ఆ ఏడు నియోజకవర్గాల్లో..కాంగ్రెస్ అగ్ర నేతలతో ప్రచారం

ఆ ఏడు నియోజకవర్గాల్లో..కాంగ్రెస్ అగ్ర నేతలతో ప్రచారం
  •     మహబూబ్ నగర్, భువనగిరి, మల్కాజ్​గిరి, చేవెళ్ల, నిజామాబాద్, సికింద్రాబాద్, మెదక్ సెగ్మెంట్లపై ఫోకస్

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో 15 లోక్​సభ స్థానాలను టార్గెట్​గా పెట్టుకున్న కాంగ్రెస్.. అందులో ఏడు సీట్లలో ప్రత్యర్థి పార్టీల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నది. మహబూబ్ నగర్, భువనగిరి, మల్కాజ్​గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, నిజామాబాద్ లో బీజేపీతో కాంగ్రెస్ నువ్వా.. నేనా అన్నట్టు పోరాడుతోంది. మెదక్​లో బీఆర్ఎస్​తో పోటీ పడుతోంది. ఆ ఏడు సీట్లలో విజయం సాధిస్తేనే హైకమాండ్ ఇచ్చిన టార్గెట్ ‘మిషన్15’కు చేరువవుతామనే ఆలోచనతో పీసీసీ నాయకత్వం, సీఎం రేవంత్ ఉన్నారు.

దీంతో ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అగ్ర నేతలతో ప్రచారం చేయించేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక, మల్లిఖార్జున్ ఖర్గే, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితరులతో ప్రచారం చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్​కు ఆనుకొని ఉన్న లోక్ సభ నియోజకవర్గాలైన సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్​గిరిలో రాహుల్, ప్రియాంకతో రోడ్ షోలకు రాష్ట్ర నాయకత్వం మొగ్గు చూపుతోంది. 

మెదక్​పై సీఎం రేవంత్​ నజర్

మెదక్​లో కాంగ్రెస్ గెలుపు సీఎం రేవంత్​కు ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే అక్కడ తన ప్రచారాన్ని కొనసాగించడమే కాకుండా ఇన్​చార్జ్​ మంత్రులతో పాటు ఆ లోక్​సభ నియోజకవర్గ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలతో ప్రచారం తీరుపై ఆరా తీస్తున్నారు. పార్టీ గెలుపు కోసం వారికి సూచనలు చేస్తున్నారు. ఈ నియోజకవర్గాలపై ఎప్పటికప్పుడు సర్వే రిపోర్టులు తెప్పించుకుంటూ.. అందుకు అనుగుణంగా ప్రచార వేగాన్ని పెంచుతూ స్థానిక నేతలను అప్రమత్తం చేస్తున్నారు.