కాంగ్రెస్​ లిస్టు లేటు! అక్టోబర్ రెండో వారంలో వచ్చే అవకాశం

కాంగ్రెస్​ లిస్టు లేటు! అక్టోబర్ రెండో వారంలో వచ్చే అవకాశం
  • అభ్యర్థులపై మరోసారి సర్వే చేయిస్తున్న హైకమాండ్​
  • రెండు రోజుల్లో రీసర్వే ఫలితాలు వచ్చే చాన్స్​
  • మీటింగ్​ డేట్​ను ఇంకా ఫిక్స్​ చేయని సెంట్రల్​ఎలక్షన్​ కమిటీ
  • ఐదు రాష్ట్రాలకూ ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే చాన్స్
  • లేటవుతున్నదంటూ ఆశావహుల్లో ఆందోళన

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థుల లిస్టు లేటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు చివరి వారంలోనే లిస్టు వస్తుందని పెద్ద లీడర్లు చెప్పినా.. ఇప్పటికీ అభ్యర్థుల వడపోతపైనే నేతలు కసరత్తులు చేస్తున్నారు. దానికితోడు మళ్లీ రీ సర్వేల పేరిట అభ్యర్థుల చిట్టాను రెడీ చేస్తుండడమూ అభ్యర్థుల ప్రకటనను ఆలస్యం చేస్తున్నదన్న చర్చ జరుగుతున్నది. వచ్చే నెల రెండో తేదీన స్క్రీనింగ్​కమిటీ సమావేశం కానున్నట్టు తెలుస్తున్నది. ఆ తర్వాత దాన్ని సెంట్రల్​ఎలక్షన్​ కమిటీకి పంపించి.. చర్చించిన తర్వాతే అభ్యర్థుల జాబితా ప్రకటించాలని భావిస్తున్నారని చెప్తున్నారు. ఇటు ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాలకు కలిపి ఒకేసారి లిస్టును ప్రకటించాలన్న యోచనలో హైకమాండ్​ఉన్నట్టు తెలుస్తున్నది. దీంతో వచ్చే నెల రెండో వారం వరకు అభ్యర్థుల లిస్టు రిలీజ్​కాదని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.  అక్టోబర్ 8 లేదా 9వ తేదీల్లో లిస్టు వచ్చే అవకాశం ఉందంటూ పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డే స్వయంగా చిట్​చాట్​లో సూచనప్రాయంగా చెప్పారు. 

అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రెండు మూడుసార్లు ప్రదేశ్​ ఎన్నికల కమిటీ, ఆరు సార్లు స్క్రీనింగ్​ కమిటీ సమావేశాలను నిర్వహించాయి. ఎన్నికల కమిటీ మెంబర్స్​తో పాటు పలువురు ఆశావహులతోనూ హైదరాబాద్​లో స్క్రీనింగ్​కమిటీ చైర్మన్​ నేరుగా సమావేశమయ్యారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లోనూ వరుసగా మూడు రోజులు ఢిల్లీలోనే స్క్రీనింగ్​కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ఆ సమావేశాల్లో 80 వరకు సీట్లలో క్లారిటీ వచ్చిందని చెప్తున్నా.. మరికొన్ని సీట్లలో పోటీ తీవ్రంగా ఉండటంతో మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. అయితే, ఎప్పుడు భేటీ అన్నది మాత్రం డిసైడ్​ చేయలేదు. 

