సీఎం దత్తత గ్రామంలో పల్లె ప్రగతి రచ్చరచ్చ

సీఎం దత్తత గ్రామంలో పల్లె ప్రగతి రచ్చరచ్చ

కీసర/శామీర్ పేట, వెలుగు:  మేడ్చల్ జిల్లాలోని సీఎం కేసీఆర్ దత్తత గ్రామం మూడుచింతలపల్లిలో పల్లె ప్రగతి కార్యక్రమం రసాభాసగా మారింది. మూడుచింతలపల్లి మండల కేంద్రంలో సోమవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సమక్షంలో జరిగిన పల్లె ప్రగతి ఆద్యంతం వాగ్వాదాలతో జరిగింది. మేడ్చల్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్, కాంగ్రెస్ నేత సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి సభలో సర్పంచుల సమస్యలను ప్రస్తావించారు. పల్లె ప్రగతికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారా? అని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీలను, జడ్పీటీసీ వ్యవస్థను సర్కారు నాశనం చేసిందని విమర్శించారు. దీంతో సభలో మాటామాటా పెరిగి లొల్లికి దారి తీసింది. సీఎం దత్తత గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని చూడాలంటూ మంత్రులు ఎర్రబెల్లి, మల్లారెడ్డి చెప్పగా.. సర్పంచ్​ల సమస్యలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదంటూ హరివర్ధన్ రెడ్డి నిలదీశారు. సీఎం దత్తత గ్రామాలను మాత్రమే అభివృద్ధి చేస్తున్నారని, మిగతా పంచాయతీల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. మహిళలు సైతం హరివర్ధన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా అటు కాంగ్రెస్ కార్యకర్తలు.. ఇటు టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు నినాదాలు చేశారు. హరివర్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనంలో తరలించారు.  

పల్లెల రూపురేఖలు మారినయ్: మంత్రులు 
సీఎం కేసీఆర్ కృషి వల్ల రాష్ట్రంలో పల్లెల రూపురేఖలు మారాయని మంత్రులు ఎర్రబెల్లి, మల్లారెడ్డి అన్నారు. మూడుచింతలపల్లిలో రూ. 1.30 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రులు సోమవారం శంకుస్థాపనలు చేశారు. కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్లు, స్టేడియాన్ని ప్రారంభించారు. షాపింగ్ కాంప్లెక్స్, డంపింగ్ యార్డ్, వైకుంఠధామం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తదితర పనులను పరిశీలించారు. కీసరలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలోనూ మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. పల్లె ప్రగతి వల్ల గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కార్యక్రమానికి నిధులు కూడా దండిగా ఉన్నాయన్నారు. మేడ్చల్ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు మంత్రి మల్లారెడ్డి ఎంతో కృషి 
చేస్తున్నారని కొనియాడారు.