
- 38 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గందరగోళం
- అందరినీ కో ఆర్డినేట్ చేసుకోలేక ఎమ్మెల్యేలకు తిప్పలు
- ఎన్నికల ఏర్పాట్ల విషయంలో అధికారులకు కన్ఫ్యూజన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల విషయంలో నెలకొన్న గందరగోళం ఇప్పుడు ఇంకింత ఎక్కువైంది. ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు తమ జిల్లా విషయంలో ఒక్కోసారి.. ఒక్కోలా ఇబ్బంది పడుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో ఒక్కో నియోజకవకర్గం.. రెండు, మూడు జిల్లాలకు విస్తరించడంతో ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు ఆగమైతున్నరు. నిన్నమొన్నటి దాకా స్కీముల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు.. ఇప్పుడు ప్రచారం విషయంలో తిప్పలు పడుతున్నారు. మరోవైపు ఎన్నికల పనులు చేస్తున్న ఆఫీసర్లు.. రెండు, మూడు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడుతూ ముందుకుపోవాల్సి వస్తున్నది. రాష్ట్రంలో 38 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇలా రెండు, మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.
ఎన్నికల నిర్వహణలో ఇబ్బందులు
2016లో రాష్ట్ర సర్కార్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. దీంతో అప్పటి దాకా ఒక జిల్లాలోనే ఉన్న నియోజకవర్గాలు కాస్త.. రెండు, మూడు జిల్లాల్లోకి మారాయి. ఫలితంగా ఒక నియోజకవర్గంలో ఒక మండలం జనాలు ఒక జిల్లాలో.. ఇంకొక మండలం ప్రజలు వేరే జిల్లాలోకి వెళ్లారు. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టిన సీఈఓ కార్యాలయం.. ఏ నియోజకవర్గం ఏ జిల్లాలో ఉన్నదనే దానిపై స్పష్టత తీసుకుంటున్నది. రాష్ట్రవ్యాప్తంగా 38 నియోజకవర్గాలు ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఆయా నియోజకవర్గాల్లోని మండలాలు, గ్రామాలు ఒక్కో జిల్లా పరిధిలో ఉన్నాయి.
అయితే ఇలా రెండు, మూడు జిల్లాల పరిధిలో ఉంటే ఎలక్షన్ కోడ్, ఎన్నికల నిర్వహణ విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల కోసం ఒకటే జిల్లా అధికార పరిధిలోకి వీటిని తీసుకురావాలని చూస్తున్నారు. మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, జనగామ, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, వర్ధన్నపేట, భూపాలపల్లి, ధర్మపురి, చొప్పదండి, వేములవాడ, మానకొండూరు, హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్, ఎల్బీ నగర్, చేవెళ్ల, పరిగి, కొడంగల్, దేవరకొండ, మక్తల్, వంటి నియోజకవర్గాలు రెండు, ఆపైన జిల్లాల్లో ఉన్నాయి. ఇందులో ఎక్కువగా రిజర్వ్డ్ స్థానాలే ఉండటం గమనార్హం. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఉండగా.. ఇప్పుడు సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఉన్నది. ఖనాపూర్ నియోజకవర్గం ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో విస్తరించి ఉంది.
ఎవరికి రిపోర్ట్ చేయాలె
ఒక నియోజకవర్గం ఒక జిల్లాలో ఉంటేనే సంబంధిత ఉమ్మడి జిల్లా మంత్రి, కలెక్టర్‌తో ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు రెండు, మూడు జిల్లాలతో అటు మంత్రులను, కలెక్టర్లను మేనేజ్ చేసుకునేందుకు ఇంకింత కష్టమైతుందని అధికారులు అంటున్నారు. ఎలక్షన్ల టైంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఏదైనా చేయాలంటే ప్రతి ఒక్కరి పర్మిషన్ అవసరమైతుందని చెబుతున్నారు. ఎలక్షన్ల ఏర్పాట్లకు రెడీ అవుతున్న అధికారులకు.. అసలు ఎవరికి రిపోర్ట్ చేయాలనే దానిపైనా గందరగోళం ఉందని అంటున్నారు. దీనిపై ఈసీ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనుందని పేర్కొంటున్నారు.