
- ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి ఏమాత్రం పట్టవు
- అవినీతి, వారసత్వ రాజకీయాలే వారికి ముఖ్యం
- రాజస్థాన్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగం
జైపూర్: సనాతన ధర్మాన్ని నిర్మూలించడం, బుజ్జగింపు రాజకీయాలు చేయడమే కాంగ్రెస్ పార్టీ పాలసీగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధి కంటే కుటుంబ పాలనే కాంగ్రెస్కు ముఖ్యమన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలి జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో మోదీ మాట్లాడారు. రాజస్థాన్ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. కానీ.. కాంగ్రెస్కు వారసత్వ రాజకీయాలు, అవినీతి కంటే ఇంకేం ముఖ్యం కాదని విమర్శించారు. మహిళా వ్యతిరేక భావజాలం ఉన్న వారితో కాంగ్రెస్ జత కట్టిందని అన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టం వచ్చినప్పటి నుంచి.. కాంగ్రెస్ లీడర్లు మహిళలే టార్గెట్గా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలను చిన్నచూపు చూస్తూ వారిపై దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. అహంకార కూటమిలోని లీడర్లంతా దేశంలోని అమ్మ, అక్క, చెల్లెల గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ‘‘బీహార్ అసెంబ్లీలో సీఎం నితీశ్ కుమార్ మహిళలను ఉద్దేశించి అభ్యంతరకర కామెంట్లు చేశారు. అహంకార కూటమిలోని లీడర్లు ఎవరూ దీనిపై స్పందించలేదు. కాంగ్రెస్ లీడర్లు కూడా ఖండించలేదు. ఇదీ వాళ్ల నిజ స్వరూపం. రాజస్థాన్ ప్రజలందరూ దీన్ని గమనించాలి”అని మోదీ అన్నారు.
తప్పు చేస్తే.. చెప్పే తెలివి కూడా లేదు
ఓ మాజీ సీఎంను ఉద్దేశించి కూడా నితీశ్ కుమార్ గతంలో అసభ్యకర కామెంట్లు చేశారని మోదీ అన్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చినందునే నితీశ్ కుమార్ ఆయన్ని అవమానించి ఆనందం పొందారని విమర్శించారు. ఎవరైనా తప్పు చేస్తే.. చెప్పే తెలివి కూడా కాంగ్రెస్కు లేదని ఎద్దేవా చేశారు. దళితులపై అఘాయిత్యాలు జరుగుతున్నా.. కాంగ్రెస్ కండ్లు మూసుకుని ఉంటున్నదని మండిపడ్డారు. బుజ్జగింపులు తప్ప కాంగ్రెస్కు ఏమీ తెలియవని, అందుకే ఐదేండ్ల పాలనలో అల్లర్లు, హింస చెలరేగాయని విమర్శించారు. ‘‘రాజస్థాన్ కల్చర్.. సనాతన ధర్మాన్ని కాంగ్రెస్ నాశనం చేస్తున్నది. రాష్ట్రంలో ఇంధన ధరలు భారీగా పెరిగిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ధరలు తక్కువగా ఉండేవి. అప్పటితో ఇప్పుడున్న ఇంధన ధరలను పోల్చుకోవాలి. బీజేపీ పాలిత రాష్ట్రాలైన హర్యానా, యూపీ, గుజరాత్ కంటే రాజస్థాన్లో పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో రూ.2 లక్షల ఇన్కమ్ ఉంటే ట్యాక్స్ కట్టాల్సి ఉండేది. ఇప్పుడు రూ.7 లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు”అని మోదీ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మొబైల్ డేటా కోసం నెలకు రూ.5 వేలు ఖర్చు చేసేవాళ్లమని, ఇప్పుడు ఏడాదికి కూడా అంత స్పెండ్ చేయడం లేదన్నారు.