నిజామాబాద్ ఎంపీ సీటుకు కాంగ్రెస్​లో పోటాపోటీ​

నిజామాబాద్ ఎంపీ సీటుకు కాంగ్రెస్​లో పోటాపోటీ​
  • అసెంబ్లీ ఎలక్షన్ ​ఫలితాల​తో పార్టీలో జోష్
  • నిజామాబాద్​ టికెట్​ రేసులో డజన్​కు పైగా ఆశావహులు
  • సినీ నిర్మాత దిల్​రాజుపై చర్చ

నిజామాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలలో విజయంతో కాంగ్రెస్​ ఫుల్​జోష్ లో ఉంది. త్వరలో జరిగే లోక్​సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. అసెంబ్లీ ఎలక్షన్​లో పోటీ ఛాన్స్​దక్కని లీడర్లతో పాటు మరికొందరు ముఖ్యనేతలు ఎంపీగా కాంటెస్ట్​ చేయడానికి రెడీ అంటున్నారు.

ఆశావహులు ఎక్కువే

నిజామాబాద్​ లోక్​సభ నియోజకవర్గం పరిధిలో బోధన్, అర్బన్, రూరల్, ఆర్మూర్, బాల్కొండతో పాటు జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి లోక్​సభ ఎలక్షన్స్​లో పోటీకి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. 

అసెంబ్లీ టికెట్ ఆశించిన  టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​మహేశ్​గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనీల్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, తాహెర్, మానాల మోహన్​రెడ్డి, కెప్టన్​ కారుణాకర్​రెడ్డి పార్టీని ఎంపీ ఛాన్స్​కోరుతున్నారు. అర్బన్​ నుంచి పోటీ చేసి ఓడిన షబ్బీర్​అలీ పేరు కూడా పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. మహిళా కోటాలో ఎమ్మెల్యే ఆకుల లలిత కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నందున తమ ఎన్నిక సులువవుతుందని అంచనా వేస్తున్నారు.

కాంగ్రెస్​లో దిల్​రాజు చర్చ

సినీ నిర్మాత దిల్​రాజు పాలిటిక్స్ పై ఇంట్రస్ట్​గా ఉన్నట్లు కొన్నాళ్లుగా ప్రచారమవుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్​కు నెల ముందు నుంచి ఈ ప్రచారం మరింత జోరందుకుంది. మోపాల్​ మండలం నర్సింగ్​పల్లికి చెందిన దిల్​రాజు పేరుతో ఇప్పటికే సామాజిక సేవా ట్రస్ట్​ నడుస్తోంది. దిల్​రాజు పేరును జిల్లాకు చెందిన సీనియర్​ కాంగ్రెస్ ​లీడర్, బోధన్​ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి పార్టీకి ప్రతిపాదించారు. 

ఆర్థిక బలంగా ఉన్న ఆయన  ప్రత్యర్థులకు ధీటైన అభ్యర్థి అవుతారని లెక్కలు వేశారు. దిల్​రాజు అన్న నర్సింహారెడ్డికి కాంగ్రెస్​ స్టేట్​లీడర్లతో  సంబంధాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ నుంచి పోటీ చేయడానికి విఫలయత్నం చేసిన దిల్​రాజు బంధువు, మార్కెట్​కమిటీ మాజీ అధ్యక్షుడు నగేశ్​రెడ్డి కూడా లోక్​సభ పోటీకి సై అంటున్నారు.

లైన్​ క్లియర్​

మధు యాష్కి గౌడ్​2004 నుంచి 2014 వరకు రెండుసార్లు నిజామాబాద్​ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ మధు​యాష్కీ పోటీ చేసి ఓడారు. తాను ఈసారి లోక్​సభకు పోటీ చేయడం లేదని రెండు రోజుల కింద హైదరాబాద్​లో మీడియా చిట్​చాట్​లో ఆయన ప్రకటించారు. దీంతో నిజామాబాద్​ టికెట్​ఆశిస్తున్న పార్టీలోని ఇతర లీడర్లకు లైన్​ క్లియర్​అయింది.