాటిక్స్ రాయాలని గైడ్ లైన్స్ ఇచ్చారు డాక్టర్లకు. ఇండియాతో పోలిస్తే.. అమెరికా, బ్రిటన్​ దేశాల్లో డ్రగ్ కంట్రోల్ సిస్టమ్ కాస్త మెరుగ్గా ఉంది . ఆయా దేశాల్లో పేషెంట్లు ఒత్తిడి చేసినా.. డాక్టర్లు యాంటీబయాటిక్స్ రాయరు.  అయితే మన దగ్గర  హాస్పిటల్స్ పూర్తిగా ప్రభుత్వం కంట్రోల్‌‌‌‌లో లేవు. కాబట్టి  డ్రగ్ కంట్రోల్ రూల్స్‌‌‌‌ను అమలు చేయడం కష్టం.  ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మే ట్రెండ్‌‌‌‌ను తగ్గించలేం. అలాగని  యాంటీబయాటిక్స్ విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే.. ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్టే అవుతుంది. అందుకే యాంటీబయాటిక్స్ వాడకంపై జనాల్లో అవేర్‌‌‌‌‌‌‌‌నెస్ తీసుకురావాలి. అవేర్‌‌‌‌‌‌‌‌నెస్ ఒక్కటే ఈ సమస్యకు మార్గం. ”

– డాక్టర్ శ్రావణి రెడ్డి, కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్, రెనోవా హాస్పిటల్స్

పశువులకు కూడా..

మనుషుల్లో కంటే జంతువుల్లో యాంటీబయాటిక్స్ వాడకం విపరీతంగా పెరిగింది. మనుషులతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ యాంటీబయాటిక్స్ జంతువులకు వాడుతున్నారు. వ్యవసాయం,  పశువుల వైద్యంలో కూడా యాంటీ బయాటిక్స్ వాడకం పెరిగిపోవడం వల్ల ఆ ఎఫెక్ట్ మనుషులపై పడుతోందని డబ్ల్యూహెచ్ఓ అంటోంది. బర్రెలకు యాంటీ బయాటిక్స్ ఇవ్వడం వల్ల వాటి పాలల్లో ఆ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అలాగే పంటలకు యాంటీబయాటిక్ మందులు చల్లడం ద్వారా కూరగాయలు, ధాన్యం, ఇతర పంటల్లో కూడా యాంటీబయాటిక్ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. దీనివల్ల కూడా యాంటీ బయాటిక్స్ రెసిస్టెన్స్ పెరుగుతోందనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్ట్.

::: తిలక్​