బీజేపీవి విచ్ఛిన్న రాజకీయాలు: ఖర్గే

బీజేపీవి విచ్ఛిన్న రాజకీయాలు: ఖర్గే
  • కులాలు, వర్గాల మధ్య చిచ్చుపెడుతున్నరు
  • పార్టీ ఈశాన్య రాష్ట్రాల లీడర్లతో కాంగ్రెస్ చీఫ్​ భేటీ
  • వచ్చే లోక్ సభ ఎన్నికల వ్యూహంపై చర్చ

న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విచ్ఛిన్న రాజకీయాలకు పాల్పడుతున్నదని కాంగ్రెస్  చీఫ్​ మల్లికార్జున్  ఖర్గే తీవ్రస్థాయిలో విమర్శించారు. కులాలు, వర్గాల మధ్య బీజేపీ నేతలు చిచ్చుపెడుతున్నారని ఆయన ఆరోపించారు. ‘యాక్ట్  ఈస్ట్’ పాలసీని యాక్ట్​  లీస్ట్ గా మార్చారని విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్  పార్టీ లీడర్లతో ఖర్గే శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు. మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాల నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. హింసతో అట్టుడుకుతున్న మణిపూర్​పై నేతలు చర్చించారు. 

అలాగే 2024 లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చలు జరిపారు. బీజేపీ పాలనలో భావప్రకటన స్వేచ్ఛపై దాడి జరుగుతున్నదని ఖర్గే ట్వీట్  చేశారు. ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని ఆయన విమర్శించారు. ‘‘కాంగ్రెస్  ప్రభుత్వం నెలకొల్పిన శాంతి, సామరస్యం, అభివృద్ధిని బీజేపీ నేతలు నాశనం చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో మా పార్టీ అమలు చేసిన ప్రాజెక్టుల క్రెడిట్​ను బీజేపీ నేతలు వారి ఖాతాలో వేసుకుంటున్నారు. బీజేపీ విడదీస్తున్న ప్రజలను కలపాల్సిన బాధ్యత ప్రతిఒక్క కాంగ్రెస్  నేత, కార్యకర్తదే” అని ఖర్గే పేర్కొన్నారు.

పార్లమెంటరీ కమిటీ భేటీ

మణిపూర్​లో పరిస్థితిపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ అంశంపై ఉభయసభల్లో చర్చకు డిమాండ్ చేస్తామని, దీనిపై ప్రధాని మోదీ దేశాన్ని విశ్వాసంలోకి తీసుకోవాలని కామెంట్ చేసింది. ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో దేశంలో రైల్వే భద్రతపైనా చర్చించాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపింది. 

అలాగే దేశ ఫెడరల్ వ్యవస్థపై దాడి, అదానీ ఇష్యూపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు, ద్రవ్యోల్బణం, జీఎస్టీని పీఎంఎల్ఏ చట్టం కిందకు తేవడం, ఎంపీ బ్రిజ్ భూషణ్ పై వచ్చిన లైంగిక ఆరోపణల వంటి అంశాలనూ వర్షాకాల సమావేశాల్లో లేవనెత్తుతామని కాంగ్రెస్ ప్రకటించింది. శనివారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా అధ్యక్షతన స్ట్రాటజీ గ్రూప్ సమావేశం జరిగింది.