గందరగోళానికి గురిచేస్తున్న పిల్లి ఫొటో

గందరగోళానికి గురిచేస్తున్న పిల్లి ఫొటో

మన కళ్లు ఒక్కోసారి మనల్నే మోసం చేస్తుంటాయి. దానికి కారణం.. ఆప్టికల్ ఇల్యూజన్. ఇలాంటి భ్రమను కలిగించే ఫొటోలు ఇప్పటికే చాలా ఉన్నాయి. కానీ.. ఈ మధ్య ట్విట్టర్​లో హల్​చల్​ చేసిన ఈ ఫొటో నెటిజన్లను తికమక పెడుతోంది. గ్రే స్కేల్​లో ఉండే ఈ ఫొటోలో మెట్ల మీద ఒక పిల్లి కనిపిస్తుంది. కానీ.. ఆ పిల్లి మెట్లు ఎక్కుతోందా? దిగుతోందా? అనేది మాత్రం ఎవరూ తేల్చలేకపోతున్నారు. కనిపించీ, కనిపించనట్టుగా ఉన్న ఈ మోనోక్రోమ్ ఇమేజ్‌‌ చూస్తుంటే పిల్లి పైకి వెళ్తున్నట్టు ఉందని చాలామంది వాదించారు.

మరికొందరు మాత్రం అది కిందకి దిగుతోందని వాదించారు. వాస్తవానికి ఆ ఫొటోలో మెట్లకు అంచులో ఉన్న డిజైన్​ వల్ల అది రెండు రకాలుగా కనిపిస్తోంది. మెట్టు పై భాగంలో డిజైన్​ ఉంది అనుకునే వాళ్లకు ఎక్కుతున్నట్టు, ముందు భాగంలో డిజైన్​ ఉంది అనుకునేవాళ్లకు దిగుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఎలా ఊహించుకుంటే అలా కనిపిస్తుంది. వాస్తవానికి ఈ ఫొటోను 2015లో పోస్ట్​ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇది ఎంతోమందిని గందరగోళానికి గురిచేస్తూనే ఉంది. ఈ మధ్య మళ్లీ వైరల్​ అవుతోంది.