ఢిల్లీ ఎయిర్ పోర్టులో రద్దీ సమస్యను 10 నుంచి 15 రోజుల్లో పరిష్కరిస్తాం : జ్యోతిరాదిత్య సింధియా

ఢిల్లీ ఎయిర్ పోర్టులో రద్దీ సమస్యను 10 నుంచి 15 రోజుల్లో పరిష్కరిస్తాం : జ్యోతిరాదిత్య సింధియా

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్ పోర్టులో రద్దీ సమస్యను 10 నుంచి 15 రోజుల్లో పరిష్కరిస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. కరోనా తర్వాత ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగిందని చెప్పారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఎయిర్ పోర్టులో విపరీతమైన రద్దీ, వెయిటింగ్ టైమ్ ఎక్కువ ఉండడం, చెకింగ్ కు గంటలకొద్దీ టైమ్ పడుతుండడంపై ప్యాసింజర్ల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఎయిర్ పోర్టులో జనం క్యూ కట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో సింధియా సోమవారం ఆకస్మికంగా ఢిల్లీ ఎయిర్ పోర్టును సందర్శించారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న టెర్మినల్ 3ని పరిశీలించి అధికారులతో మీటింగ్ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రద్దీని తగ్గించేందుకు ఎంట్రీ గేట్లను 14 నుంచి 16కు పెంచామని తెలిపారు. సెక్యూరిటీ లైన్లను కూడా 13 నుంచి 16కు పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. 

యాక్షన్ ప్లాన్ రెడీ.. 

సింధియా ఆదేశాలతో ఎయిర్ పోర్టులో రద్దీని తగ్గించేందుకు అధికారులు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. ఇందులో భాగంగా మార్నింగ్ పీక్ అవర్స్ లో ఫ్లైట్ల సంఖ్యను తగ్గిస్తారు. ప్రయాణికుల వెయిటింగ్ టైమ్ తెలుసుకునేలా ప్రతి గేట్ దగ్గర డిజిటల్ బోర్డు ఏర్పాటు చేస్తారు. గేట్ల దగ్గర రద్దీని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటర్ చేస్తారు. ఇమిగ్రేషన్, సెక్యూరిటీ సిబ్బందిని పెంచనున్నారు. ఎయిర్ పోర్టులోని టీ3 టెర్మినల్​ నుంచి రోజూ దాదాపు 1,200 ఫ్లైట్లలో 1.90 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. దీనిపై ఒత్తిడి తగ్గించేందుకు కొన్ని ఫ్లైట్లను 
టీ1, టీ2కు తరలించనున్నారు.