పాక్​ రెచ్చగొడితే.. ఇండియా దాడి చేయొచ్చు

పాక్​ రెచ్చగొడితే.. ఇండియా దాడి చేయొచ్చు
  • గతంలో మాదిరిగా ఊరుకునే పరిస్థితి లేదు
  •     కాంగ్రెస్​కు అమెరికా ఇంటెలిజెన్స్​ నివేదిక
  •     ఇండో-పాక్, ఇండో-చైనా బార్డర్​లో పరిస్థితులపై ఆందోళన

వాషింగ్టన్: పాకిస్తాన్​ రెచ్చగొడితే.. గతంలో మాదిరిగా ఇండియా ఊరుకునే పరిస్థితి ఇప్పుడు లేదని, ఆ దేశంపై దాడి చేసే అవకాశాలు ఉన్నాయని అమెరికా కాంగ్రెస్​కు ఆ దేశ ఇంటెలిజెన్స్​వర్గాలు నివేదిక ఇచ్చాయి. ఇండో–పాక్, ఇండో–చైనా బార్డర్లలో ప్రస్తుత పరిస్థితులు మరింత ముదిరితే.. యుద్ధానికి దారి తీయొచ్చని హెచ్చరించింది. గురువారం అమెరికా కాంగ్రెస్‌‌‌‌కు నేషనల్​ ఇంటెలిజెన్స్​ డైరెక్టర్​ ఆఫీస్​ వార్షిక నివేదికను సమర్పించింది. పాక్, చైనా వల్ల ఇండియా బార్డర్​లో తలెత్తే పరిస్థితుల గురించి అందులో ప్రస్తావించింది.

2020 తర్వాత చైనాతో దెబ్బతిన్న సంబంధాలు

సరిహద్దు వివాదాల పరిష్కారానికి ఇండియా, చైనా ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నా.. 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత సంబంధాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ‘సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాల్లో ఇండియా, చైనా ఆర్మీని మోహరించడం 2 న్యూక్లియర్​ దేశాల మధ్య సంఘర్షణను పెంచుతుంది. ఇది అమెరికా ప్రయోజనాలకు ప్రత్యక్ష ముప్పుగా మారుతుంది. ఇందులో అమెరికా జోక్యం చేసుకోవాలి. లైన్​ ఆఫ్​ యాక్చువల్​ కంట్రోల్​(ఎల్‌‌‌‌ఏసీ) వెంబడి చిన్నచిన్న ఘర్షణలు వేగంగా పెరగొచ్చని ఇటీవలి ఘటనలు నిరూపించాయి’ అని తెలిపింది. బార్డర్​లో శాంతి నెలకొనేదాకా  చైనాతో సంబంధాలను ముందుకు తీసుకెళ్లవద్దని ఇండియా భావిస్తోందని వెల్లడించింది. 

ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నయ్

అమెరికా రిపోర్ట్​ ప్రకారం ‘ఇండియా, పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఢిల్లీ, ఇస్లామాబాద్‌‌‌‌ 2021లో నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణను రెన్యువల్​ చేసిన తర్వాత ప్రస్తుత ప్రశాంతతను కొనసాగించేందుకే మొగ్గు చూపుతాయి’ అని పేర్కొంది. ఇండియా వ్యతిరేక టెర్రరిస్ట్ గ్రూపులకు పాక్​ మద్దతిస్తోందని, మోడీ నాయకత్వంలోని ఇండియా పాక్ కవ్వింపు చర్యలకు.. సైనిక పరంగా ప్రతిస్పందించడానికి గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ చాన్స్ ఉందని తెలిపింది. కాశ్మీర్‌‌‌‌లో హింసాత్మక ఘటనలు, ఉగ్రవాద దాడులు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచొచ్చని పేర్కొంది.