విద్యార్థులకిచ్చిన హామీలు మరవొద్దు!

విద్యార్థులకిచ్చిన హామీలు మరవొద్దు!

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 10 ఏండ్లు అయినా ప్రభుత్వ విద్యలో పెద్ద చెప్పుకోదగ్గ మార్పు రాలేదనే విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్‌‌ ప్రభుత్వం విద్యార్థుల కోసం తమ పార్టీ అభయ హస్తం మేనిఫెస్టోలో అనేక హామీలు ప్రస్తావించారు. ఇప్పటివరకు విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వ చర్యలు పెద్దగా ఏమీ లేవు.  ఐదు లక్షల విద్య భరోసా కార్డు ఇస్తామని వారి మేనిఫెస్టోలో ప్రకటించారు. కాంగ్రెస్‌‌ పార్టీ అగ్రనేత రాహుల్‌‌ గాంధీ కూడా విశ్వ విద్యాలయాల విద్యార్థులను హైదరాబాద్‌‌లో కలిసినప్పుడు, అనేక ఎన్నికల సభల్లో ప్రస్తావించి  తన హామీగా చెప్పుకున్నారు. ఈ విషయం గురించి కాంగ్రెస్‌‌ పార్టీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది అమలు జరిగితే విద్యార్థులకు మంచి ఆర్థిక భరోసా అందుతుంది.  విద్యార్థులకు ప్రీ వైఫై సౌకర్యం అన్నారు. దీని మీద ఇంకా స్పష్టత లేదు.  

విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించాలి

ప్రతి మండలంలో ఆధునిక సౌకర్యాలతో ఇంటర్నేషనల్‌‌ మోడల్‌‌ స్కూల్‌‌ అన్నారు. ఈ విద్యా సంవత్సరంలో అది లేనట్టే.  వచ్చే ఏడాది అమలు చేయాలి అంటే దానికి ఇప్పటి నుంచి చర్చలు, చర్యలు చేపడితే  వచ్చే ఏడాదికి  విద్యార్థులకు కనీసం అందుబాటులో వస్తుంది.  కనీసం పైలట్‌‌ ప్రాజెక్టుగా అయినా దానిపై దృష్టి సారించాలి.  విదేశీ విద్యకు 26 లక్షలు అన్నారు. అది గత ప్రభుత్వంలో 20 లక్షలు ఇచ్చారు. అది ఏ మూలకు సరిపోవట్లేదు. అది విద్యార్థుల ట్యూషన్‌‌ ఫీజు సదుపాయాలకు కూడా సరిపడట్లేదు.  దాని గురించి జార్ఖండ్​ ప్రభుత్వం,  కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న విదేశీ విద్య స్కాలర్​షిప్​  స్కీమ్స్‌‌ను సుదీర్ఘ  పరిశోధన చేసి  అందించాలి. 

ఫ్రీ బస్సులే కాదు.. ఫ్రీ విద్య అందించాలి

రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలను  పరిశోధన కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. రాష్ట్రంలో కేవలం వృత్తి విద్య అంటే ఇంజినీరింగ్‌‌, మెడికల్‌‌  మాత్రమే గుర్తించబడుతున్నాయి. అలా కాకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో కూడా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తే  రాష్ట్రం అనేక పరిశోధన కేంద్రాలకు నిలయంగా మారుతుంది.  ఉదాహరణకు దళిత్‌‌ స్టడీస్‌‌ లాంటి అనేక కేంద్రాలు ఏర్పాటు చేయాలి.   ప్రత్యేక రాష్ట్రం కేవలం రాజకీయవర్గం కోసం 
పుచ్చుకున్నది కాదు.  తెలంగాణ సమగ్ర అభివృద్ధి జరుగుతుందని నమ్మి విద్యార్థులు, విద్యావంతులు దళితులు, ఆదివాసీలు, మహిళలు, గ్రామీణ ప్రజానీకం,  అనేక సామాజిక వర్గాలు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ తరుణంలో అందరికీ మంచి విద్యను ఇవ్వడం చాలా అవసరం.  ఫ్రీ బస్సులే కాదు ఫ్రీ విద్య కూడా తెలంగాణ ప్రజలకు అవసరం. దీనిని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలి.  తెలంగాణ సమాజాన్ని విద్యాభివృద్ధి వైపు అడుగులు వేసేలా  కాంగ్రెస్​ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

పీహెచ్​డీ విద్యార్థులకు గౌరవవేతనం ఇవ్వాలి

పూర్తి స్కాలర్​షిప్​ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్‌‌, ఇతర మైనారిటీ వర్గాల పిల్లలకు ఇచ్చే చర్యలు చేపట్టాలి.  రాష్ట్రంలో ఇంకా ప్రతి రీసెర్చ్‌‌ స్కాలర్‌‌ (పరిశోధన) చేసే విద్యార్థికి 10,000 రూపాయలు నెలకు ఫెలోషిప్‌‌గా ఇస్తాం అని పేర్కొన్నారు. దాని వైపు సర్కారు అడుగులు వేయాలి.  ప్రభుత్వం  ఇంకా ఫీజు రీయింబర్స్​మెంట్​ చెల్లించలేదు.  వీటి గురించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో అన్ని రంగాల్లో  పరిశోధనలు జరగాలి.  రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఏడాదికి  స్పెషల్‌‌ రీసెర్చ్‌‌ ఫెలోస్‌‌ కింద  పీహెచ్‌‌డీ,  పోస్ట్‌‌ డాక్టరేట్‌‌ చేసే విద్యార్ధులకు రూ. 3000 కనీసం గౌరవ వేతనం ఇచ్చి వారిని ప్రోత్సహించాలి. 

- ధనావత్‌‌ అశోక్‌‌,
సీనియర్‌‌ రీసెర్చర్‌‌, 
నేషనల్‌‌ క్యాంపైన్‌‌ ఫర్‌‌ దళిత్‌‌ హ్యూమన్‌‌ రైట్స్‌‌