వచ్చే నెల 2న ఢిల్లీలోనే మరోసారి స్క్రీనింగ్​కమిటీ సమావేశం ఉంటుందని పార్టీ నేతలు చెప్తున్నారు. వాస్తవానికి శుక్రవారమే(29న) స్క్రీనింగ్​కమిటీ సమావేశం నిర్వహించాలని నేతలు భావించినా.. కమిటీ చైర్మన్ మురళీధరన్​ అందుబాటులో లేకపోడంతో ఆ సమావేశాన్ని వాయిదా వేసినట్లు చెబుతున్నారు. ఆ సమావేశంలో క్లారిటీ వచ్చిన సీట్లతో పాటు అంతకుముందు సమావేశాల్లో డిసైడ్​చేసిన సీట్లను పార్టీ సెంట్రల్​ ఎలక్షన్​ కమిటీకి ఇవ్వాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. సెంట్రల్​ఎలక్షన్​ కమిటీ సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా ఇప్పటికే అధిష్టానానికి రాష్ట్ర నేతలు విజ్ఞప్తి చేసినా.. ఇంకా సమావేశం తేదీని నిర్ణయించలేదని నేతలు చెప్తున్నారు. వచ్చే నెల మొదటి వారాంతంలోనే సెంట్రల్​ఎలక్షన్​ కమిటీ సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయని అంటున్నారు. 

రీసర్వేలు చేస్తున్నరు

సర్వేలు, గెలుపు, సామాజిక సమీకరణాల ఆధారంగానే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని ముందు నుంచీ పార్టీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన స్క్రీనింగ్​కమిటీ సమావేశంలో సునీల్​కనుగోలు తన సర్వే రిపోర్టులను పార్టీ పెద్దలకు అందజేశారని తెలిసింది. పీసీసీ మాజీ చీఫ్​, ఓ ఎంపీ భార్య సహా ఓ 25 స్థానాల్లో పార్టీలోని సీనియర్లు గెలిచే పరిస్థితి లేదంటూ సర్వే రిపోర్టును వివరించారని అంటున్నారు. కనుగోలు ఇచ్చిన ఆ సర్వే రిపోర్టుపై కమిటీలోని సీనియర్​ నేతలు అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేసినట్టు చెప్తున్నారు. అందుకే ఆయా నియోజకవర్గాల్లో రీసర్వేకు హైకమాండ్​ఆదేశించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆయా నియోజకవర్గాల్లో కనుగోలు సర్వే పూర్తి కావొచ్చిందని, మరో రెండు రోజుల్లో ఆ నివేదిక అందుతుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఆ నివేదికపై తదుపరి నిర్వహించే స్క్రీనింగ్​కమిటీలో చర్చించి మరో లిస్టును ప్రిపేర్​చేస్తారని సమాచారం. ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్న నియోజకవర్గాలపైనా ఆ రోజు స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు. 

కోటా కోసం కొట్లాటలు

లిస్టు ప్రకటనపై ఓవైపు చర్చలు జరుగుతుండగానే మరోవైపు కోటా కోసం పలువురు నేతలు కొట్లాడుతున్నారు. ఇప్పటికే బీసీ లీడర్లు 40 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు కావాలని పట్టుబడుతున్నారు. హైకమాండ్​తో తేల్చుకునేందుకు కొందరు బీసీ లీడర్లు ఢిల్లీలోనే మకాం వేశారు. ఎస్సీ, ఎస్టీ లీడర్లు కూడా తమ కోటాలో వచ్చే సీట్లతో పాటు జనరల్​లోనూ అదనంగా కేటాయించాలని డిమాండ్​ చేస్తున్నారు. ఎస్సీలకు 19, ఎస్టీలకు 12 సీట్లు రిజర్వ్​డ్​ కేటగిరీలో ఉండగా, జనరల్​లో అదనంగా మరో నాలుగు చొప్పున కేటాయించాలంటున్నారు. పెద్ద లీడర్ల గెలుపులో తమ ఓట్లు చాలా కీలకమని బీసీ, ఎస్సీ, ఎస్టీలు చెప్తున్నారు. వారికి తోడు పార్టీలోని అనుబంధ సంఘాల అధ్యక్షులు, లీడర్లకూ టికెట్లు కేటాయించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. యూత్​ కాంగ్రెస్​ కోటాలో శివసేనా రెడ్డికి టికెట్​ఇవ్వాల్సిందేనని ఆ వింగ్​నేషనల్​ప్రెసిడెంట్​బి.వి. శ్రీనివాస్​ తేల్చి చెప్తున్నారు. మహిళా కాంగ్రెస్​ కోటాలో సునీతారావు, కిసాన్​ కాంగ్రెస్​ కోటాలో అన్వేష్​ రెడ్డి, ఎస్సీ సెల్​చైర్మన్​ ప్రీతం, ఆదివాసీ రాష్ట్ర చైర్మన్​ బెల్లయ్య నాయక్​కీ టికెట్లు ఇవ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో వాళ్లందరికీ సర్దిచెప్ప లేక పార్టీ రాష్ట్ర నేతలు తలలు పట్టుకుంటున్నారు. అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు.

