బీఆర్ఎస్‌‌లో చేరిన 12 మందిపై పీఎస్​లో కాంగ్రెస్ ఫిర్యాదు

బీఆర్ఎస్‌‌లో చేరిన 12 మందిపై పీఎస్​లో కాంగ్రెస్ ఫిర్యాదు
  • ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉన్న ముగ్గురు సహా అందరిపై విచారణ జరపాలని డిమాండ్
  • 2014 నుంచి 37 మందిని బీఆర్ఎస్ గుంజుకున్నదని హైకోర్టుకు బీజేపీ లిస్ట్​
  • ఫిరాయింపులకు పెద్దన్న సీఎం కేసీఆరేనని వాదనలు

హైదరాబాద్, వెలుగు: ఫిరాయింపుల వ్యవహారం అనుకోని మలుపు తిరిగింది. 2018లో తమ పార్టీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి బీఆర్ఎస్ గుంజుకున్నదని మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌‌లో కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. 2014 నుంచి ఇప్పటిదాకా 37 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అక్రమంగా చేర్చుకుని ఎనిమిదేండ్లుగా ఫిరాయింపులను రాష్ట్ర సర్కార్ ప్రోత్సహిస్తున్నదని హైకోర్టులో బీజేపీ వాదించింది. దీంతో ఫిరాయింపుల కేసు కాస్తా బీజేపీ, కాంగ్రెస్ ఎదురుదాడితో కొత్త టర్న్ తీసుకుంది.

రాజకీయ పోరాటం చేస్తం: రేవంత్

ఫిరాయింపులతో కేసీఆర్ తన అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనుకుంటున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అందులో భాగంగానే ప్రతిపక్షాలు లేకుండా చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఫిరాయింపు రాజకీయాలకు సమాధి కట్టాలని పేర్కొన్నారు. కాంగ్రెస్‌‌ నుంచి గెలిచి బీఆర్ఎస్‌‌లో చేరిన 12 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర నేతలతో కలిసి శుక్రవారం ఆయన మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన విచారణను హైకోర్టు సీబీఐకి అప్పగించడంతో.. ఆ కేసులో ఉన్న ముగ్గురు సహా 12 మంది ఎమ్మెల్యేలపైనా విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కాంగ్రెస్ నేతలు సీఎల్పీలో భేటీ అయ్యారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ సర్కార్ పదవులు, ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చిందని రేవంత్​ ఆరోపించారు. సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చారని, రేగా కాంతారావుకు ప్రభుత్వ విప్, ఇతర నేతలకు ఆర్థిక ప్రయోజనాలను కల్పించారని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అప్పట్లో సీఎల్పీ నేత భట్టి ఎన్నోసార్లు స్పీకర్‌‌‌‌కు ఫిర్యాదు చేసినా న్యాయబద్ధంగా వ్యవహరించలేదని, సీఎల్పీని టీఆర్ఎస్‌‌లో విలీనం చేశారని గుర్తు చేశారు. 

ఫిరాయింపులపై సీబీఐ, ఈడీ, డీజీపీకి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అవసరమైతే కోర్టుకు వెళ్తామని, ఫిరాయింపు ఎమ్మెల్యేలు మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టకుండా రాజకీయ పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. 2014 నుంచి పాలనను గాలికొదిలేసిన కేసీఆర్.. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే పనిలో పడ్డారని మండిపడ్డారు. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన ఫిరాయింపులన్నింటిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పైలెట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు.. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లారని, ఆ పార్టీ నుంచి మళ్లీ బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారని రేవంత్ ఆరోపించారు. అందులో భాగంగానే ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు బయటకు వచ్చిందని చెప్పారు. అందుకే ఆ కేసు నమోదైన మొయినాబాద్ పీఎస్‌‌‌‌‌‌‌‌లోనే తాము ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఫామ్‌‌‌‌‌‌‌‌ హౌస్ కేసులో కోర్టు పరిధిలో ఉండాల్సిన ఆధారాలను పోలీసులు కేసీఆర్​కు ఇచ్చారని మండిపడ్డారు. అందుకే ఆ కేసును సిట్ నుంచి సీబీఐకి హైకోర్టు బదిలీ చేసిందన్నారు. ఈ నెల 26 నుంచి పాదయాత్ర మొదలుపెడతానని సీఎల్పీలో మీడియాతో చిట్​చాట్ సందర్భంగా రేవంత్ చెప్పారు. భద్రాచలం, జోడేఘాట్, జోగులాంబల్లో ఏదో ఒక ప్రాంతం నుంచి యాత్ర మొదలుపెడతానని, రోజూ 19 కిలోమీటర్ల చొప్పున 126 కిలోమీటర్ల మేర యాత్ర చేస్తానని వెల్లడించారు.

ఫిరాయించినోళ్లపై చర్యలు తీస్కోవాలి: భట్టి

కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి ఆ పార్టీలో చేరలేదని, విడతల వారీగా వెళ్లారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. దీనిపై అప్పుడే మండలి నేతగా ఉన్న షబ్బీర్ అలీతో కలిసి స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేశానని, అయినా కూడా పట్టించుకోకుండా సీఎల్పీని బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో విలీనం చేశారని గుర్తుచేశారు. అది ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించడమేనని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను గుంజుకుని రాష్ట్ర సర్కారు ప్రజాస్వామ్యాన్ని, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని నవ్వులపాలు చేసిందని విమర్శించారు. పార్టీ ఫిరాయించిన నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఫిరాయింపులకు పెద్దన్న కేసీఆర్: బీజేపీ

