
- కాంగ్రెస్, లెఫ్ట్ పొత్తులపై అయోమయం
- ఇప్పటికీ స్టేట్ లీడర్ల మధ్య చర్చలే జరగలె
- ఏదో ఒకటీ తేల్చాలంటున్న లెఫ్ట్ నేతలు
- రంగంలోకి ఇరు పార్టీల నేషనల్ లీడర్లు
- నాలుగైదు రోజుల్లో పొత్తులపై స్పష్టత!
హైదరాబాద్, వెలుగు : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తుపై అయోమయం కొనసాగుతున్నది. నెలరోజులుగా పొత్తుపై ప్రచారం జరుగుతున్నా, ఇప్పటికీ స్పష్టత రాలేదు. కాంగ్రెస్ స్టేట్ లీడర్లు, సీపీఎం, సీపీఐ రాష్ట్ర నేతల మధ్య ఒక్కసారి కూడా భేటీ కాకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఒకటీ, రెండు సార్లు కాంగ్రెస్ జాతీయ నాయకులు.. లెఫ్ట్ పార్టీల నేతలు చర్చలు జరిపారు. ఆ తర్వాత వాళ్ల ఊసే మరిచిపోయారు. అటు సీపీఎం, సీపీఐ పార్టీల నేతలూ కాంగ్రెస్ తో పొత్తుపై ఆచితూచి మాట్లాడుతున్నారు.
త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం జరిగింది. ఆ రకంగానే ఆయా పార్టీల మధ్య సఖ్యత కొనసాగింది. ఇరుపార్టీల నేతలతో చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ తను పోటీ చేసే స్థానాలను ప్రకటించింది. దీంతో పొత్తు లేదని తేలడంతో, లెఫ్ట్ పార్టీలను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. నెలరోజుల క్రితం రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేతో పాటు ఏఐసీసీ ప్రతినిధులు ఇరు పార్టీలతో చర్చలు జరిపారు. ఈక్రమంలో చెరో ఐదుస్థానాల్లో పోటీ చేస్తామనే ప్రతిపాదనలు సీపీఎం, సీపీఐ నేతలు వారికి అందించారు. కనీసం చెరో మూడు సీట్ల చొప్పున ఇచ్చినా, సర్దుకుపోవాలనే భావనలో ఆయా పార్టీలున్నాయి. అయితే, కాంగ్రెస్ స్టేట్ లీడర్లు ఎవ్వరూ సీపీఎం, సీపీఐ రాష్ట్ర నేతలతో చర్చలు జరపలేదు. కనీసం ఫోన్లలోనూ మాట్లాడలేదని తెలుస్తున్నది. దీంతో ఇటీవల కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాలు హైదరాబాద్లో జరగ్గా, ఈ సమయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ కలిసి చర్చించారు. ఆ తర్వాత లెఫ్ట్ పార్టీల నేతలతో ఎవ్వరూ మాట్లాడలేదు.
రంగంలోకి నేషనల్ లీడర్లు..
కాంగ్రెస్, లెఫ్ట్ పొత్తులపై స్టేట్ లెవెల్లో స్పష్టత లేకపోవడంతో ఇరు పార్టీల జాతీయ నాయకులు రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే సీపీఎం, సీపీఐ రాష్ట్ర నేతలు జాతీయ నేతలకే ఆ బాధ్యతలు అప్పగించారు. ఇండియా కూటమిలోని భాగస్వాములుగా ఉండటంతో, ఆయా పార్టీల నేతలు రాష్ట్రస్థాయిలోనూ పొత్తులకే మొగ్గు చూపుతున్నారు. ఒకటీ, రెండ్రోజుల్లో ఢిల్లీలో తెలంగాణలో పొత్తులపై చర్చలు జరిగే అవకాశాలున్నాయి. అయితే, కాంగ్రెస్ లో సీనియర్ స్టేట్ లీడర్లు పొత్తులపై వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తున్నది. లెఫ్ట్ తో పొత్తు ఎన్నిసెగ్మెంట్లో కలిసి వస్తుందనే దానిపైనా కాంగ్రెస్ రహస్యంగా సర్వేలు నిర్వహిస్తున్నదని సమాచారం. వచ్చే రిపోర్ట్ ఆధారంగానే లెఫ్ట్ తో పొత్తు ఉండే అవకాశముందనే వాదనలున్నాయి. అయితే తమతో పొత్తు ఉంటుందా లేదా ఏదో ఒకటి తేల్చాలని లెఫ్ట్ నేతలు కాంగ్రెస్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో నాలుగైదు రోజుల్లో పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశముంది.