సింగపూర్‌లో స్థిరపడిన ఒక కెనడియన్ జంట విడాకుల మ్యాటర్ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. భార్య అడిగిన భారీ భరణం చెల్లించలేక.. ఏకంగా నెలకు 50 లక్షల రూపాయలు అంటే ఏడాదికి రూ.6 కోట్లు జీతం వచ్చే అత్యున్నత స్థాయి ఉద్యోగానికి ఒక వ్యక్తి రాజీనామా చేశాడు. అయితే చట్టం ముందు ఈ ఎత్తుగడలు సాగవని సింగపూర్ ఫ్యామిలీ కోర్టు అతడికి దిమ్మతిరిగే తీర్పునిచ్చింది.
ఈ దంపతులు తమ నలుగురు పిల్లలతో కలిసి 2013లో సింగపూర్‌కు మారారు. భర్త ఒక మల్టీనేషనల్ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా నెలకు సుమారు 50 లక్షల రూపాయల వేతనం పొందుతుండేవారు. భార్య గృహిణిగా ఉంటూ పిల్లలను ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదివిస్తూ అత్యున్నత స్థాయి జీవన ప్రమాణాలను అనుభవించారు. అయితే 2023 ఆగస్టులో భర్త ఇంటి నుంచి బయటకు వచ్చేసి మరో మహిళతో సహజీవనం చేయడం ప్రారంభించడంతోనే అసలు వివాదం మొదలైంది.
భరణం ఎగ్గొట్టేందుకు రాజీనామా:
మెుదట్లో భార్యాపిల్లల ఖర్చుల కోసం నెలకు రూ.15 లక్షల 50వేలు ఇస్తానని ఒప్పుకున్న భర్త.. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ.7లక్షల 70వేలకు తగ్గించాడు. దీంతో భార్య కోర్టును ఆశ్రయించింది. తన కుటుంబ జీవన ప్రమాణాలకు అనుగుణంగా భరణం కావాలని ఆమె కోరింది. సరిగ్గా భార్య కోర్టులో పిటిషన్ వేసిన కొద్దిరోజులకే.. అంటే 2023 అక్టోబర్‌లో ఆ వ్యక్తి భారీ జీతం ఇస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. భరణం తప్పించుకోవడానికే కావాలని ఉద్యోగం వదిలేసి, తిరిగి కెనడా వెళ్లిపోయాడు.
కోర్టు ఆగ్రహం - భారీ జరిమానా:
ఈ కేసును విచారించిన సింగపూర్ కోర్టు జడ్జి ఫాంగ్ సంచలన తీర్పునిచ్చారు. భరణం చెల్లించకుండా తప్పించుకోవడానికే ఆ వ్యక్తి ఉద్యోగం వదిలేశాడని కోర్టు నిర్ధారించింది. ఒక వ్యక్తి తన బాధ్యతల నుండి తప్పుకోవడానికి చేసే రాజీనామా చెల్లదని, అతడి సంపాదనా సామర్థ్యాన్ని బట్టే భరణం నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. 2023 సెప్టెంబర్ నుంచి 2025 మార్చి వరకు అతడు తన కుటుంబానికి పైసా కూడా ఇవ్వలేదని కోర్టు గుర్తించింది.
దీంతో నలుగురు పిల్లల చదువు, అద్దె, ఇతర ఖర్చులన్నింటినీ లెక్కించిన కోర్టు.. బాకీ ఉన్న భరణం కింద దాదాపు రూ.4 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని జనవరి 15, 2026 లోపు ఒకేసారి చెల్లించాలని ఆదేశించింది. అయితే 2024 అక్టోబర్ తర్వాత అతడికి కెనడాలో తక్కువ జీతం వచ్చే ఉద్యోగం రావడంతో, అప్పటి నుండి తల్లిదండ్రులు ఇద్దరూ సమానంగా పిల్లల బాధ్యతలు పంచుకోవాలని సూచించింది. భర్త ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లినప్పటికీ.. బాధ్యత గల తండ్రిగా తన సంపాదనను పక్కన పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేయడం ఆమోదయోగ్యం కాదని కోర్టు నొక్కి చెప్పింది. దీంతో ఈ తీర్పు ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
