మానవులతో జంతువుల సంఘర్షణ! అడవుల నిర్మూలనకు ప్రధాన కారణం ఇదే..!

మానవులతో జంతువుల సంఘర్షణ! అడవుల నిర్మూలనకు ప్రధాన కారణం ఇదే..!

ప్రకృతిలో ఇతర జీవాలతో  మానవుల  సంఘర్షణ  చారిత్రాత్మకంగా  ఎప్పటి నుంచో ఉన్నా, ఆధునిక కాలంలో  అది తీవ్రతరం అవుతున్నది.  పరస్పర ఆధారిత జీవనం మీద  మానవుల దృక్పథం  మారుతూ వస్తున్నది. జంతువులు, ఇతర జీవాల పట్ల వివిధ దేశాలలో,  వివిధ  సంస్కృతులలో,  మతపరమైన  విశ్వాసాలలో  భారీ తేడాలున్నా.. ఆధునిక జీవన పద్ధతుల వలన అవన్నీ ఏకమై ప్రకృతిలో  ఇతర  జీవాలకు ఉనికికే  ప్రమాదం ఏర్పడింది. 

అనేకరకాల జీవాలు కనుమరుగు అయిపోయాయి.  ఇంకా అనేక జీవజాతులు  కనుమరుగు అయ్యే దశలో ఉన్నాయి.  వివిధ జీవాల మధ్య ఉండే  సమతుల్యత  అంతరించిపోవటానికి మానవుల అత్యాశ ప్రధాన కారణం. సముద్రంలో ఉండే జలచరాల  పరిస్థితి ఈ విధంగానే ఉన్నది.   తేనెటీగ తనకు కావాల్సిన  తేనెను పువ్వును  ధ్వంసం చేయకుండా ఆఘ్రానిస్తుంది.  ప్రకృతి ఉత్పత్తుల మీద  ఆధారపడ్డ  మనుషులు ఆ విధంగా  ప్రకృతి  వనరులను సేకరించడం లేదు. విపరీతంగా,  విధ్వంసకర రీతిలో  అడవులను,  నేలను,  చెట్లు,  పశుపక్ష్యాదులను వాడుకుంటున్నాం.

ఒ క జాతి చేపల కోసం సముద్రాలలో  వందల  టన్నుల  ఇతర  జలచరాలను  పట్టుకుని,  చనిపోయినాక పడేస్తున్నారు.  ఆధునిక  చేపల వేట ఇప్పుడు ప్రపంచ మహాసముద్రాలలో 55% నుంచి 90% వరకు విస్తరించి,  పర్యావరణ వ్యవస్థకు  అంతరాయం  కలిగిస్తున్నది.  సుస్థిరంకాని వేట పద్ధతులకు దారితీస్తోంది.  

ఒక రకం  పురుగులను చంపడానికి  వందల టన్నుల విష రసాయనాలు వాడడం వలన అనేక ఇతర జీవాలు నాశనం అవుతున్నాయి.  దోమలను నిర్మూలించడానికి  ప్రకృతి  ఇచ్చిన వనరులను కాదని ప్రమాదకర మలాథియాన్ వంటి రసాయనాల వాడకం వల్ల, దోమలను  అరికట్టగలిగే శక్తి ఉన్న కప్పలు ఇంకా ఇతర జీవాలు చనిపోతున్నాయి. దోమల సమస్య ఇంకా పెరుగుతున్నది.

 ఈ తరహ వ్యవహారం అనేక రూపాలలో ప్రకృతిని నాశనం పట్టిస్తున్నది. తేనెటీగలకు ఉన్న స్పృహ మనకు ఎందుకు కొరవడింది?  ప్రకృతి వనరులను ఉపయోగించేటప్పుడు  వాటి  పునఃరుత్పత్తి సామర్థ్యం లోపటే తీసుకోవాల్సి ఉండగా, అనవసరంగా, ఎక్కువ మొత్తంలో ప్రకృతి వనరులను తీసుకోవడం, సేకరించడం వల్ల ప్రకృతి వినాశనం జరుగుతున్నది. ఈ వినాశన పద్దతుల వల్లనే ఇతర జీవాల మనుగడ రకరకాలుగా సమస్యాత్మకంగా మారింది. 

అడవుల నిర్మూలన ప్రధాన కారణం

అడవుల నిర్మూలన, అటవీ వనరుల వెలికితీత..  మానవ, - వన్యప్రాణుల  సంఘర్షణకు  ప్రధాన కారణం. అడవులు, చెట్లు, పచ్చదనంపోతే  వన్యప్రాణుల  ఆవాసాలు విచ్ఛిన్నం అవుతాయి.  జీవనక్రమంలో తీవ్రమార్పులు వస్తాయి. వాటి  సంతానోత్పత్తి,  ఆహారం లభ్యత  కూడా  దెబ్బతింటున్నది.  సున్నితంగా ఉండే జీవాలు పోతే వాటి మీద ఆధారపడ్డ ఇతర జీవాలు తమ ఆహారం కోసం  దూరప్రాంతాలు వెళ్లవలసి వస్తుంది.

