ఎమ్మెల్సీ ఎలక్షన్ ​.. రూ.100 కోట్లు!

ఎమ్మెల్సీ ఎలక్షన్ ​.. రూ.100 కోట్లు!
  • 28న మహబూబ్​నగర్ స్థానిక ఎమ్మెల్సీ సీటుకు బైపోల్
  • లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్
  • ఒక్కో ఓటుకు రూ.3 లక్షల నుంచి 5 లక్షల దాకా ఆఫర్​
  • ఓటర్లను గోవా, ఊటీ, కొడైకెనాల్​ తరలించిన లీడర్లు
  • సిట్టింగ్ సీటు చేజారకుండా ‘బీఆర్ఎస్’ పాట్లు
  • కష్టకాలంలో ఉన్నాం.. అండగా ఉండండి: కేటీఆర్

మహబూబ్​నగర్, వెలుగు : మహబూబ్​నగర్ ​లోకల్ ​బాడీ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్​ ప్రలోభాలకు తెరతీశాయి. ఈ ఎన్నికల ప్రభావం లోక్ సభ ఎన్నికలపై ఉంటుందనే అంచనాతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను లక్షలు పోసి కొంటున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్  పరిధిలో 1,439 ఓటర్లు ఉండగా, ఒక్కొక్కరికి  తక్కువలో తక్కువ రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల దాకా ఆఫర్​ చేస్తున్నాయి. అప్పటికీ ఓటర్లపై నమ్మకం లేకపోవడంతో గోవా, కొడైకెనాల్, ఊటీ తదితర క్యాంపులకు తరలించిన పార్టీలు.. పోలింగ్ ​రోజే జిల్లాలో అడుగుపెట్టేలా ప్లాన్​ చేశాయి. మొత్తం మీద ఈ బైపోల్​ కోసం ప్రజాప్రతినిధులకు నజరానాలు సహా క్యాంపుల రూపంలో రెండు పార్టీలు ఏకంగా రూ.100 కోట్ల దాకా ఖర్చు పెడుతుండడం చర్చనీయాంశంగా మారింది.

2021లో జరిగిన మహబూబ్​నగర్ లోకల్​బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ పార్టీ నుంచి పోటీచేసిన కసిరెడ్డి నారాయణరెడ్డి గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్​పార్టీలో చేరిన కసిరెడ్డి.. కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో నిరుడు డిసెంబర్​8న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం ఫిబ్రవరి 26న షెడ్యుల్​ రిలీజ్​ చేసింది.

మార్చి 12 వరకు నామినేషన్లు​ స్వీకరించగా, కాంగ్రెస్​ నుంచి  మన్నె జీవన్​ రెడ్డి, బీఆర్ఎస్​ నుంచి మహబూబ్​నగర్​ మాజీ జడ్పీ వైస్​చైర్మన్​ నవీన్​ రెడ్డి, ఇండిపెండెంట్​ క్యాండిడేట్​ ఎంపీటీసీల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు గడీల కుమార్​ గౌడ్​ నిలిచారు. కాంగ్రెస్​ అభ్యర్థికి ఎంపీటీసీలు సపోర్ట్​ చేస్తే, వారి సమస్యలు పరిష్కరిస్తామని ఇటీవల పాలమూరులో జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ లో సీఎం రేవంత్​ రెడ్డి హామీ ఇవ్వడంతో కుమార్​ గౌడ్​ పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్​ మధ్యే పోటీ నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్​నగర్, కొడంగల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, కొల్లాపూర్, నాగర్​కర్నూల్, అచ్చంపేట, షాద్​నగర్​, కల్వకుర్తిలో పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేయగా గురువారం పోలింగ్​ జరగనుంది.

