
- ఇన్నాళ్లూ సైలెంట్ మోడ్‍లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు
- జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వినయ్ భాస్కర్ తమ్ముడు విజయ్ భాస్కర్
- అన్నవినయ్ కేటీఆర్ మనిషి.. తమ్ముడు విజయ్ కవిత ప్రధాన అనుచరుడు
- గ్రేటర్ వరంగల్‌లో దాస్యం బ్రదర్స్ అడుగులపై కేడర్ నజర్
వరంగల్, వెలుగు: బీఆర్‍ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేసిన నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ నేతల్లో ఒక్కసారిగా అయోమయం నెలకొంది. పార్టీ అధినేత కేసీఆర్ బిడ్డగా, జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలిగా కవితకు ఇన్నాళ్లూ ప్రతి నియోజకవర్గంలో గులాబీ నేతలు ప్రియార్టీ ఇచ్చారు. కాగా, గడిచిన ఆరు నెలలుగా కల్వకుంట్ల ఫ్యామిలీలో గొడవలతో నేతలంతా మౌనం వహించారు. ప్రస్తుతం కవితను పార్టీ నుంచి బయటకు పంపడంతో ఆమె విషయంలో ఎలా స్పందించాలో తెలియని కన్‍ఫ్యూజన్‍లో పడ్డారు.
జిల్లాలోని పార్టీ సీనియర్లు కేసీఆర్ కు దగ్గరగా ఉండగా, మిగతావారు కేటీఆర్, హరీశ్‌రావు, కవిత అనుచరులుగా వ్యవహరించారు. కవిత జిల్లా పర్యటన సందర్భంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు నానా హడావుడి చేశారు. అయితే పార్టీ ఇప్పుడు కవితను సస్పెండ్ చేసిన క్రమంలో వారంతా ఆమెకు వ్యతిరేకంగా ఎలా ముందుకెళ్తారనే దానిపై కేడర్‍లో డైలామా నెలకొంది.
కవితపై తక్కళ్లపల్లి, మధుసూదనచారి ఫైర్
కల్వకుంట్ల ఫ్యామిలీలో గొడవలు ఆరు నెలలుగా రచ్చకెక్కాయి. అప్పట్లో కవిత అమెరికా నుంచి వచ్చాక తాను కేసీఆర్‍కు రాసిన లేఖ లీక్ చేయడంలో తెరవెనుక కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‍రావు పాత్ర ఉందన్నట్లుగా బాహాటంగా విమర్శలు చేశారు. దీంతో గులాబీ పార్టీలో ఒక్కసారిగా కలవరం మొదలైంది. ఓరుగల్లు నుంచి ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‍రావు, మాజీ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మాత్రమే ప్రెస్‍మీట్లు నిర్వహించి కవిత తీరును ఖండించారు.
కవిత వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ప్రతిసారి కేసీఆర్ ఫాంహౌజ్ మీటింగ్‍కు వీరు అటెండ్ అయ్యారు. ప్రస్తుతం కవితను సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ తరఫున ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్ రావు పేరుతోనే లేఖ రిలీజ్ అయ్యింది.
గ్రేటర్‍లో దాస్యం బ్రదర్స్‌పై అందరిచూపు..
కల్వకుంట్ల కవితను బీఆర్‍ఎస్ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో సొంత పార్టీ నేతలతోపాటు ఇతరులంతా గ్రేటర్ వరంగల్లోని దాస్యం బ్రదర్స్ అడుగులను గమనిస్తున్నారు. వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అతడి తమ్ముడు, మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్ భాస్కర్ జాగృతి సంస్థలో కీలకంగా ఉన్నారు. జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలిగా కవిత ఉండగా, దాస్యం విజయ్ భాస్కర్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. కేటీఆర్‍తో కవితకు విభేదాలు వచ్చాక సైతం కవిత గ్రేటర్లో మీటింగ్ పెట్టగా విజయ్ భాస్కర్ ఏర్పాట్లు చూశారు.
మొత్తంగా అన్న వినయ్ భాస్కర్ కేటీఆర్ మనిషిగా ఉంటే, తమ్ముడు విజయ్ భాస్కర్ కవిత ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఇప్పటికే దాస్యం కుటుంబం నుంచి కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ వీరితో విభేదించి బీజేపీలో చేరారు.ప్రస్తుతం కవితపై సస్పెన్షన్ వేటు నేపథ్యంలో దాస్యం బ్రదర్స్ ఎలాంటి అడుగులు వేస్తారనేదానిపై కేడర్‍లో టెన్షన్ నెలకొంది.