  వ్యవసాయం, మైనింగ్, మౌలిక సదుపాయాలు లేదా  కలప నరికివేత కోసం అడవులను  నరికివేసినప్పుడు, అడవి జంతువులు వాటి సహజ ఆవాసాలను కోల్పోతాయి.  ఆహారం,  నీరు, ఆశ్రయం కోసం ఎక్కడ వాటి లభ్యత ఉంటుందో అక్కడికి వెళ్తాయి.  
సాధారణంగా  మానవ  జనాభా ఉన్న  ప్రాంతాలకు,  తప్పనిసరి  పరిస్థితులలో  వెళ్తాయి.  ఫలితంగా  తరచుగా  పంటల దోపిడీ,  పశువుల వేట, ఆస్తి నష్టం,  మానవ భద్రతకు  ముప్పు  ఏర్పడుతుంది. మానవులు, అటవీ జంతువుల మధ్య  పరస్పర ఆహారం,  నీరు వంటి వనరుల కోసం  పోటీవల్ల ప్రకృతి వనరుల లభ్యతలో ప్రతికూల ఫలితాలకు దారితీసినప్పుడు మానవ, -వన్యప్రాణుల సంఘర్షణ తలెత్తుతుంది. 

పర్యావరణ అసమతుల్యత 

ఆహార చక్రాలలో  కొన్ని జాతుల నష్టం పర్యావరణ సమతుల్యతను  దెబ్బతీయడం ద్వారా  మానవ, -జంతు సంఘర్షణను  గణనీయంగా  పెంచుతుంది.  వేటాడే  జంతువులు లేదా  శాకాహారులు వంటి ముఖ్యమైన జాతులు అంతరించిపోవడం  లేదా  ఆవాస నష్టం  కారణంగా  అదృశ్యమైనప్పుడు,  అవి లేకపోవడం ఇతర విపరీత  పరిణామాలను  ప్రేరేపిస్తుంది.  ఉదాహరణకు వేటాడే జంతువుల జనాభా తగ్గితే  శాకాహార వన్యప్రాణుల అధిక జనాభాకు దారితీస్తుంది.  వాటి జనాభా పెరుగుదల వృక్షసంపద  మీద దుష్ప్రభావం చూపుతుంది.

వృక్షాలు, పచ్చదనం తగ్గితే ఇతర ప్రాణాల ఆవాసాలు క్షీణిస్తాయి. ఈ పరిణామాలు అహారం, ఆశ్రయం కోసం జంతువులను మానవ ఆధిపత్య ప్రాంతాలకు మరలిస్తాయి.  ఆఫ్రికాలో  ఒకదానికొకటి  ముడిపడిన  ఈ పరిణామక్రమం  స్పష్టంగా  కనిపిస్తుంది.  ఇక్కడ సింహం, చిరుతపులి సంఖ్య  తగ్గడం వల్ల  మానవ  నివాసాల దగ్గర  ఆలివ్ బబూన్ (కోతుల జాతి) సంఖ్య పెరిగింది.  వాటితో మానవుల సంఘర్షణ పెరుగుతుంది.  ప్రకృతిలో ప్రాణుల మధ్య ఉండే సమతుల్యత దెబ్బతింటే ఒక ప్రాంతంలో ఒకే రకమైన వన్యప్రాణుల సంఖ్య పెరిగి మానవులకు,  ప్రకృతికి నష్టం కలుగుతుంది. ఈ సమతుల్యత  పోవ డానికి  మానవులు, వారి కార్యకలాపాలే కారణం.

మానవ ఆవాసాల్లోకి చిరుతలు

భారతదేశంలో  దాదాపు అన్ని రాష్ట్రాలలో,  ఢిల్లీలోని  గ్రేటర్  నోయిడా,  గురుగ్రామ్ వంటి  ప్రాంతాలలో  కూడా,  చిరుతలు  తరచుగా  మానవ ఆవాసాలలోకి  ప్రవేశిస్తున్నట్లు  వార్తలు చూస్తున్నాం.  ఆరావళి  పర్వత శ్రేణిలో ఆవాసాల  ఆక్రమణ,  మైనింగ్,  పేలుళ్లు,  నిర్మాణ పనులు వలన వన్యప్రాణులు స్థానభ్రంశం అవుతాయి.  కాశ్మీర్ విశ్వవిద్యాలయం, శ్రీనగర్‌లోని షేర్- ఎ- కాశ్మీర్  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్​తో సహా  కాశ్మీర్‌లోని పట్టణ ప్రాంతాలలో  ఎలుగుబంట్లు కనిపించాయి.  

ఒకప్పుడు  సలీం అలీ నేషనల్ పార్క్​లో  భాగమైన  రాయల్ స్ప్రింగ్స్ గోల్ఫ్ కోర్సులో,  విద్యుత్ కంచెలు ఉన్నప్పటికీ ఎలుగుబంట్లు పదేపదే చొరబడడం కూడా చూస్తున్నాం. సాధారణంగా  అటవీ జంతువులు వాటి పూర్వ ఆవాసాలను తిరిగి పొందడానికి ప్రయత్నిస్తాయి.   కరీంనగర్​లో  గుట్టలు  ధ్వంసం అయిన  తదుపరి ఎలుగుబంట్లు జనావాసాలకు రావడం ఎక్కువ అయ్యింది. యాదగిరిగుట్ట ప్రాంతంలో  ఇటీవల  కాలంలో  చేపట్టిన  గుట్టల  ధ్వంసం  నేపథ్యంలో   కొండ చిలువలు చిట్టడువుల నుంచి బయటకు రావాల్సి వచ్చింది.  

