హిమాచల్ ప్రదేశ్​లో హైడ్రామా.. కూలిపోయే ప్రమాదం నుంచి గట్టెక్కిన సుఖూ సర్కార్

హిమాచల్ ప్రదేశ్​లో  హైడ్రామా.. కూలిపోయే ప్రమాదం నుంచి గట్టెక్కిన సుఖూ సర్కార్
  • బీజేపీ ఎమ్మెల్యేలను బహిష్కరించి అసెంబ్లీలో బడ్జెట్​కు ఆమోదం
  • రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్​తో మైనార్టీలో పడ్డ ప్రభుత్వం 
  • బలపరీక్షను ఎదుర్కోవాలంటూ ప్రతిపక్ష బీజేపీ డిమాండ్
  • ఎమ్మెల్యేల బహిష్కరణతో జాగ్రత్తపడ్డ కాంగ్రెస్  

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం నుంచి తాత్కాలికంగా గట్టెక్కింది. మంగళవారం నాటి రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరుగురు, ముగ్గురు ఇండిపెండెంట్లు బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేయడంతో సర్కారు మైనార్టీలో పడినట్లయింది. అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొనేలా చేసి ప్రభుత్వం కూలిపోయేలా చేయాలని ప్రతిపక్ష బీజేపీ ఎత్తు వేయగా.. సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ సర్కార్ అనూహ్య రీతిలో పైఎత్తు వేసి గట్టెక్కింది. 

స్పీకర్​పై దాడికి యత్నించారంటూ అసెంబ్లీ నుంచి 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం.. ఆ వెంటనే బడ్జెట్​ను పాస్ చేసుకుని అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేయడం చకచకా జరిగిపోయాయి. మరోవైపు క్రాస్ ఓటింగ్ చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే ప్రక్రియ వాయిదా పడగా.. కాంగ్రెస్ సీనియర్ నేత విక్రమాదిత్య సింగ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించింది. దీంతో రాష్ట్రంలో హైడ్రామాకు బుధవారం సాయంత్రం తెరపడింది. 

క్రాస్ ఓటింగ్​తో మారిన సీన్ 

హిమాచల్ అసెంబ్లీలో మొత్తం 68 సీట్లు ఉండగా, కాంగ్రెస్ కు 40  మంది, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ముగ్గురు ఇండిపెండెంట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. అయితే, మంగళవారం నాటి రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరుగురు, ముగ్గురు ఇండిపెండెంట్లు బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్​కు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీకి, మహాజన్ కు చెరో 34 ఓట్లు వచ్చి ఫలితం టై అయింది. దీంతో లాటరీ తీయగా బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. అసెంబ్లీలో కనీస మెజార్టీకి 35 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా, క్రాస్ ఓటింగ్ ను బట్టి చూస్తే 34 మందే ఉన్నారని తేలిపోయింది. క్రాస్ ఓటింగ్​కు పాల్పడిన 9 మంది ఎమ్మెల్యేలు హర్యానాకు వెళ్లిపోయారు. దీంతో హిమాచల్​లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న ప్రచారం మొదలైంది. 

రంగంలోకి ప్రియాంక, ప్రత్యేక టీం

ఈ సంక్షోభం నుంచి సుఖూ సర్కారును గట్టెక్కించేందుకు ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పార్టీ సీనియర్ అబ్జర్వర్లు భూపేశ్ బాఘెల్, బూపీందర్ సింగ్ హుడా, రాజీశ్ శుక్లాతో కూడిన టీంను పార్టీ హైకమాండ్ బుధవారం సిమ్లాకు పంపింది. వీరు రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సలహాలు సూచనలు చేశారు. 

కుట్రను భగ్నం చేశాం: సుఖూ 

ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రతిపక్ష బీజేపీ చేసిన కుట్రను భగ్నం చేశామని హిమాచల్ ప్రదేశ్​ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్​  సెషన్ తర్వాత సుఖూ మీడియాతో మాట్లాడారు. తన ప్రభుత్వం మెజార్టీని నిరూపించుకుంటుందని, రాష్ట్రంలో ఐదేండ్ల పాటు తమ ప్రభుత్వమే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.  

సర్కారును కాపాడుకోవడానికే..: జైరాం ఠాకూర్ 

 మైనార్టీలో పడ్డ కాంగ్రెస్ సర్కార్ బల పరీక్షను ఎదుర్కోవాలని అసెంబ్లీలో బీజేపీ సభాపక్ష నేత, మాజీ సీఎం జైరాం ఠాకూర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూలిపోతుందన్న భయంతోనే తమను సస్పెండ్ చేసి, బడ్జెట్ పాస్ చేసుకున్నారని ఆయన ఆరోపించారు.