అబార్షన్ మా హక్కు

అబార్షన్ మా హక్కు

వాషింగ్టన్: అమెరికాలో అబార్షన్ హక్కు కోసం మహిళలు కదం తొక్కారు. ‘మై బాడీ, మై చాయిస్, మై రైట్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. శనివారం దేశ రాజధాని వాషింగ్టన్​తో పాటు టెక్సస్ స్టేట్ రాజధాని ఆస్టిన్ సిటీ సహా 50 రాష్ట్రాల్లోని 600 సిటీల్లో లక్షలాదిమంది మహిళలు ర్యాలీలు నిర్వహించారు. ఒక్క వాషింగ్టన్​లోనే వైట్ హౌస్​కు సమీపంలోని చౌరస్తాలో వేలాది మంది నిరసనలు తెలిపారు. ‘‘అబార్షన్ ఆరోగ్యానికి సంబంధించిన విషయం’’, ‘‘టెక్సస్ తాలిబాన్ ను రద్దు చేయాలె” అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనేక మంది తమ శరీరాలపైనే స్లోగన్లను రాసుకొచ్చారు. ఆరు నెలల గర్భం తర్వాత అన్ని రకాల అబార్షన్ లను నిషేధిస్తూ టెక్సస్ ప్రభుత్వం చేసిన చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా మహిళలు నిరసన గళాలు వినిపిస్తున్నారు. శనివారం దేశవ్యాప్తంగా దాదాపు 200 హక్కుల సంస్థలు నిరసనలకు నేతృత్వం వహించాయి. చాలాచోట్ల నిరసనలకు మగవాళ్లు కూడా మద్దతు పలికారు. అయితే, వాషింగ్టన్​లో పలువురు అబార్షన్లకు వ్యతిరేకంగా కౌంటర్ ప్రొటెస్ట్ కూడా నిర్వహించారు. అబార్షన్ హత్యతో సమానమని నినాదాలు చేశారు.

ట్రంప్ హయాంలోనే షురూ.. 
అమెరికా సుప్రీంకోర్టు 50 ఏండ్ల కిందటే అబార్షన్ చేయించుకోవడం మహిళల హక్కు అని తీర్పు చెప్పింది. అయితే ట్రంప్ హయాంలో అబార్షన్లను రద్దు చేసే దిశగా చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే 19 రాష్ట్రాల ప్రభుత్వాలు అబార్షన్లను నిషేధిస్తూ 63 చట్టాలు తెచ్చాయి. ఇప్పుడు సుప్రీంకోర్టుతో పాటు ఆయా రాష్ట్రాల్లోని కోర్టుల్లో ట్రంప్ నియమించిన కన్సర్వేటివ్ జడ్జిలు మహిళల ఆకాంక్షలకు అపోజిట్ డైరెక్షన్లో తీర్పులు చెప్పే అవకాశాలు కన్పిస్తున్నాయి. అమెరికా సుప్రీంకోర్టులో కూడా మహిళలకు అనుకూలంగా నిర్ణయం వచ్చే చాన్స్ లేదని భావిస్తున్నారు. టెక్సస్ చట్టంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ఇదివరకే తిరస్కరించింది. మిసిసిపీ స్టేట్​లో అబార్షన్ల రద్దుకు వీలుగా 1973 నాటి తీర్పును రద్దుచేసే దిశగా తెచ్చిన చట్టాన్ని రివ్యూ చేసేందుకు అంగీకరించింది. మరోవైపు అబార్షన్ హక్కును సుప్రీంకోర్టు రద్దు చేయకుండా ఫెడరల్ చట్టం తెచ్చేందుకు ప్రవేశపెట్టిన బిల్లును ప్రతినిధుల సభ ఆమోదించింది. కానీ రిపబ్లికన్లకు మెజారిటీ ఉన్న సెనేట్ లో ఈ బిల్లును అడ్డుకునే సూచనలు కన్పిస్తున్నాయి.