భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలని డిమాండ్

 భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్ తిరుపతిలోని అలిపిరి గరుడ కూడలి  దగ్గర తమిళనాడుకు చెందిన పలువురు భక్తులు ఆందోళనకు దిగారు. శ్రీవారి దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించడంపై నిరసన వ్యక్తం చేశారు. వందల కిలో మీటర్లు పాదయాత్రగా వచ్చిన తమకు స్వామి వారి దర్శనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.  గత 26 ఏళ్లుగా వేలూరు జిల్లా గుడియాత్తం నుంచి పాదయాత్రగా వచ్చి స్వామి వారిని దర్శించుకుని వెళ్తున్నామని వారు తెలిపారు.

ఈ ఏడాది కూడా తిరుమలకు పాదయాత్రగా వచ్చామని.. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విడుదల చేయడంతో కేవలం 150 మందికి మాత్రమే దర్శన టికెట్లు లభించాయన్నారు. సుమారు 350 మందికి టికెట్లు లేకపోవడంతో తమకు దర్శన భాగ్యం కలిగించాలని కోరారు. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఆయన స్పందించలేదని  ఆవేదన వ్యక్తం చేశారు. 

26 ఏళ్లుగా ఏటా పాదయాత్రగా తిరుమలకు వస్తున్నామని.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదన్నారు. తమకు స్వామివారి దర్శనం కల్పించే వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆందోళన చేస్తున్న భక్తులను TTD విజిలెన్స్‌ పోలీసులు భూదేవి కాంప్లెక్స్‌కు తరలించారు. ప్రస్తుతం వారంతా అక్కడే నిరసన కొనసాగిస్తున్నారు.

 

మరిన్ని వార్తల కోసం..

డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్