నేటితో (జూలై 15) ముగియనున్న కాంగ్రెస్ సమావేశాలు

నేటితో (జూలై 15) ముగియనున్న కాంగ్రెస్ సమావేశాలు
  • వచ్చే నెల్లో డీసీసీ అధ్యక్షుల నియామకాలకు ఇంటర్వ్యూలు

హైదరాబాద్, వెలుగు: గత పదిహేను రోజులుగా కొనసాగుతున్న ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ సమావేశాలు మంగళవారంతో ముగియనున్నాయి. పలు జిల్లాలకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇన్ ఛార్జీలుగా వ్యవహరించి, ఆయా జిల్లాల్లో గ్రామ, మండల, బ్లాక్, జిల్లా కమిటీల కార్యవర్గం జాబితాలపై తుది కసరత్తు పూర్తి చేశారు. ఈ నెల 16 నుంచి నియోజకవర్గ పీసీసీ అబ్జర్వర్లు... గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి కార్యవర్గాలకు ఎవరిని నియమించాలనే దానిపై జాబితాను సిద్ధం చేసి పీసీసీకి పంపించనున్నారు. 

ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు చోటు ఉండేలా జాబితాను రెడీ చేసి హైదరాబాద్ కు పంపించనున్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్,  పార్టీ రాష్ట్ర ఇన్ ఛార్జీ మీనాక్షి నటరాజన్ ఈ జాబితాలను పరిశీలించి ఈ నెలాఖరు వరకు ప్రకటించనున్నారు. ఇక, డీసీసీ అధ్యక్షుల నియామక ప్రకటన వచ్చే నెలలో ఉంటుందని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఈ పదవులకు నియమించే వారిలో బడుగు, బలహీన వర్గాలతో పాటు పార్టీలో పాత, కొత్త సమతుల్యత, కాంగ్రెస్ కు విధేయత, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశం కల్పించనున్నారు. ఈ కీలక పదవుల నియామకం కోసం వచ్చే నెలలో పీసీసీ, ఏఐసీసీ అబ్జర్వర్లు ఇంటర్వ్యూలు చేయనున్నారు. ఈ ఇంటర్వ్యూల ద్వారానే డీసీసీ చీఫ్ నియామకం జరగనుంది. 2017  నుంచి కాంగ్రెస్ లో ఉన్న వారికి మాత్రమే కీలక పదవులు ఇస్తామని పీసీసీలో జోరుగా ప్రచారం సాగుతోంది.