
- కొత్త రికార్డ్‌లు క్రియేట్ చేస్తామన్న కామర్స్ మినిస్టర్ పీయుష్ గోయెల్
- కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గుతోందని వెల్లడి
ముంబై: గూడ్స్, సర్వీస్‌ల మొత్తం ఎగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 800 బిలియన్ డాలర్ల (రూ.66.40 లక్షల కోట్ల) ను దాటుతుందని కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ పీయుష్ గోయెల్ పేర్కొన్నారు. గ్లోబల్‌గా ఎన్ని సమస్యలున్నా ఈ టార్గెట్ చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కిందటి ఆర్థిక సంవత్సరంలో గూడ్స్, సర్వీస్‌ల మొత్తం ఎగుమతులు 778.2 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యాయి. ఇందులో గూడ్స్ ఎగుమతులు 437.1 బిలియన్ డాలర్లుగా, సర్వీసెస్ ఎగుమతులు 341 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఉక్రెయిన్– రష్యా యుద్ధం, ఇజ్రాయిల్– హమాస్ యుద్ధం ఇంకా కొనసాగుతోందని, ఎర్ర సముద్రంలో సమస్యలు పరిష్కారం కాలేదని గోయెల్ అన్నారు. చాలా దేశాల్లో ఎన్నికలు ఉన్నాయని గుర్తు చేశారు.
‘ఇలాంటి పరిస్థితుల్లో మన ఎగుమతులు (మే నెలలో 9 శాతం అప్) పెరిగాయి. దీనిని బట్టి ప్రపంచం ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి, ఇండియాతో ట్రేడ్ చేయడానికి ఆసక్తి చూపిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల విలువ 800 బిలియన్ డాలర్లు దాటుతుందని నమ్ముతున్నాం’ అని గోయెల్ వివరించారు. జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎగుమతుదారులు ముంబైలో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో ఆయన శనివారం పాల్గొన్నారు. కిందటి ఆర్థిక సంవత్సరంలో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (సీఏడీ– దిగుమతులు, ఎగుమతుల మధ్య తేడా) తగ్గిందని గోయెల్ అన్నారు. ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో దేశ కరెంట్ అకౌంట్ 5.7 బిలియన్ డాలర్ల మిగులు నమోదు చేసింది.