అంతా అయోమయం!..గ్రేటర్ సిటీలో కనిపించని ఎన్నికల హడావుడి

అంతా అయోమయం!..గ్రేటర్ సిటీలో కనిపించని ఎన్నికల హడావుడి
  •  ప్రధాన పార్టీల కేడర్​లో కనిపించని జోష్​
  • టికెట్ ఖరారైన అభ్యర్థులకు అసంతృప్తుల టెన్షన్ 
  • పార్టీల ఆఫీసుల్లోనూ కనిపించని ప్రచార సందడి
  • మీటింగ్​లు, భేటీలతోనే సరిపెడుతున్న క్యాండిడేట్లు

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ ​సిటీ లీడర్లలో అయోమయం, స్తబ్ధత నెలకొంది. ఏ పార్టీలోనూ పెద్దగా జోష్ కనిపించడం లేదు. ఒకప్పుడు ఎన్నికలంటే షెడ్యూల్​నాటి నుంచే హడావిడి మొదలయ్యేది. ప్రస్తుత రాజకీయాలను పరిశీలిస్తే ఏ నేత.. ఏ పార్టీలో చేరతాడు? అనే చర్చనే జరుగుతుంది. దీంతో పార్టీల నేతల వైఖరితో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్​ అభ్యర్థులను ఖరారు చేసి బీ ఫామ్​లు కూడా అందజేసింది.

కాంగ్రెస్​ తొలి జాబితాను విడుదల చేసింది. బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో పార్టీల్లో పూర్తిస్థాయిలో ప్రచారం మొదలు పెట్టకపోవడంతో కేడర్​లో పెద్దగా ఉత్సాహం లేదు. మొత్తానికి పార్టీ ఆఫీసుల్లో అసెంబ్లీ ఎన్నికల సందడే లేదు.

ప్రజల్లోకి వెళ్తే వ్యతిరేకత వస్తుందనే..

ఇప్పటికే టికెట్లు ఖరారైన బీఆర్ఎస్​ అభ్యర్థులు ఇంకా నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం లేదు. టికెట్లు ఆశించిన పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉండడమే కారణంగా ఉంది. దీంతో అభ్యర్థులు వారిని బుజ్జగించే పనిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలోకి వెళ్తే  ప్రజలు ఎదురు తిరుగుతారోననే భయం కూడా కొందరిలో నెలకొంది. దీంతో చాలామంది బీఆర్ఎస్​అభ్యర్థులు అసంతృప్తులను కలవడం, చిన్న చిన్న సమావేశాలు నిర్వహించి ఎన్నికల్లో ఎలా ముందుకుపోవాలనే దానిపైనే చర్చించుకుంటున్నారు. ఇంకొందరు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరేలా బేరసారాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా డబుల్​బెడ్​రూమ్​ ఇండ్లు, పెన్షన్​లు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో చాలా సెగ్మెంట్లలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.  

దళితబంధు, బీసీ బంధు కూడా అర్హత ఉన్న వారికి ఇవ్వలేదనే ఆరోపణలున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రజల్లోకి వెళ్తే వ్యతిరేకత వస్తుందేమోననే భయం కూడా పలువురు అభ్యర్థులను వెంటాడుతున్నది. బీఆర్ఎస్​ క్యాండిడేట్లు  బస్తీపెద్దలు, కాలనీ అసోసియేషన్లను తమ వద్దకే పిలిపించుకుని మాట్లాడుతున్నారు.  వారికి అవసరమైన సాయం చేస్తా మంటూ హామీలు ఇస్తున్నారు. 

కాంగ్రెస్, బీజేపీల్లోనూ అదే టెన్షన్ ​

కాంగ్రెస్, బీజేపీల్లోనూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న  పరిస్థితే ఉంది. కాంగ్రెస్​ తొలి జాబితా విడుదలైనా చాలామంది అభ్యర్థులు ఇంకా ఇంటికే పరిమితమయ్యారు. టికెట్​రాని అసంతృప్తులను ఏ విధంగా బుజ్జగించాలనే సమాలోచనలు చేస్తున్నారు. సొంత పార్టీలోనే ఉంటూ సహకరించకుండా ఓడిస్తారేమోననే అనుమానం కొందరు అభ్యర్థుల్లో నెలకొంది. దీంతో ఇప్పుడే ప్రచారం చేసేందుకు సాహసించడం లేదు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్​లోకి వచ్చేలా బీఆర్ఎస్​అసంతృప్తులతో చర్చలు జరపడం, నియోజకవర్గంలోని కాలనీలు, యువజన, కుల సంఘాలతో కూడా కాంగ్రెస్​నేతలు భేటీ అవుతున్నారు.

కొందరు అభ్యర్థులు కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారిని బుజ్జగించే పనిలో ఉన్నారు. బీజేపీ పరిస్థితి కూడా అలాగే వుంది. ఇప్పటివరకూ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో కమలం కార్యకర్తలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఏ సెగ్మెంట్​నుంచి ఎవరికి చాన్స్ వస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి గ్రేటర్ సిటీలో ఎన్నికల ప్రచారం హడావిడి పెద్దగా లేకపోవడంతో అన్నిపార్టీల కార్యకర్తలు, నేతలు తీవ్ర అయోమయంలో ఉన్నారు.