
- సిద్దిపేట, దుబ్బాక నేతలకు తప్పని నిరీక్షణ
- గజ్వేల్, హుస్నాబాద్ నేతలకు అవకాశాలు
- పలు జాబితాలు పెండింగ్ లోనే
సిద్దిపేట, వెలుగు: నామినేటెడ్ పోస్టుల విషయంలో సిద్దిపేట, దుబ్బాక నేతలు నారాజ్అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా రెండు నియోజకవర్గాలకు చెందిన నేతలకు ఎలాంటి పదవులు దక్కలేదు. జిల్లాలోని హుస్నాబాద్, గజ్వేల్, జిల్లా పరిధిలోకి వచ్చే మానకొండూరు, జనగామ నియోజకవర్గాలకు సంబంధించి మార్కెట్ కమిటీలు, ఆలయ పాలక మండలి కమిటీలను ఏర్పాటు చేశారు. కానీ సిద్దిపేట నియోజకవర్గంలో 3, దుబ్బాక నియోజకవర్గంలో 4 మార్కెట్ కమిటీల ఏర్పాటు పెండింగ్ లో పెట్టారు. ఎంతో కాలంగా పార్టీ కోసం పనిచేస్తూ ఏఎంసీ, ఆలయ పాలక మండలి పదవులను ఆశిస్తున్న నేతలు నిరుత్సాహానికి గురవుతున్నారు.
ఏకాభిప్రాయం లేక జాబితాలు పెండింగ్
సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి, దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ పాలక వర్గాలపై కొంత కసరత్తు జరిగినా 2 నియోజకవర్గాల్లో ఒక్క కమిటీని ఏర్పాటు చేయలేదు. నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జాబితాలు పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. గజ్వేల్ నియోజకవర్గంలో రెండు గ్రూపుల మధ్య సయోధ్య కుదరడంతో ఏఎంసీ పోస్టులను భర్తీ చేయగా దుబ్బాక, సిద్దిపేటల్లో అంతర్గతంగా గ్రూపుల గొడవలు ఉండడం, నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఆటంకంగా మారుతున్నట్టు సమాచారం. పరిస్థితి ఇలా ఉంటే వచ్చే స్థానిక ఎన్నికల్లో ఎలా ప్రచారం చేస్తామనే అభిప్రాయం నాయకుల్లో వ్యక్తమవుతోంది.
కలకలం సృష్టిస్తున్న డీసీసీ పదవుల లిస్టు
కొత్తగా డీసీసీ కమిటీల ఏర్పాటుకు పీసీసీ సన్నద్ధం అవుతుండడంతో సిద్దిపేట, దుబ్బాకకు చెందిన పలువురు నేతలు పోటీ పడుతున్నారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఏడుగురి పేర్లను ప్రతిపాదిస్తూ ఏఐసీసీ అనుమతి కోసం పంపారంటూ ఒక జాబితా సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. మరోవైపు సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లోని ఏఎంసీలు, ఆలయ పాలక మండలిలో అవకాశాల కోసం నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ముఖ్యంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, దామోదర రాజనరసింహ, జగ్గారెడ్డి, మైనంపల్లి హన్మంతరావును కలుస్తూ తమకు అవకాశం వచ్చేలా చూడాలని కోరుతున్నారు. కొందరు హైదరాబాద్ తో పాటు ఢిల్లీకి వెళ్లి ముఖ్య నేతలను కలుస్తూ అవకాశం ఇప్పించాలని కోరుతున్నారు.
సుడాపై నేతల ఆశలు
సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్అథారిటీ (సుడా) చైర్మన్ పదవి కోసం సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. చైర్మన్ తోపాటు డైరెక్టర్ పదవులు జిల్లా స్థాయి పోస్టులు కావడంతో 4 నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలు తమదైన రీతిలోప్రయత్నాలు సాగిస్తున్నారు. సుడా చైర్మన్ పదవిని సిద్దిపేట నియోజకవర్గానికే కేటాయించాలనే కొందరు డిమాండ్ చేస్తున్నారు. గతంలో సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు 26 గ్రామాల పరిధితో ఉన్న సుడా ప్రస్తుతం జిల్లా మొత్తం విస్తరించడంతో చైర్మన్, డైరెక్టర్ పదవుల కోసం పోటీ పెరిగింది.