ప్యాకేజింగ్ కోర్సులకు పక్కా ప్లేస్​మెంట్స్​

ప్యాకేజింగ్ కోర్సులకు పక్కా ప్లేస్​మెంట్స్​

ప్రొడక్ట్ ఏదైనా సక్సెస్‍ అవ్వాలంటే మార్కెటింగ్‍, లాజిస్టిక్స్‌ ఎంత ముఖ్యమో ప్యాకింగ్​ అంతే ముఖ్యం.  వస్తువు వివరాలు తెలియజేయడంతో పాటు వాటిని సంరక్షించడానికి ఎంతో ఉపయోగపడుతున్న ప్యాకేజింగ్‍ కోర్సులకు ప్రస్తుతం మస్తు​ డిమాండ్​ ఉంది. ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్‌(ఐఐపీ) 2021–2022 విద్యాసంవ‌త్సరానికి డిస్టెన్స్​ ప‌ద్ధతిలో గ్రాడ్యుయేట్​ డిప్లొమా ఇన్​ ప్యాకేజింగ్​లో ప్రవేశాల భ‌ర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది. ఈ నేపథ్యంలో ప్యాకేజింగ్​ కోర్సులపై ఓ లుక్కేద్దాం..

షాపింగ్‍ మాల్‍.. సందు చివరి కొట్టు.. ఇలా ఎక్కడికెళ్లినా.. పాల నుంచి పళ్లు తోముకునే బ్రష్‍ వరకు.. సాల్ట్ నుంచి షాంపూ వరకు.. అన్ని వస్తువులు రంగు రంగుల్లో, ఆకట్టుకునే డిజైన్‍లలో ప్యాక్‍ చేసి ఉంటాయి. కవర్లు, బాటిళ్లు, సాచెట్స్, టిన్స్‌‌ల్లో దర్శనమిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తాయి. వీటిని ఇంత అట్రాక్టివ్‍గా చేయడానికి అవసరమైన ప్యాకేజింగ్​ కోర్సులను ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ప్యాకేజింగ్​ సంస్థ అందిస్తోంది.

సరికొత్త కెరీర్​ ఆప్షన్

ప్రస్తుతం ప్యాకేజింగ్ రంగ నిపుణులకు జాబ్ మార్కెట్లో అవకాశాలు విస్తరిస్తుండటంతో ఇది యువతకు సరికొత్త కెరీర్‍ ఆప్షన్‍గా మారుతోంది. ముఖ్యంగా ఇందులో ఫార్మా, పర్సనల్ కేర్, ఫుడ్​ ప్యాకేజింగ్ ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి. కస్టమర్ల అవసరాలు మారుతుండడంతో కంపెనీలు పోటీపడి వస్తువులు తయారు చేస్తున్నాయి. ఇవి కస్టమర్‍ దృష్టిని ఆకర్షించాలంటే వాటిని ప్యాకింగ్‍ చేయడంతో పాటు ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా  ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కంపెనీలో తయారై మార్కెట్లోకి వచ్చిన వస్తువు సక్సెస్‍ అయి సర్వైవ్‍ కావాలంటే ప్యాకింగ్‍ ఎలా చేయాలో తెలిపేదే ప్యాకేజింగ్‍ సైన్స్.

ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ప్యాకేజింగ్​ (ఐఐపీ): మన దేశంలో ప్యాకేజింగ్‌‌కు సంబంధించిన కోర్సులను అందిస్తున్న సంస్థ ఇండియన్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ). దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఢిల్లీ, చెన్నై, కోల్‌‌కతా, హైదరాబాద్‌‌, అహ్మదాబాద్‍ లో బ్రాంచ్‌‌లున్నాయి. కేంద్ర ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల శాఖ పాలనా మండలి ఆధ్వర్యంలో నడిచే ఐఐపీ ని 1966లో ఒక స్వయం ప్రతిపత్తి సంస్థగా ప్రారంభించారు. ప్యాకేజింగ్‍ సైన్స్‌‌లో రీసెర్చ్ అండ్‍ డెవలప్‍మెంట్‍ పరిశోధనలు చేస్తుంది. ఐఐపీ పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్, సర్టిఫికెట్ కోర్సు ఇన్ ప్యాకేజింగ్, గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ ప్యాకేజింగ్ (డిస్టెన్స్​) కోర్సులను అందిస్తోంది.

కోర్సులు – అర్హతలు

పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్: మ్యాథ్స్​ / ఫిజిక్స్ / కెమిస్ట్రీ / మైక్రోబయాలజీలలో ఒక సబ్జెక్టుతో డిగ్రీ (12+3 విధానంలో ) లేదా అగ్రికల్చర్ / ఫుడ్ సైన్స్ / పాలిమర్ సైన్స్ లేదా ఇంజనీరింగ్ / టెక్నాలజీ కోర్సులు చేసిన వారు అర్హులు. వయసు 30 ఏళ్లు  దాటకూడదు. రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉండే ఈ పరీక్షలో మ్యాథ్స్​, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి.

గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ (డిస్టెన్స్): సైన్స్ / ఇంజనీరింగ్ / టెక్నాలజీ / కామర్స్ / ఆర్ట్స్ డిగ్రీతో పాటు ఏడాది అనుభవం లేదా ఇంజినీరింగ్ /  టెక్నాలజీ లో డిప్లొమాతో పాటు రెండేళ్ల అనుభవం తప్పనిసరి.

సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ ప్యాకేజింగ్:  ఇందుకు ఏదైనా డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత పొందాలి. ఫస్ట్ కం ఫస్ట్ బేసిస్‍ ప్రాతిపదికన మొదట వచ్చినవారికి ఈ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.

వీటితో పాటు మహిళా అభ్యర్థుల కోసం ఎంటర్‌‌ప్రెన్యూర్‌‌షిప్ డెవలప్‌‌మెంట్ ప్రోగ్రామ్‌‌లు, వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్ కోసం ఎగ్జిక్యూటివ్ డెవలప్‌‌మెంట్ ప్రోగ్రామ్‌‌లు, ఇతర షార్ట్‌‌టర్మ్ కోర్సులను ఐఐపీ అందిస్తోంది. మన రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలు ప్యాకేజింగ్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.  డిప్లొమా పూర్తి చేసిన వారు మెకానికల్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్, ఏరోనాటికల్, ఏరోస్పేస్, మెకానికల్ మెరైన్, మెకట్రానిక్స్ వంటి బ్రాంచ్‌‌లలో బీటెక్ కోర్సు చదవచ్చు.

ప్రత్యేక విభాగం

మ్యానుఫ్యాక్చరింగ్‍ ఫ్యాక్టరీల్లో ప్యాకేజింగ్ ప్రత్యేక విభాగంగా గుర్తింపు పొందడంతో ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి 100 శాతం ప్లేస్‌‌మెంట్స్ లభిస్తున్నాయని చెప్పొచ్చు. ఈ రంగంలో ప్యాకేజింగ్ డెవలప్‌‌మెంట్ ఎగ్జిక్యూటివ్, ప్యాకేజింగ్ మేనేజర్/ ఆపరేటర్, క్వాలిటీ కంట్రోల్ అనలిస్టు (ప్యాకేజింగ్), ప్యాకేజింగ్ ఇంజినీర్, ప్యాకేజింగ్ సైంటిస్ట్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ (ప్యాకేజింగ్) వంటి జాబ్‍ ప్రొఫైల్స్ ఉంటాయి. ఎఫ్‍ఎంసీజీ కంపెనీలు, ఆహార సంబంధిత పరిశ్రమలు, కెమికల్స్, ఫార్మాస్యూటికల్, ఫుడ్ అండ్ బేవరేజెస్ కంపెనీలు, పేపర్, ప్లాస్టిక్, ప్యాకేజింగ్ యూనిట్లు, వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీల్లో ప్రారంభంలో కనీసం రెండు లక్షల రూపాయల నుంచి 5 లక్షల వరకు వేతనాలు లభిస్తాయి. ప్యాకేజింగ్ రీసెర్చ్, డెవలప్‌‌మెంట్ సంస్థల్లోనూ చేరడమే కాకుండా సొంతంగా యూనిట్‍ పెట్టుకొని ఎంటర్‌‌ప్రెన్యూర్‌‌గా మారొచ్చు.

టాప్ కంపెనీల్లో చాన్స్

ప్యాకేజింగ్​ కోర్సులు పూర్తి చేసిన వారికి టాప్​ కంపెనీలైన హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, డాబర్ ఇండియా లిమిటెడ్, జాన్సన్ అండ్ జాన్సన్ లిమిటెడ్, విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్, ఐటీసీ లిమిటెడ్, సిప్లా లిమిటెడ్, క్యాడ్‌‌బరీ ఇండియా లిమిటెడ్, క్యాస్ట్రాల్ ఇండియా లిమిటెడ్, కోకా కోలా ఇండియా ఐఎన్‌‌సీ,  ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్‍ లిమిటెడ్ మంచి వేతనంతో ప్లేస్​మెంట్స్​ కల్పిస్తున్నాయి.

నోటిఫికేషన్

ప్యాకేజింగ్‌లో డిస్టెన్స్​ డిప్లొమా ప్రోగ్రాం

కోర్సు డ్యురేషన్​: 18 నెలలు.

అర్హత‌: ఇంజినీరింగ్‌/ సైన్స్‌/ టెక్నాల‌జీ/ కామ‌ర్స్ అండ్ ఆర్ట్స్ స‌బ్జెక్టుల నుంచి గ్రాడ్యుయేష‌న్‌/ డిప్లొమా(ఇంజినీరింగ్‌/ టెక్నాల‌జీ) ఉత్తీర్ణత‌, సంబంధిత విభాగాల్లో క‌నీసం ఏడాది అనుభ‌వం.

ద‌ర‌ఖాస్తులు: ఆఫ్‌లైన్.

అప్లికేషన్​ ఫీజు: రూ.250

చివ‌రి తేది: 28 ఫిబ్రవరి 2021.

అడ్రస్​: ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్‌, ఈ-2, రోడ్ నెం.8, ఎంఐడీసీ ఏరియా, అందేరీ ఈస్ట్‌, ముంబ‌యి -400093.

For More News..

మార్స్‌పై సేఫ్‌గా దిగి ఫోటో పంపిన నాసా రోవర్

5జీ నెట్‌తో లాభాలతో పాటు నష్టాలు..

పోలీస్‍ కావాల్సినోడు.. బతుకు పోరాటం చేస్తుండు