వారం రోజులుగా క్యాంపులు 

లోక్ సభ ఎన్నికల షెడ్యుల్​ విడుదలైన నేపథ్యంలో ఎమ్మెల్సీ బైపోల్​లో గెలుపును కాంగ్రెస్, బీఆర్ఎస్​ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయి వలసలతో అతలాకుతలమవుతున్న బీఆర్ఎస్.. ఈ సిట్టింగ్  స్థానాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఎంపీటీసీలు, కౌన్సిలర్లు చేజారుతుండడంతో వారం క్రితమే కొందరిని గోవాకు, ఇంకొందరిని ఊటీకి తరలించి క్యాంపులు నడుపుతోంది. వంద మంది సభ్యులున్న బీజేపీ కూడా రెండు రోజుల కింద అందరినీ కొడైకెనాల్​తరలించింది. వీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారనే విషయంలో క్లారిటీ లేదు. తాజాగా కాంగ్రెస్​ పార్టీ కూడా తమ ప్రజాప్రతినిధులను ఏపీ, కర్నాటకలో విహారయాత్రలకు తీసుకెళ్లింది. ఆయా పార్టీల తరపున కొందరు నేతలను ఇన్​చార్జ్​లుగా నియమించడంతో వారు దగ్గరుండి ప్రజాప్రతినిధుల బాగోగులు చూసుకుంటున్నారు. 

ఓటుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల దాకా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1,439 మంది లోకల్​బాడీ ప్రజాప్రతినిధులు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వారిలో ఎక్స్​అఫీషియో సభ్యులు 19 మంది పోను మిగిలిన 1,420 మందికి  క్యాండిడేట్లు పెద్దమొత్తంలో ఆఫర్​ చేస్తున్నట్లు తెలిసింది. ఒక్కో ఓటుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఇస్తున్నట్లు సమాచారం. రెండు రోజులుగా ఆయా ప్రాంతాల్లో క్యాంపుల్లో ఉన్న ఓటర్లకు అక్కడే బయానా కింద  ఓటుకు రూ.1.50 లక్షల నుంచి రూ.2.5 లక్షల దాకా ముట్టజెప్పినట్లు సమాచారం. మిగిలిన డబ్బులను పోలింగ్​ రోజు ఇచ్చేలా అగ్రిమెంట్​ చేసుకున్నట్లు తెలిసింది. అప్పటి వరకు వీరంతా క్యాంపుల్లోనే ఉండేట్లు ఏర్పాట్లు చేశారు. 27వ తేదీ రాత్రి వారిని క్యాంపుల నుంచి తీసుకెళ్లి 28న  ఉదయం నేరుగా పోలింగ్​ కేంద్రాలకు తీసుకొచ్చి ఓట్లు వేయించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే 19 మంది ఎక్స్ అఫీషియో ఓటర్లకు కూడా పెద్ద మొత్తంలో ఆఫర్​ చేసినట్లు తెలిసింది. మొత్తం మీద ఇద్దరు అభ్యర్థులు కలిసి రూ.100 కోట్లకు పైనే ఖర్చు పెడ్తున్నట్లు భావిస్తున్నారు. 

గోవా క్యాంపులో ఓటర్లతో  కేటీఆర్ భేటీ

బీఆర్ఎస్​ పార్టీ కష్టకాలంలో ఉన్నందున అందరూ అండగా నిలబడాలని ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్​ ఎమ్మెల్సీ ఓటర్లను వేడుకున్నారు.  గోవా క్యాంపులో ఐదు రోజులుగా ఉంటున్న లోకల్​బాడీస్​ ప్రజాప్రతినిధులతో కేటీఆర్, మాజీ మంత్రి శ్రీనివాస్​ గౌడ్, లోక్ సభ బీఆర్ఎస్​ అభ్యర్థి ఆర్ఎస్  ప్రవీణ్​ కుమార్  తదితరులు సోమవారం భేటీ అయ్యారు. ఓ రిసార్టులో ఏర్పాటు చేసిన మీటింగ్​లో కేటీఆర్​ మాట్లాడారు. భవిష్యత్తు మనదేనని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ధైర్యంగా ఓటేయాలని కేటీఆర్  అన్నట్లు తెలిసింది.