కేసీఆర్​ చెప్పి ఏడాదైనా మొదలు కాని సమగ్ర భూసర్వే

కేసీఆర్​ చెప్పి ఏడాదైనా మొదలు కాని సమగ్ర భూసర్వే

పైలట్ గ్రామాల సెలక్షన్ దగ్గరే ఆగిన ప్రక్రియ 
అప్లికేషన్లు తీసుకున్నా ఇప్పటికీ పూర్తి కాని సర్వే ఏజెన్సీల ఎంపిక
2014 ఎన్నికల మేనిఫెస్టో హామీకి కలగని మోక్షం
‘ధరణి’ సమస్యలకు  సర్వేనే పరిష్కారమంటున్న నిపుణులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సమగ్ర భూసర్వే మొదలవుతుందని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించి ఏడాదవుతున్నా ఇప్పటి వరకూ మొదలు కాలేదు. సీఎం చెప్పినట్లు 2021 జూన్ 11న ప్రారంభం కావాల్సిన సర్వే.. 2022 జూన్ 11 వచ్చినా ముందుకు కదలడం లేదు. సమగ్ర భూసర్వే చేపట్టకుండా కేవలం రికార్డు టు రికార్డు పద్ధతిలో భూరికార్డుల ప్రక్షాళన చేపట్టడం, అదే డేటాతో ధరణి పోర్టల్​ను రూపకల్పన చేసిన ఫలితంగా అనేక భూవివాదాలు తలెత్తుతున్నాయి. ఫీల్డ్​లో ఉన్న భూమికి రికార్డులో ఉన్న భూమితో సరిపోలకపోవడంతో రాష్ట్రంలో అనేక చోట్ల గెట్టు పంచాయితీలు నడుస్తున్నాయి. సమగ్ర భూసర్వేనే భూవివాదాలన్నింటికీ పరిష్కారమని  ఓ వైపు రెవెన్యూ చట్టాల నిపుణులు, రెవెన్యూ ఉద్యోగులు చాలా కాలంగా చెప్తున్నా.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు.  

ఏపీలో అట్ల.. మన దగ్గర ఇట్ల..
పక్క రాష్ట్రం ఏపీలో అధికారంలోకి వస్తే సమగ్ర భూసర్వే చేపడుతామని వైఎస్సార్​సీపీ అధినేత జగన్​ ప్రకటించగా.. అధికారంలోకి వచ్చిన  మొదటి ఏడాదిలో కృష్ణా జిల్లాలోని ఒక మండలాన్ని పైలట్​గా సర్వే చేశారు. ఇప్పుడు ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూసర్వే కొనసాగుతున్నది. మన రాష్ట్రంలో మాత్రం ఇంకా పైలట్​ గ్రామాల ఎంపిక దగ్గరే ప్రక్రియ నిలిచిపోయింది. నిరుడు జూన్ 11 నుంచే సర్వే ప్రారంభవుతుందని అదే ఏడాది జూన్​ 2న సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ తేదీ నాటికి గ్రామాల ఎంపిక పూర్తి కాకపోవడం, సర్వే ఏజెన్సీల దరఖాస్తుకు గడువు పెంచడంతో సర్వే వాయిదా పడింది. సీఎం నుంచి  ప్రకటన వచ్చి ఇప్పుడు ఏడాది దాటినా సర్వే గురించి ఇటు ప్రభుత్వం గానీ, అటు సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులుగానీ పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ సర్వే చేయాల్సిన ఏజెన్సీల ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు.  

అరకొరగా బడ్జెట్​ కేటాయింపులు
రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వేకు కావాల్సిన నిధులు, బడ్జెట్ కేటాయింపులకు మధ్య పొంతన కుదరడం లేదు. రూ.600 కోట్లు అవుతాయని నిరుడే సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్సు శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం 2021– - 22 బడ్జెట్​లో ప్రభుత్వం రూ. 400 కోట్లు కేటాయించినప్పటికీ.. రూపాయి కూడా రిలీజ్ చేయలేదు. దీంతో ఆ నిధులు ల్యాప్స్ అయ్యాయి. తాజా బడ్జెట్ లో రూ.150 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ అరకొర నిధులతో సమగ్ర భూసర్వే ఎలా పూర్తి చేస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

2014 ఎన్నికల హామీ..!
రాష్ట్రంలో భూవివాదాల శాశ్వత పరిష్కారానికి సమగ్ర భూసర్వే చేపడుతామని 2014 టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫేస్టోలోనే కేసీఆర్ ప్రకటించారు. మొదటిసారి అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని పట్టించుకోలేదు. 2018 ఎన్నికల ప్రచారంలోనూ రెవెన్యూ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తామని, భూముల సర్వే చేపడుతామని ప్రకటించారు. రెండోసారి అధికారంలోకి వచ్చి మూడున్నరేండ్లయినా సర్వే ప్రారంభించలేదు. పెండింగ్ లో ఉన్న భూవివాదాల పరిష్కారానికి సమగ్ర భూసర్వే ఒక్కటే మార్గమని రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు చాలా కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

సర్వే చేపట్టకుండా ప్రక్షాళన చేయడంతోనే సమస్యలు 
రాష్ట్రంలో సమగ్ర భూసర్వే చేపడుతామని 2014  ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ ప్రకటించారు.  రెండోసారి అధికారంలోకి వచ్చినా సర్వే గురించి పట్టించుకోలేదు.  కేవలం ఎన్నికల ముందు రైతు బంధు ఇచ్చి లబ్ధిపొందాలనే ఉద్దేశంతోనే రెవెన్యూ సిబ్బంది మెడపై కత్తి పెట్టి భూ రికార్డుల ప్రక్షాళనను హడావుడిగా పూర్తి చేయించారు. దీంతో అనేక వివాదాలు తలెత్తాయి. సమగ్ర భూసర్వే  చేస్తూనే రికార్డులను ప్రక్షాళన చేసి ఉంటే 99 శాతం వివాదాలు సమసిపోయేవి. - మన్నె నర్సింహారెడ్డి, కన్వీనర్​, ధరణి సమస్యల వేదిక