
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ను వ్యతిరేకించడమే కాంగ్రెస్ యొక్క ఏకైక ఉద్దేశ్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. బుధవారం హర్యానా రాష్ట్రం కైతాల్ లో అమిత్ షా… త్వరలో భారత్ కు చేరుకోబోతున్న రాఫెల్ యుద్ధ విమానాలపై కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలపై ఆయన దాడి చేశారు. విజయదశమి రోజున శాస్త్రోక్తంగా పూజలు చేయడం తప్పా? అందులో విమర్శలు చేయాల్సిన అవసరమేముంది అంటూ ప్రశ్నించారు.
విజయదశమి రోజున (మంగళవారం) భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫ్రాన్స్ లో రాఫెల్ ఫైటర్ జెట్ ను ఆ దేశ అధ్యక్షుడి చేతుల మీదుగా అధికారికంగా అందుకున్నారు. దసరా పండుగ రోజున యుద్ధ విమానాన్ని అందుకున్న రాజ్ నాథ్ సింగ్.. భారత సంస్కృతి, సంప్రదాయం ప్రకారం విమానానికి పూజలు చేసి అందులో ఆకాశయానం చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు పలు రకాలుగా విమర్శలు చేశారు.
“విజయదశమి కి, రాఫెల్ యుద్ధ విమానానికి ఏలాంటి సంబంధం లేదు. మత పరమైన పండుగను, ఓ ఎయిర్ క్రాఫ్ట్ కు అనుసంధానం చేయడమేంటి?” అని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ అన్నారు. ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన ఓ నేత అల్కా లాంబా ఒకవేళ ఈ వేడుకను మాజీ రక్షణ మంత్రి ఏకే అంటోని, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వారి వారి మతం ప్రకారం పూజలు చేస్తే ఎలా ఉండేదో అంటూ అశ్చర్యం వ్యక్తం చేశారు. రాజ్ నాథ్ సింగ్ లాగా వారు కూడా బైబిల్ తోనో, ఖురాన్ తోనో పూజలు చేసి ఉంటే ఈ రోజున ఏం జరిగేదో? అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై మండి పడిన హోం మంత్రి అమిత్ షా.. కాంగ్రెస్ పార్టీ భారతీయ సంప్రదాయాలకు వ్యతిరేకమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతలు ఏ విషయం గురించి విమర్శించాలి, ఏ విషయం గురించి విమర్శించకూడదనే విషయంపై ఆలోచించుకుని మాట్లాడాలని చురకలంటించారు.