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడుతున్నామని చెప్పుకునే సీఎం కేసీఆర్.. పార్టీ ఫిరాయింపులకు పెద్దపీట వేశారని బీజేపీ ఆరోపించింది. ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని బయటపెట్టామని చెప్పుకుంటున్న ఫిర్యాదుదారు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ తరఫున గెలవలేదని, కాంగ్రెస్​ నుంచి గెలిచి అధికార పార్టీలోకి ఫిరాయించారని చెప్పింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర సర్కార్, సిట్, రోహిత్ రెడ్డి వేసిన అప్పీల్ పిటిషన్‌‌‌‌‌‌‌‌ను శుక్రవారం చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ టి.తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తరఫున సీనియర్ లాయర్ సి.దామోదర్ రెడ్డి, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, నిందితుల తరఫున మాజీ అడ్వకేట్ జనరల్, సీనియర్ అడ్వకేట్​ డి.వి.సీతారామమూర్తి వాదనలు వినిపించారు. దేశంలోని 8 రాష్ట్రాల ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిందంటూ సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ప్రేమేందర్ తరఫు లాయర్ దామోదర్ రెడ్డి అన్నారు. వాస్తవానికి ఫిరాయింపులతో కాలం గడిపిందే సీఎం కేసీఆర్ అని చెప్పారు. 2014 నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, బీఎస్పీ, సీపీఐ, ఏఐఎఫ్​బీకి చెందిన 37 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో చేర్చుకున్నారని గుర్తు చేశారు. ఆ జాబితాను కోర్టుకు అందజేశారు. ఏ రాష్ట్రంలోనూ బీజేపీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోలేదని చెప్పారు. క్రిమినల్ కేసుకు సంబంధించి సీఎం కేసీఆర్ మీడియా సమావేశం పెట్టకపోయి ఉంటే సిట్ కేసు దర్యాప్తునకు ఆటంకాలే ఉండేవి కాదని నిందితుల తరఫు అడ్వొకేట్ సీతారామమూర్తి అన్నారు. సిట్ దర్యాప్తు బాగానే జరుగుతున్నదని సీఎం కేసీఆర్ ఎలా చెప్తారని ప్రశ్నించారు. కేసుకు సంబంధించి ఫిర్యాదు అందిన రెండు గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, అందులోని కీలక విషయాలను ఆ వెంటనే సీఎం ప్రెస్​మీట్ పెట్టి వెల్లడించారని గుర్తు చేశారు. ఆ వీడియోలు కేసీఆర్​కు ఎలా చేరాయో ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేదన్నారు. సీఎం చెప్పినట్టే డీజీపీ చేశారని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా కేసు గురించి సీఎం మాట్లాడారని, రహస్య సమాచారాన్ని బయటకు లీక్ చేశారని ఆరోపించారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్‌‌‌‌‌‌‌‌కు అప్పీల్ చేయలేరని, సుప్రీంకోర్టులోనే ప్రభుత్వం, సిట్ అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుందని మరో సీనియర్ లాయర్ ఎల్.రవిచందర్ వాదించారు. అప్పీల్ పిటిషన్‌‌‌‌‌‌‌‌కు అర్హత లేదని చెప్పిన ఆయన.. అంతకుముందు వేరే రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన తీర్పులను గుర్తు చేశారు.బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లకు సంబంధించిన రాజకీయ అంశాలకు హైకోర్టును వేదికగా చేయవద్దని, ఇలాంటివి ఏమైనా ఉంటే కోర్టు బయట చూసుకోవాలని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌ను సింగిల్ జడ్జి కొట్టివేసినప్పటికీ దానిపై ఎందుకు అప్పీల్ చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

హైకోర్టుకు బీజేపీ ఇచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేల లిస్టు 2014-2018 మధ్య బీఆర్ఎస్‌‌లోకి కోనేరు కోనప్ప, ఎ.ఇంద్రకరణ్ రెడ్డి (బీఎస్పీ). సండ్ర వెంకట వీరయ్య, కె.పి.వివేకానంద, మాధవరం కృష్ణారావు, మంచిరెడ్డి కిషన్​రెడ్డి, తీగల కృష్ణా రెడ్డి, ప్రకాశ్ గౌడ్‌‌, అరికెపూడి గాంధీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాగంటి గోపీనాథ్‌‌, తలసాని శ్రీనివాస్, జి. సాయన్న, ఎస్‌‌. రాజేందర్‌‌ రెడ్డి (టీడీపీ). కాలే యాదయ్య, చిట్టెం రామ్మోహన్‌‌ రెడ్డి, ఎన్​.భాస్కర్​ రావు, జి.విఠల్​రెడ్డి, కోరం కనకయ్య, పువ్వాడ అజయ్ కుమార్ (కాంగ్రెస్‌‌). బానోత్ మదన్​లాల్, తాడి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు (వైసీపీ), రవీంద్ర కుమార్ (సీపీఐ).

2018 తర్వాత బీఆర్ఎస్‌‌లోకి

ఆత్రం సక్కు, జాజుల సురేందర్, దేవిరెడ్డి సుధీర్​ రెడ్డి, పైలెట్‌‌ రోహిత్​ రెడ్డి, పి. సబితా ఇంద్రా రెడ్డి, కాంతారావు రేగా, భీరం హర్షవర్ధన్​రెడ్డి, హరిప్రియ బానోత్, గండ్ర వెంకట రమణా రెడ్డి, కందాల ఉపేందర్‌‌ రెడ్డి, వనమా వెంకటేశ్వర్​ రావు, చిరుమర్తి లింగయ్య (కాంగ్రెస్), కోరుకంటి చందర్ (ఏఐఎఫ్‌‌బీ)