Suraj Revanna: లైంగిక వేధింపుల కేసులో సూరజ్ రేవణ్ణకు బెయిల్.. అయినా జైల్లోనే.. ఎందుకంటే..

Suraj Revanna: లైంగిక వేధింపుల కేసులో సూరజ్ రేవణ్ణకు బెయిల్.. అయినా జైల్లోనే.. ఎందుకంటే..

బెంగళూరు: లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎమ్మెల్సీ , ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు సోమవారం నాడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే సూరజ్ రేవణ్ణపై మరో కేసు కూడా నమోదు కావడంతో లైంగిక వేధింపుల కేసులో బెయిల్ మంజూరైనప్పటీ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. జేడీఎస్ కార్యకర్తను లైంగికంగా వేధించాడని సెక్షన్ 377 కింద అతనిపై జూన్ 22న కేసు నమోదైంది. జూన్ 23న సూరజ్ రేవణ్ణను అరెస్ట్ చేశారు. జూన్ 16న సూరజ్ తన ఫామ్ హౌస్ లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని 27 ఏళ్ల వయసున్న జేడీఎస్ పార్టీ కార్యకర్త పోలీసులకు జూన్ 22న ఫిర్యాదు చేశాడు.

సూరజ్ ను కొల్లంగి గ్రామంలో లోక్ సభ ఎన్నికల ప్రచార సందర్భంగా తాను కలిశానని ఫిర్యాదు చేసిన వ్యక్తి కంప్లైంట్ లో పేర్కొన్నాడు. ఇద్దరం ఒకరి నంబర్లు ఒకరం తీసుకున్నామని చెప్పాడు. జూన్ 16న గన్నికడలోని ఫామ్ హౌస్ కు తనను పిలిపించి, డోర్ లాక్ చేసి వద్దన్నా బలవంతంగా తన డ్రెస్ తీసేసి లైంగిక చర్యకు పాల్పడ్డాడని సూరజ్ రేవణ్ణపై బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని బయటచెప్తే చంపేస్తానని బెదిరించాడని, తనతో కలిసి ఉంటే రాజకీయంగా ఎదిగేందుకు సహకరిస్తానని సూరజ్ చెప్పినట్లు సదరు యువకుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

సూరజ్ రేవణ్ణ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాజీ ప్రధాని దేవెగౌడ మనవళ్లలో ఒకడు ఈ సూరజ్ రేవణ్ణ. జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ కొడుకు. హసన్ జిల్లా నుంచి సూరజ్ రేవణ్ణ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దేవెగౌడ కుటుంబంలో రాజకీయాల్లో వచ్చిన 8వ వ్యక్తి సూరజ్. దేవెగౌడ కుటుంబం రాజకీయంగా ఎంత ఎదిగిందో మనవళ్లపై లైంగిక ఆరోపణలతో అంత అభాసుపాలైంది. సూరజ్ రేవణ్ణ సోదరుడు ప్రజ్వల్ రేవణ్ణపై కొందరు అమ్మాయిలను లైంగికంగా వేధించి, వారి అనుమతి లేకుండా వీడియోలు తీసినట్టు ఆరోపణలొచ్చాయి. ఆ వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. మే 31, 2024న ప్రజ్వల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రజ్వల రేవణ్ణ తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేశారు. బాధిత యువతి కిడ్నాప్ కేసులో తల్లీతండ్రి బెయిల్ పై బయటికొచ్చినప్పటికీ ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు.