
- కొనుగోలు సెంటర్ల వద్ద రైతుల అవస్థలు
- టాయిలెట్స్, మరుగుదొడ్లకు ఇబ్బందే
- కలెక్టర్ఆదేశాలు పట్టించుకోని నిర్వాహకులు
మెదక్ (కౌడిపల్లి), వెలుగు: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కనీసం దాహం వేస్తే తాగేందుకు నీళ్లు, ఎండ నుంచి రక్షణకు నీడ, రాత్రి పూట కరెంట్ కూడా ఉండడం లేదు. సెంటర్లకు వడ్లు తెచ్చిన తర్వాత తూకం వేయడానికి పది, పదిహేను రోజుల టైం పడుతుండటంతో రైతులు రాత్రింబవళ్లు అక్కడే పడిగాపులు కాయాల్సి వస్తోంది. కనీస వసతులు లేక నానా అవస్థలు పడుతున్నామని, తాగునీరే కాదు టాయిలెట్స్, మరుగుదొడ్లకు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు.
జిల్లాలో 399 సెంటర్లు
యాసంగి సీజన్‌లో జిల్లాలోని 21 మండలాల పరిధిలో పీఏసీఎస్, ఐకేపీ, మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో 399 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటుకు ముందే కలెక్టర్ సివిల్ సప్లై, రూరల్ డెవలప్మెంట్, కో ఆపరేటివ్, మార్కెటింగ్‌శాఖ , పీఏసీఎస్చైర్మన్లు, సీఈవోలతో పలుమార్లు రివ్యూ మీటింగ్‌లు పెట్టి సెంటర్ల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా నీడ కోసం టెంట్లు వేయాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. కానీ, రైతువేదికలు ఉన్నచోట, వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తప్ప ఓపెన్ ప్లేసుల్లో ఏర్పాటు చేసిన సెంటర్లలో టెంట్లు వేసిన దాఖలాలు లేవు. కనీసం తాగునీరు కూడా పెట్టడం లేదు.
కాంటా లేట్ అవుతుండడంతో..
హమాలీలు, లారీల కొరతతో దాదాపు అన్నిచోట్ల ధాన్యం తూకం వేయడంలో ఆలస్యం అవుతోంది. దీంతో రైతులు వారం నుంచి 15 రోజుల వరకు రాత్రింబవళ్లు కేంద్రాల్లో వడ్ల కుప్పల వద్ద కావలి ఉంటున్నారు. భోజనాలు అక్కడే చేస్తున్నారు. పొద్దున, రాత్రి ఇబ్బంది లేకున్నా, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎండ భగ్గుమంటుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. సెంటర్ల వద్ద టెంట్లు, చెట్లు లేకపోవడంతో టవల్స్ తలపై పెట్టుకొని పొద్దు గడుపుతున్నారు. భోజనం కూడా ట్రాక్టర్ నీడలో చేయాల్సి వస్తోంది. చాలా కేంద్రాలు ఊర్లకు దూరంగా, పొలాల వద్ద ఏర్పాటు చేయడంతో రాత్రి పూట కరెంట్ కూడా ఉండడం లేదు. దీంతో రైతులు చీకట్లోనే వడ్ల కుప్పల వద్ద కావలిగా పడుకుంటున్నారు. సెంటర్ల వద్ద సౌలత్‌లు కల్పించాలని, లేదంటే వడ్లు ఏ రోజుకారోజు కొనాలని రైతులు కోరుతున్నారు.
తాగేందుకు నీళ్లు లేవు
సెంటర్ దగ్గర వడ్లు ఎండబోసినం. పొద్దంతా ఎండలనే ఉండాల్సి వస్తుంది. కానీ ఈడ నీడ లేదు. తాగేందుకు నీళ్లు లేక మస్తు తిప్పలైతుంది. ఇంటి నుంచే నీళ్లు తెచ్చుకుంటున్నం. కానీ, అవి భోజనానికే సరిపోతున్నయ్. వడ్లు లైన్ ప్రకారం కాంట పెడ్తలేరు. ఇంక ఎన్ని రోజులు గిట్ల తిప్పలు పడాల్నో ఏమో.
– దూదేకుల రజియా, రైతు రాజిపేట
రాత్రిపూట కరెంటు సప్లై లేదు
వడ్లు తెచ్చి సెంటర్కాడ కుప్ప పోసినం. కాంటా పెట్టేందుకు లైన్ ఎప్పుడు వస్తుందో తెలియక రాత్రి కుప్పల కాడనే పడుకుంటున్నం. అయితే ఈడ కరెంటు కూడా ఉంట లేదు. దీంతోని చీకట్లనే ఉంటున్నం. పురుగుభూషి వస్తదేమోనని భయమైతుంది.
– లలిత, రైతు, ముట్రాజ్ పల్లి