ఐదు రాష్ట్రాల లిస్టు ఒకేసారి..?

మన రాష్ట్రంతో పాటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్​గఢ్, మిజోరాం రాష్ట్రాలకు షెడ్యూల్​ప్రకారం ఈ డిసెంబర్​లో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లోనూ మన దగ్గరిలాగానే అప్లికేషన్లు, సర్వేల ఆధారంగానే పార్టీ టికెట్లను కేటాయిస్తున్నది. మిజోరం మినహాయించి మిగతా ప్రధానమైన మూడు రాష్ట్రాల్లో అప్లికేషన్లు వేలాదిగా వచ్చాయని సమాచారం. కొన్ని కొన్ని స్థానాల్లో వందకుపైగా అప్లికేషన్లు వచ్చాయట. దీంతో అక్కడ అభ్యర్థుల స్క్రీనింగ్​కొంచెం టైం తీసుకుంటున్నదని అంటున్నారు. అక్కడ కూడా కొన్ని సీట్లలో అభ్యర్థుల లిస్టును ఫైనల్​చేశారు. మధ్యప్రదేశ్​లో 90 నుంచి110 సీట్లు, చత్తీస్​గఢ్​లో 60, రాజస్థాన్​లో 50 స్థానాల్లో క్లారిటీ వచ్చినట్టు తెలిసింది. అయితే, రాజస్థాన్​లో దాదాపు 35 మంది సిట్టింగ్​ఎమ్మెల్యేలపై సర్వేలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చినట్టు తేలడంతో.. వారిపై వేటు వేసేందుకు పార్టీ భావిస్తున్నదట. వారి స్థానాల్లో వేరే అభ్యర్థులను రీప్లేస్​చేసే విషయంలో సమయం తీసుకుంటున్నదట. ఈ క్రమంలోనే పార్టీ సెంట్రల్​ఎలక్షన్​ కమిటీకి లిస్టు ఇవ్వడంలో ఆలస్యమవుతున్నదని, అందుకే అన్ని రాష్ట్రాల లిస్టులు వచ్చాక పార్టీ సెంట్రల్​ఎలక్షన్​ కమిటీ ఒకేసారి సమావేశమై ఆయా రాష్ట్రాల అభ్యర్థులపై చర్చిస్తుందని తెలుస్తున్నది.

నేతల్లో ఆందోళన

పోయినసారిలా కాకుండా ఈ సారి వీలైనంత తొందరగానే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని పార్టీ పెద్దలు పదేపదే చెప్తున్నారు. ఎన్నికలకు జస్ట్​ నెల రోజుల ముందే ప్రకటించడంతో గతంలో అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి వీలు లేకుండా పోయిందని, ఇప్పుడు ఆ ఇబ్బంది రాకుండా ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలను కున్నారు. కానీ ప్రకటన లేట్​అవుతుండడంతో పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఆశావహులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. ఇటీవల నియోజకవర్గాల్లో జాతీయ స్థాయి నేతల పర్యటన సందర్భంగా ఆశావహులే ఖర్చులు పెట్టుకున్నారని తెలుస్తున్నది. దీంతో అభ్యర్థిని ముందుగానే ప్రకటిస్తే మిగతా వాళ్లకైనా ఖర్చులు తప్పుతాయని కొందరు నేతలు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు తెలిసింది.