మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పై కాంగ్రెస్ ఫోకస్

మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పై  కాంగ్రెస్ ఫోకస్
  • గెలుపు బాధ్యతలను మంత్రి దామోదర రాజనర్సింహకు అప్పగించిన హైకమాండ్​
  • త్వరలో మున్సిపాలిటీల వారీగా క్యాడర్​తో సమావేశం
  • మహబూబ్​నగర్​ మేయర్​ స్థానానికి  అధికార పార్టీలో పెరిగిన పోటీ

మహబూబ్​నగర్, వెలుగు: రానున్న వారం రోజుల్లో కార్పొరేషన్, మున్సిపల్​ ఎన్నికలకు షెడ్యూల్​ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. వార్డులు, డివిజన్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా రిజర్వేషన్లు​ఖరారు చేయడంతో ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్​ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈక్రమంలో కాంగ్రెస్​ మెజార్టీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్​ను హస్తగతం చేసుకునేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. ప్రతీ పార్లమెంట్​ నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్​ క్యాండిడేట్లను గెలిపించుకునే బాధ్యతను మంత్రికి అప్పగించింది. 

పార్లమెంట్లకు ఇన్​చార్జీలుగా నియమించింది. ఈ పార్లమెంట్​ నియోజకవర్గంలో ఏడు మున్సిపాలిటీలు ఉండగా.. జడ్చర్ల పాలకవర్గం పదవీ కాలం ఇంకా పూర్తి కాలేదు. మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లోని భూత్పూర్, దేవరకద్ర, కోస్గి, మద్దూరు, మక్తల్, నారాయణపేట మున్సిపాలిటీలు, మహబూబ్​నగర్​ కార్పొరేషన్​కు ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో కాంగ్రెస్​ హైకమాండ్​ గెలుపు బాధ్యతలను జిల్లా ఇన్​చార్జి మంత్రిగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు అప్పగించింది. 

రెబల్స్​ బెడద లేకుండా చేయడమే టార్గెట్​..

మున్సిపల్, కార్పొరేషన్​ ఎన్నికలు పార్టీ సింబల్​​మీద జరగనుండడంతో క్యాండిడేట్ల ఎంపిక దగ్గరి నుంచి పోలింగ్​ పూర్తయ్యేంత వరకు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎన్నికల సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా గెలుపోటములపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్​ మంత్రి దామోదరకు మహబూబ్​నగర్​ పార్లమెంట్​ బాధ్యతలను అప్పగించింది. ముందుగా ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్​ పరిధిలోని లీడర్లతో సమావేశం కానున్నారు. 

వార్డులు, డివిజన్లలో పార్టీ పరిస్థితి, ప్రతిపక్షాల బలాలు, బలహీనతలపై చర్చించనున్నారు. పార్టీ నుంచి పోటీకి ఎవరు ఆసక్తి చూపుతున్నారు? ఏ ఏ స్థానాల్లో లీడర్ల మధ్య పోటీ ఎక్కువగా ఉంది? అక్కడ ఎవరిని బరిలోకి దింపితే గెలిచే అవకాశం ఉంది? ఎవరిని తప్పించాలి? రెబల్స్​ ఉంటే వారిని బుజ్జగించి.. ఇతర అవకాశాలు కల్పించేలా హైకమాండ్​ నుంచి హామీలు ఇప్పించే ప్రయత్నాలు చేయనున్నారు. దీనికితోడు వార్డులు, డివిజన్ల​వారీగా ఎప్పటికప్పుడు ప్రజానాడిని, అక్కడి పరిస్థితులను లీడర్లతో సమీక్షించనున్నారు. అసరమైతే రెండు, మూడు డివిజన్లకు ఒక లీడర్​ను ఇన్ చార్జీగా నియమించే అవకాశాలు ఉన్నాయి. వార్డులు, డివిజన్లలో పర్యటిస్తూ పార్టీ క్యాండిడేట్లను గెలిపించే బాధ్యతను తీసుకోనున్నారు. 

మేయర్​గా ఆ ముగ్గురిలో ఎవరికో ఒకరికి చాన్స్​

మహబూబ్​నగర్​ మేయర్​ స్థానం బీసీ మహిళకు రిజర్వ్​ కావడంతో ఈ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార పార్టీలోని ప్రధాన లీడర్లలో కొందరు తమ వారసులు, భార్యలను పోటీకి దింపేందుకు సిద్ధమవుతున్నారు. సీనియర్​ లీడర్​ ఎన్పీ వెంకటేశ్​ తన రాజకీయ వారసురాలిగా కూతురు నేహశ్రీని బరిలోకి దింపే అవకాశాలున్నాయి. 

వీరు ఉండే 14వ డివిజన్  బీసీ జనరల్​కు రిజర్వ్​ కావడం కలిసొచ్చింది. అలాగే మాజీ మున్సిపల్​ చైర్మన్​ ఆనంద్​ గౌడ్​ సైతం తన భార్య ప్రసన్నను మేయర్​గా పోటీకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరు ఉండే 49వ డివిజన్​ జనరల్​కు రిజర్వ్​ కాగా.. ఇక్కడి నుంచి ఆమెను కార్పొరేటర్​గా పోటీకి దింపాలని భావిస్తున్నారు. మరో లీడర్​ రాఘవేందర్​ రాజు సైతం తన సతీమణి వసంతను మేయర్​ను చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. 

వసంత ప్రస్తుతం మహిళా కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షురాలిగా పని చేస్తున్నారు. ఇదిలాఉంటే ప్రసన్న, వసంత ఇద్దరూ 49వ డివిజన్​ పరిధిలోని వారే. దీంతో వీరిద్దరూ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ  జరుగుతోంది. కాగా, కాంగ్రెస్  లీడర్  బురుజు సుధాకర్  సతీమణి కల్పన కూడా పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. 52వ డివిజన్  నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి మేయర్  పీఠాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.