కాంగ్రెస్​ బీసీ లీడర్లు సైలెంట్​!.. పొన్నాల ఎపిసోడ్​ తర్వాత మారిన పరిణామాలు

కాంగ్రెస్​ బీసీ లీడర్లు సైలెంట్​!.. పొన్నాల ఎపిసోడ్​ తర్వాత మారిన పరిణామాలు
  • సెకండ్​ లిస్ట్​ వచ్చే వరకు వేచి చూసే ధోరణి
  • తమకు 25 సీట్లయినా వస్తయా అని బీసీ నేతల్లో అనుమానాలు

హైదరాబాద్, వెలుగు: మొన్నటివరకు పార్టీ హైకమాండ్​కు అల్టిమేటంలు ఇచ్చిన కాంగ్రెస్​ బీసీ లీడర్లు ఇప్పుడు సైలెంట్​ అయ్యారు. అభ్యర్థుల సెకండ్​ లిస్టు ప్రకటించేదాకా వేచి చూసే ధోరణిలో ఉండాలని వారు భావిస్తున్నట్లు తెలిసింది. ఫస్ట్​ లిస్ట్​ ప్రకటించడానికి రెండు రోజుల ముందు గాంధీభవన్​లో ప్రెస్​మీట్​ పెట్టి మరీ పార్టీ ఆఫీసులోనే ఆందోళనలు చేస్తామని కొందరు బీసీ లీడర్లు హెచ్చరించారు.

 ఆ తర్వాత వారిపై హైకమాండ్​ నేతలు సీరియస్​ అయి ఢిల్లీకి పిలిచినట్లు తెలిసింది.  హైకమాండ్​ పిలుపు మేరకు కొందరు బీసీ లీడర్లు ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం. దానికి తోడు ఢిల్లీలో స్క్రీనింగ్​ కమిటీ మీటింగ్​, సెంట్రల్​ ఎలక్షన్​ కమిటీ మీటింగ్​లు జరిగే రోజే కాంగ్రెస్​ పార్టీ హైకమాండ్​, పీసీసీ చీఫ్​పై సంచలన ఆరోపణలు చేస్తూ పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేసి.. రెండురోజులకే కేసీఆర్​ సమక్షంలో బీఆర్​ఎస్​లో చేరారు. పొన్నాల ఎపిసోడ్​ తర్వాత నుంచి కాంగ్రెస్​ బీసీ లీడర్లు సైలెంట్​ అయ్యారు. లీడర్లు ఎవరూ ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేయొద్దని హైకమాండ్​ నుంచి గట్టి వార్నింగ్​ రావడంతోనే మౌనం దాల్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. 

ఫస్ట్​ లిస్టు వచ్చాక నో కామెంట్స్​

నాలుగు రోజుల కింద 55 మంది అభ్యర్థులతో ఫస్ట్​ లిస్ట్​ను కాంగ్రెస్​ ప్రకటించింది. అందులో బీసీలకు 12 సీట్లు కేటాయించింది. ఫస్ట్​ లిస్టులో 10 సీట్లనే కేటాయిస్తున్నారంటూ గాంధీభవన్​లో ప్రెస్​మీట్​ పెట్టి ఫైర్​ అయిన బీసీ లీడర్లు.. ఆ లిస్టు వచ్చాక దానిపై స్పందించలేదు. అయితే, బీసీలకు ఓడిపోయే స్థానాల్లోనే టికెట్లు ఇచ్చారంటూ తమ సన్నిహితుల వద్ద కొందరు లీడర్లు వాపోతున్నట్టు తెలిసింది. పార్టీకి పెద్దగా పట్టులేని ఓల్డ్​ సిటీ స్థానాల్లో టికెట్లు ఇవ్వడమేంటన్న చర్చ కూడా వారి మధ్య జరుగుతున్నది. అంతేగాకుండా తొలి జాబితాలో దాదాపు సగం స్థానాలనూ పెద్ద సామాజికవర్గం నేతలకే ఇచ్చారని బీసీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తున్నది. బీసీ లీడర్లను పట్టించుకుంటలేరన్న ఆందోళన ఉన్నప్పటికీ సెకండ్​ లిస్టు వచ్చే వరకు వేచి చూడాలని వారు భావిస్తున్నట్లు సమాచారం.

25 సీట్లన్నా వస్తయా..

వాస్తవానికి జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు సగం సీట్లు ఇవ్వాల్సిందేనని అన్ని బీసీ కులసంఘాలు డిమాండ్​ చేస్తున్నాయి. ఇటు కాంగ్రెస్​లోని బీసీ లీడర్లు కూడా మొదట్లో సగం సీట్ల కోసం పట్టుబట్టారు. అయితే, రాహుల్​ గాంధీ ఉదయ్​పూర్​ డిక్లరేషన్​ ప్రకారం ప్రతి పార్లమెంట్​ నియోజకవర్గం పరిధిలో రెండు స్థానాలను బీసీలకు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ లెక్కన 17 లోక్​సభ స్థానాల పరిధిలో 34 అసెంబ్లీ సీట్లు బీసీలకు దక్కుతాయని బీసీ లీడర్లు భావించారు. ఆ తర్వాత కూడా కనీసం 40 సీట్లు ఇవ్వాలన్న డిమాండ్​ను హైకమాండ్​ ముందుంచారు. 

34కు మించి సాధ్యం కాదని చెప్పడంతో.. ఆ సీట్లన్నా ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అన్ని సీట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదని ప్రచారం జరగడంతో  బీసీ లీడర్లు నిరసన బాట పట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కలిపి మొత్తం సీట్లలో సగం స్థానాలను ఇస్తామంటూ పీసీసీ పెద్దలు కొద్దిరోజులుగా ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ సగం సీట్లలో 25 సీట్లన్నా బీసీలకు వస్తాయా అని కొందరు బీసీ లీడర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 ఎందుకంటే పార్టీ పెద్దలు చెప్తున్నట్టు సగం సీట్లంటే 60లో 31 సీట్లు ఎస్సీ, ఎస్టీలకు పోతే.. మిగతా 29 సీట్లలో బీసీలు, మైనారిటీలకు ఎన్ని సర్దుతారన్న సందేహాలను లేవనెత్తుతున్నారు. సెకండ్​ లిస్ట్​ వచ్చే వరకు వేచి చూసి.. బీసీలకు ఇచ్చే సీట్లను బట్టి రెస్పాండ్​ కావాలన్న యోచనలో వారు ఉన్నట్టు సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో సెకండ్​ లిస్ట్​ వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాతనే మాట్లాడాలని వారు భావిస్తున్నట్లు తెలిసింది.