కాంగ్రెస్.. ‘85% కమీషన్’ పార్టీ : మోడీ

కాంగ్రెస్.. ‘85% కమీషన్’ పార్టీ : మోడీ
  • కాంగ్రెస్.. ‘85% కమీషన్’ పార్టీ
  • అవును నేను పామునే.. అందుకే శివుడి మెడలో ఉంటా
  • కోలార్ బహిరంగ సభలో  ఖర్గేకు మోడీ కౌంటర్

కోలార్/ఖానాపూర్(కర్నాటక): కాంగ్రెస్ 85% కమీషన్ తీసుకునే పార్టీ అని, మళ్లీ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేయాలనుకుంటున్నదని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. స్కామ్స్​లో జైలుకెళ్లి బెయిల్​పై బయటికి వచ్చిన రాయల్ ఫ్యామిలీలు కాంగ్రెస్​లో ఉన్నాయని ఎద్దేవా చేశారు. ‘‘ఖర్గే నన్ను విషపూరితమైన పాముతో పోల్చారు. పాము శివుడి మెడలో ఉంటేనే బాగుంటుంది. అందరూ శివుడిని మొక్కుతారు. నన్ను అలాంటి పాముతో పోల్చినందుకు సంతోషంగా ఉంది” అంటూ మోడీ కౌంటర్ ఇచ్చారు. కర్నాటక ఎలక్షన్ క్యాంపెయిన్​లో భాగంగా కోలార్​లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ మాట్లాడారు. ‘‘స్కామ్స్, కమీషన్ల కారణంగానే ప్రజలకు కాంగ్రెస్ అంటే నమ్మకం పోయింది. కమీషన్లపై ఒకప్పుడు కాంగ్రెస్ ప్రధానే ఒక మాట అన్నారు. ఢిల్లీ నుంచి రూపాయి పంపిస్తే.. 15 పైసలే ప్రజలకు చేరుతున్నాయన్నారు. 85 పైసలు కాంగ్రెస్ లీడర్లు దోచుకుంటున్నారని చెప్పారు”అని మోడీ గుర్తు చేశారు. 

లక్షల కోట్లు దోచుకున్నరు

85% కమీషన్ తీసుకునే కాంగ్రెస్​తో కర్నాటక డెవలప్ కాదని మోడీ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఢిల్లీ నుంచి రిలీజ్ అయిన ప్రతి రూపాయీ ప్రజల అకౌంట్​లోకి డైరెక్ట్ గా వెళ్తోందన్నారు. 9ఏండ్లలో రూ.29 లక్షల కోట్లు వివిధ స్కీమ్స్ కింద పేద ప్రజల ఖాతాల్లో జమ అయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే ఈ రూ.24లక్షల కోట్లలో 85% కమీషన్ కింద పోయేవని ఎద్దేవా చేశారు. ‘‘కాంగ్రెస్ తీసుకొచ్చిన ప్రతీ స్కీమ్​లో స్కామ్ జరిగేది. ఎంతో మంది లీడర్లు స్కామ్స్​లో ఇరుక్కుని జైలుకెళ్లి బెయిల్​పై బయటికొచ్చి తిరుగుతున్నారు. వాళ్లే ఇప్పుడు ఎన్నికల్లో నిలబడి ప్రచారం చేస్తున్నారు” అని మోడీ తెలిపారు.

తొమ్మిదేండ్లలో లక్ష కోట్ల ఆస్తులు సీజ్

2014కు ముందు తొమ్మిదేండ్ల కాంగ్రెస్​ పాలనలో రూ.5వేల కోట్ల అవినీతి ఆస్తులు సీజ్ చేస్తే.. తాము 9 ఏండ్లలో రూ.లక్ష కోట్లు విలువైన ఆస్తులు సీజ్ చేశామని మోడీ తెలిపారు. ‘‘అవినీతిని కూకటి వేళ్లతో పీకేయడమే మా లక్ష్యం. కానీ, కాంగ్రెస్‌‌కు ఇది గిట్టడం లేదు. నన్ను ఆ పార్టీ లీడర్లు తిడుతున్నారు. బెదిరిస్తున్నారు. నన్ను బొంద పెట్టేందుకు సమాధి తవ్వుతున్నామంటున్నారు. మీరంతా ఓటుతో కాంగ్రెస్​కు బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్, జేడీ(ఎస్) అభివృద్ధికి అడ్డంకిగా మారాయి. కాంగ్రెస్ ఔట్ డేటెడ్ ఇంజిన్. ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలే. కర్నాటకను దేశంలోనే నంబర్ వన్‌‌గా మార్చాలి. అందుకే డబుల్ ఇంజిన్ సర్కార్‌‌ని ఎన్నుకోండి” అని ఓటర్లను మోడీ కోరారు.