కేసీఆర్ లక్షల కోట్లు దోచుకుతిన్నడు..!

కేసీఆర్ లక్షల కోట్లు దోచుకుతిన్నడు..!
  •     బీఆర్​ఎస్​ దుకాణం బందైంది.. బీజేపీ తెలంగాణలో లేవది
  •     కాంగ్రెస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలె
  •     మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి
  •     ఆదరించి గెలిపిస్తే ఐదేండ్లు సేవ చేస్త 
  •     ఎంపీ అభ్యర్థి చామల కిరణ్​కుమార్​రెడ్డి

జనగామ, వెలుగు : "ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ రూ.లక్షల కోట్లు దోచుకుతిని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు. బీఆర్​ఎస్ దుకాణం బందైంది. తెలంగాణలో బీజేపీ లేవదు. జనగామలో పల్లా గిల్లా జాన్తా నై. ఎంపీ ఎలక్షన్​లో కాంగ్రెస్ భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి" అని పార్లమెంట్ ఎన్నికల ఇన్​చార్జి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి పిలుపునిచ్చారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్​కొమ్మూరి ప్రతాప్​రెడ్డి అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ గ్రౌండ్​లో శుక్రవారం పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ యువ నాయకుడు, కష్టపడే తత్వం ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్​ కుమార్​రెడ్డికి ఓటేసి గెలిపించాలని కోరారు. ఈనెల 21న భువనగిరిలో నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్​రెడ్డి హాజరువుతారని, ఊరూవాడ కదిలి పెద్దఎత్తున తరలివచ్చి ఆశీర్వదించాలని కోరారు.

ఆదరించి గెలిపిస్తే సేవ చేస్త : ఎంపీ అభ్యర్థి చామల కిరణ్​ కుమార్​ రెడ్డి

పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరికీ అవకాశం వస్తుందని తనను గెలిపిస్తే అండగా ఉండి సేవ చేస్తానని భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్​ కుమార్​రెడ్డి అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నారు. డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి మాట్లాడుతూ భువనగిరి ఎంపీ అభ్యర్థికి జనగామ నుంచి ఎక్కువ మెజార్టీ ఇచ్చి తీరుతామన్నారు. అనంతరం ఆయన ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్​లో చేరారు.

సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజలింగం, టీపీసీసీ లీడర్ పవన్ మల్లాడి, పార్లమెంట్ పరిధి జనగామ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ భవానీరెడ్డి, కొమ్మూరి ప్రశాంత్​రెడ్డి, మేడ శ్రీనివాస్, బనుక శివరాజ్ యాదవ్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.​