పార్టీలోకి రండి.. లేదంటే సహకరించండి !..అసంతృప్త నేతలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫోకస్

పార్టీలోకి రండి.. లేదంటే సహకరించండి !..అసంతృప్త నేతలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫోకస్
  • డబ్బు, పదవులు ఇస్తామని ఆశ చూపుతూ..  గెలిచేందుకు ఎంతకైనా సిద్ధమంటున్న నేతలు
  • గ్రేటర్ సిటీలో జోరందుకున్న కోవర్టు పాలిటిక్స్ 

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ పరిధిలోని ముషీరాబాద్, అంబర్ పేట, ఉప్పల్, సనత్ నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్​ తదితర నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య కోవర్ట్ రాజకీయం జోరందుకుంది. అసెంబ్లీ ఎన్నికల టికెట్లు దక్కని అసంతృప్త నేతలను తమ వైపునకు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పార్టీలో చేరకపోయినా సహకరించాలని కోరుతూ.. డబ్బు లేదంటే పవర్ లోకి వచ్చాక పదవులు ఇస్తామని ఆశ చూపుతున్నారు. కొందరు సొంత పార్టీని వీడి  వేరే పార్టీలో చేరిపోతుండగా..  మరికొందరైతే సొంత పార్టీలోనే ఉంటూ అసంతృప్త నేతలుగానే కొనసాగుతున్నారు. ఇలాంటి వారినే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు టార్గెట్ గా చేసుకుని తమ వైపు తిప్పుకుంటున్నారు. 

టార్గెట్ అసంతృప్త నేతలు 

అభ్యర్థులు పోటా పోటీ ప్రచారాలకు సిద్ధమయ్యారు.  సర్కార్ వ్యతిరేక ఓటును దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలను పన్నుతుంది. బీఆర్ఎస్  అసంతృప్త నేతలు, కార్యకర్తలు, బూత్ కమిటీల్లోని నేతలను తమ పార్టీలోకి రావాల్సిందిగా కోరుతుంది. కొందరు పార్టీని వీడడానికి ఇష్టపడడం లేదు. ముషీరాబాద్​బీఆర్ఎస్ అభ్యర్థిగా ముఠా గోపాల్​ను ప్రకటించిన తర్వాత టికెట్ఆశించిన ఎంఎన్ శ్రీనివాస్ తీవ్ర అసంతృప్తితో ఉండగా, పార్టీ మారడానికి ఆయన సిద్ధపడడం లేదు. 

ఇలాంటి వారితో కాంగ్రెస్ చర్చలు జరుపుతుంది. అంబర్ పేట లో కాలేరు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన పలువురు కార్పొరేటర్లు, సీనియర్ నేతలు డీపీ రెడ్డి వంటి వారిని బుజ్జగించినా శాంతించడం లేదు. పార్టీ మారేది లేదని అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు కాకపోయినా తమకు టికెట్ ఖాయమనే నేతలు బీఆర్ఎస్ నేతలతో టచ్ లోకి వెళ్లారు. సనత్ నగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి తలసాని శ్రీనివాస్ ను పార్టీ అధిష్టానం ప్రకటించింది. 

ఇక్కడి నుంచి పోటీ చేయాలని కొందరు భావించినా ఆయనతో పోటీపడేందుకు భయాందోళన వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థిగా కోట నీలిమను ప్రకటించారు. ఆమె గెలుపు కోసం కాంగ్రెస్ నేతలు ప్లాన్ సిద్ధం చేశారు.  ఉప్పల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి ఖరారు అయ్యారు. దీంతో ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, సిట్టింగ్ఎమ్మెల్యు భేతి సుభాశ్​రెడ్డి అసంతృప్తితో ఉండగా  వీరితోనూ కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. 

టచ్ లోకి వెళ్తూ..

 కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన వారిపైనా బీఆర్ఎస్ నేతలు ఫోకస్ పెట్టారు.  పార్టీలో చేరేందుకు సిద్ధమైతే  చేర్చుకుంటున్నారు. లేదంటే  సొంతపార్టీలోనే ఉంటూ తమకు సహకరించాలని కోరుతున్నారు.  ఉప్పల్ టికెట్ ఆశించి నిరాశకు గురైన రాగిడి లక్ష్మారెడ్డి పార్టీని బాహాటంగానే విమర్శించారు. ఆయనతో పాటు సీనియర్ నేత సోమసుందర్ రెడ్డి తదితరులతో బీఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారు. సనత్ నగర్ కాంగ్రెస్  టికెట్ ఆశించిన రవీందర్ గౌడ్, విజయవర్దన్ నాయుడు, నాగేందర్ తదితరులను తమ వైపు లాక్కునేందుకు బీఆర్ఎస్ నేతలు వారితో చర్చిస్తున్నట్టు సమాచారం.

 ముషీరాబాద్ కాంగ్రెస్ టికెట్ ఆశించిన పార్టీ సీనియర్ నేత నగేశ్ ముదిరాజ్ తీవ్ర అసంతృప్తితో ఉండగా..  ఆయనను కూడా పార్టీలోకి చేర్చుకునేందుకు గులాబీ నేతలు లాబీయింగ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ ఆదం సంతోష్ కుమార్ కు టికెట్ ఇవ్వడంతో  కొందరు కిందిస్థాయి లీడర్లు  గుర్రుగానే ఉన్నారు.  తమకు సహకరించే విధంగా కారు పార్టీ నేతలు వారితో చర్చిస్తున్నారు. ఇలా గెలిచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.  ఇందుకు ఎంత ఖర్చు పెట్టేందుకైనా సిద్ధమవుతున్నారు.  దీంతో చాలా సెగ్మెంట్లలో  కోవర్టు రాజకీయాలు ఊపందుకోగా..  అభ్యర్థుల గెలుపు ఓటముల్లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకోనుంది.