కర్నాటకలో సీఎం మార్పు తప్పదా?

కర్నాటకలో సీఎం మార్పు తప్పదా?

అధికార కూటమికి చెందిన14 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో కర్ణాటకలో తలెత్తిన పొలిటికల్​ క్రైసిస్​ ఇంకా ఓ కొలిక్కిరాలేదు. ఆదివారమంతా కాంగ్రెస్, జేడీఎస్​ కీలక నేతలు విడివిడిగా కొన్ని, ఉమ్మడిగా కొన్ని మీటింగ్​లు నిర్వహించారు. రాజీనామా చేసి, ముంబైలో మకాం వేసిన ఎమ్మెల్యేలను రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.  అయితే, కుమారస్వామిని దింపేసి, సిద్ధరామయ్య లేదా వేరే నేతను సీఎంగా ప్రకటిస్తేనే తిరిగొస్తామని ‘రాజీనామా’ ఎమ్మెల్యేలు డిమాండ్​ చేశారు. ఒకవేళ అదే కాంగ్రెస్​ నిర్ణయమైతే ప్రభుత్వం నుంచి వైదొలుగుతామని దేవెగౌడ ప్రకటించడంతో డ్రామా మరో మలుపు తిరిగినట్లైంది. దేవెగౌడ వార్నింగ్​తో సెల్ఫ్​డిఫెన్స్​లో పడ్డ కాంగ్రెస్​ పార్టీ తన ఎమ్మెల్యేలకు సర్క్యులర్​ జారీచేసింది. అమెరికా టూర్​ నుంచి అర్ధాంతరంగా తిరిగొచ్చిన సీఎం కుమారస్వామి ఆదివారం రాత్రి ఒక హోటల్​లో జేడీఎస్​ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.  ఈ పరిస్థితికి తాము కారణం కాదంటూనే, సర్కారు ఏర్పాటుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని బీజేపీ స్టేట్​ ప్రెసిడెంట్ యడ్యూరప్ప ప్రకటించారు. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్​ ఏ నిర్ణయం తీసుకుంటారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. రాజీనామాలు ఆమోదం పొందితే బలాబలాలు మారి, కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడం ఖాయం.

దేవెగౌడతో కాంగ్రెస్​ నేతల చర్చలు

రాజీనామాలు చేసి ముంబై వెళ్లిపోయిన 10 మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను తిరిగి బెంగళూరు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని, గందరగోళానికి ముగింపు పలికేలా పరిష్కారం సిద్ధం చేశామని మంత్రి డీకే శివకుమార్​ మీడియాకు చెప్పారు. అతిత్వరలోనే అంతా సర్దుకుంటుందని, కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమేనని కేపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ ఈశ్వర ఖండ్రే అన్నారు. ఈ ఇద్దరు నేతలతోపాటు ఏఐసీసీ జనరల్​ సెక్రటరీ కేసీ వేణుగోపాల్​, కర్నాటక డిప్యూటీ సీఎం పరమేశ్వర తదితరులు ఆదివారం జేడీఎస్​ సీనియర్ నేత దేవెగౌడ ఇంటికెళ్లి మంతనాలు జరిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వం కూలిపోకుండా చూసుకోవాలని, ఆ క్రమంలో ఎవరు త్యాగాలు చేయాల్సివచ్చినా వెనుకాడొద్దని నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. జేడీఎస్​ మంత్రి టీజీ దేవెగౌడ మీడియాతో మాట్లాడుతూ ‘‘ముంబై క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలకు ఫోన్​ చేశాను. సీఎం కుమారస్వామిని, కొందరు మంత్రులను మార్చేయాలని వాళ్లు డిమాండ్​ చేశారు. అందుకు నేను సరే అన్నా. ప్రభుత్వం నిలబడుతుందంటే రాజీనామాకు రెడీ” అని చెప్పారు.

సిద్దూని సీఎం కానియ్య: దేవెగౌడ

కాంగ్రెస్​ లీడర్లతో భేటీ తర్వాత జేడీఎస్​ నేత దేవెగౌడ మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేశారు. ప్రస్తుత సంక్షోభానికి కాంగ్రెస్​ పార్టీనే కారణమని, ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించింది, వాళ్లను ముంబైకి తరలించింది సిద్ధరామయ్యేనని ఆరోపించారు. ‘‘నాకంతా తెలుసు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలందరూ సిద్ధరామయ్య అనుచరులే. సీఎం పోస్టు కోసమే నాటకాలాడుతున్నారు. వాళ్ల కుట్రలు తెలిశాక మేం మాత్రం ఎలా ఊరుకుంటాం? ఎట్టిపరిస్థితుల్లోనూ సిద్ధరామయ్యను సీఎం కానియ్య. ఒకవేళ ఇదే కాంగ్రెస్​ నిర్ణయమైతే మేం మద్దతు ఉపసంహరించుకుంటాం”అని దేవెగౌడ స్పష్టం చేశారు. అమెరికా నుంచి  తిరిగొస్తూనే తన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన సీఎం కుమారస్వామి.. మూడ్రోజులుగా జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. రాజీనామా తప్పదనుకుంటే ఏ విధమైన వ్యూహంతో ముందుకెళ్లాలనేదానిపై జేడీఎస్​ నేతలు చర్చించినట్లు తెలిసింది.

రేపటిలోగా రాకుంటే అంతే: సిద్ధరామయ్య

సపోర్ట్​ విత్​డ్రా చేసుకుంటామన్న దేవెగౌడ వార్నింగ్​తో షాక్​కు గురైన కాంగ్రెస్​ పార్టీ.. ‘సేవ్​ గవర్నమెంట్’ ఆపరేషన్ మొదలుపెట్టింది. కూటమికి వ్యతిరేకంగా, సీఎం కుమారపైనా ఎవరూ మాట్లాడొద్దని పార్టీ నేతలకు సీఎల్పీ నేత సిద్ధరామయ్య సూచించారు. ముంబై నుంచి ఎమ్మెల్యేల్ని రప్పించడంలో భాగంగా హెచ్చరికలతో కూడిన సర్క్యులర్​ జారీచేశారు. ‘‘మంగళవారం అసెంబ్లీలో సీఎల్పీ సమావేశం ఉంటుంది. దానికి ఎమ్మెల్యేలంతా హాజరుకావాలి. ఒకవేళ రాకుంటే తీవ్ర చర్యలు తప్పవు’’ అని సర్క్యులర్​లో పేర్కొన్నారు.