ఏనుగులు కేరళలోని, ముఖ్యంగా వయనాడ్, పాలక్కాడ్‌లలోని గ్రామాలు, వ్యవసాయ క్షేత్రాలలోకి  ప్రవేశిస్తున్నాయి. పంటలను నాశనం చేస్తున్నాయి. ఈ మధ్య మానవులపై దాడులు కూడా పెరిగాయి.  భారతదేశంలో  కరువు సమయంలో  ఏనుగులు వరి పొలాలకు  ఎగబడుతున్నాయి.  అట్లా రావడం వల్ల ఏనుగులు ఏటా 500 మందికి పైగా  చంపేయడం జరిగింది. 

వన్యప్రాణులను  సంరక్షించాలి

తెలంగాణ వ్యాప్తంగా  కోతుల  బెడద  విస్తృతం  అవుతున్నది.  గత  రెండు మూడు  దశాబ్దాలుగా ఈ సమస్య  జటిలం అవుతున్నది.  ఈ సమస్యకు  పరిష్కారం  గురించి  ప్రభుత్వానికి  అనేకసార్లు 
విన్నవించినా ఫలితం లేదు. ఈ మధ్య  పార్లమెంటులో  ప్రస్తావించినా  కేంద్ర ప్రభుత్వ స్పందన అంతంత మాత్రమే.  

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే  నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది.  ఇటీవల  ఎన్నికలలో  అనేక  గ్రామాల  సర్పంచులు ఈ సమస్యను పరిష్కరిస్తామని వాగ్దానం చేశారు. ఈ సమస్యను   అటవీశాఖ మాత్రమే పరిష్కరించలేదు.  కోతులను పట్టుకుని అడవిలో,   జనావాసాలకు  దూరంగా  వదిలిపెట్టినా  అవి తిరిగి  జనావాసాలలో  ప్రత్యక్షమవుతాయి.  

కొండెంగలను  తెచ్చి కోతులను నియంత్రించవచ్చు.  కానీ,  బెడద తగ్గదు.  దీర్ఘకాలిక,  సమగ్ర  పరిష్కారాలు ఆలోచించాలి.  అడవుల పునరుద్ధరణ  అత్యవసరం.  అడవులను,  వన్యప్రాణుల  జీవితాలకు  భంగం కలిగించే  కార్యకలాపాలను  సమీక్షించి తగ్గించాలి. అడవుల  విస్తరణ ఒక విధానంగా  చేపట్టాలి.  రాష్ట్ర భూభాగంలో  30-– 40 శాతం అడవులు,  చిట్టడవులతో  ఉండేవిధంగా  ప్రణాళికలు  రచించాలి.  అనవసర  రహదారుల నిర్మాణం ఆపాలి.  పునఃసమీక్ష  జరగాలి.  తెలంగాణ అభివృద్ధిలో పచ్చదనం విస్తృతం చేయడంలో వన్యప్రాణుల సంరక్షణ ఒక లక్ష్యంగా చేర్చాలి.

జంతువుల వేట 

ప్రజలు తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందనే  భయంతో,  తమ భూభాగంలోకి  ప్రవేశించిన జంతువులను  చంపేస్తుంటారు.  కొందరికి  జంతువుల వేట ఒక ఆనందం.  ఒక ఆట.  ఇతర  జీవాలతో  తమకు  ప్రాణభయం లేకున్నా,  అనవసరంగా చంపటం కూడా మానవులకు సర్వసాధారణం అయిపొయింది.  

వన్యప్రాణుల పట్ల ఇదివరకు ఉండే అవగాహన,  సహనం మానవులలో లోపించింది.  అడవులలో  వన్యప్రాణుల మధ్య నివసించిన ఆదివాసీలు కూడా ఆధునికీకరణ చెందిన తరువాత పూర్వజ్ఞానం 

లోపించిన కారణంగా అడవి జంతువులను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం,  నైపుణ్యం కోల్పోయారు.  మానవులు ప్రకృతి మీద ఆధారపడి మనుగడ సాగిస్తున్నా,  ఆ స్పృహ తరుచుగా కోల్పోవడం వల్ల కూడా ప్రకృతిలో  భాగమైన  వన్యప్రాణుల పట్ల  కూడా  సానుభూతి  కొరవడుతున్నది.  ఒకదానికొకటి  ముడిపడి ఉన్న పుడమి  జీవితంలో  వన్యప్రాణుల  కనుమరుగు పెద్ద సమస్యగా భావించడం లేదు.  అవినీతి,  ఆశ్రిత  పక్షపాతంలో మునిగి తేలుతున్న పాలకులకు అసలే  పట్టలేదు.  

- డా. దొంతి నరసింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్​-