నల్గొండ లో స్థానికతకే పెద్ద పీట

నల్గొండ లో స్థానికతకే పెద్ద పీట
  • తుంగతుర్తి, మిర్యాలగూడలో లోకల్ నేతలకు ఛాన్స్‌
  • సీనియర్ల అభిప్రాయాన్ని గౌరవించిన కాంగ్రెస్ హైకమాండ్

నల్గొండ, వెలుగు: కాంగ్రెస్ ఈ సారి స్థానికత అంశానికి కట్టుబడి టికెట్లు కేటాయించింది. ఎంపీలు ఉత్తమ్​కు మార్​ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్​ అభ్యర్థుల ఎంపికలో ​హైకమాండ్‌ను ఒప్పించడంతో సఫలీకృతులయ్యారు. గతఎన్నికల్లో లోకల్‌ నేతలను పక్కన పెట్టి నాన్​ లోకల్​ వ్యక్తులకు టికెట్లు ఇవ్వడం వల్ల పార్టీ దెబ్బతిన్నది.  మిర్యాలగూడ స్థానాన్ని బీసీ నేత ఆర్​కృష్ణయ్యకు కేటాయించారు. స్థానికేతరుడు కావడంతో  అక్కడ పార్టీ ఓడిపోయింది. తుంగతుర్తిలో అద్దంకి దయాకర్​ కూడా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి కూడా అద్దంకికే టికెట్​ ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ నాలుగేళ్ల నుంచి నియోజకవర్గానికి దూరంగా ఉండటం, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఫిర్యాదుల నేప థ్యంలో దయాకర్​ను పక్కకు పెట్టినట్టు తెలిసింది.  

ఉద్యమ నేత సామెల్‌కు దక్కిన గౌరవం

కాంగ్రెస్​ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మందుల సామెల్‌కు తుంగతుర్తి టికెట్‌ కేటాయించింది. మోత్కుపల్లి నర్సింహులు, అద్దంకి దయాకర్​, కొండేటి మల్లయ్య, ప్రీతం, వంటి అనేక మంది లీడర్లు పోటీ పడ్డా..  పార్టీ జరిపిన సర్వేలో సామెల్‌ పేరు ప్రధానంగా చర్చకు వచ్చింది. అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన  సామెల్‌ మాదిగ సామాజిక వర్గానికి చెందిన  వ్యక్తి కావడం, ఆ వర్గం ఓటర్లు అధికంగా ఉండటం, ఆయన మీద ఎలాంటి అవినీతి, ఆరోపణలు లేకపోవడం, పైగా స్థానికుడు కావడంతో ఆయనకు కలిసొచ్చింది.

 బీఆర్​ఎస్​లో గిడ్డంగుల సంస్థ  చైర్మన్​గా పనిచేసిన తనను పార్టీలో ఎదగకుండా మంత్రి జగదీశ్​ రెడ్డి, ఎమ్మెల్యే కిషోర్​ కుమార్​ కుట్ర పన్నారని ఆయన అనేక సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు.  సీఎం కేసీఆర్‌‌, కేటీఆర్‌‌ పర్యటనలకు ఆహ్వానం లేకపోవడమే కాదు..  నియోజకవర్గంలో కట్టిన గోడౌన్‌లను సమాచారం ఇవ్వకుంటానే ఎమ్మెల్యే, మంత్రి ప్రారంభించారని మీడియా ఎదుట వాపోయారు.  ఈసారి టికెట్ ఆశించినా.. అధిష్ఠానం సిట్టింగ్ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌‌కే ఇవ్వడంతో పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ బీఫామ్‌తో శుక్రవారం నామినేషన్‌ వేయగా.. పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా  పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 

ఎట్టకేలకు బత్తులకు ఛాన్స్​ 

మిర్యాల గూడ టికెట్‌‌ను చివరి వరకు పెండింగ్‌‌లో పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్ చివరికి బత్తుల లక్ష్మారెడ్డికే కేటాయించింది. కమ్యూనిస్టులతో పొత్తులో భాగంగా ఈ టికెట్ సీపీఎంకు ఇవ్వాలనుకున్నా.. పొత్తు ఖరారు కాకపోవడంతో ఆ పార్టీ నుంచి జూలకంటి రంగారెడ్డి బరిలో దిగారు. దీంతో చివరి లిస్ట్‌‌లో బత్తుల పేరు ఖరారైంది. మిర్యాలగూడ కాంగ్రెస్ టికెట్ ​2009 తర్వాత ఇప్పుడే స్థానికుడికి దక్కింది.  ఈ ఎన్నికల్లో పార్టీ సీనియర్ నేత తిరునగరు గంగాధర్ ఓడిపోయారు.

ALSO READ: గూగుల్​ యాడ్స్​లో బీఆర్​ఎస్​ టాప్​.. ఏ సైట్ ఓపెన్ చేసినా కేసీఆర్ బొమ్మే

2014లో  నిడమనూరు మండలం శాకాపురం గ్రామానికి చెందిన భాస్కర్​రావు కాంగ్రెస్​నుంచి గెలిచిన  బీఆర్ఎస్​లో చేరారు.  2018లో కాంగ్రెస్ టికెట్ స్థానికేతరు డైన​​బీసీ నేత ఆర్​ కృష్ణయ్యకు ఇవ్వడంతో భాస్కర్​రావుకు రెండోసారి అదృష్టం కలిసొచ్చింది.   కమ్మ సామాజికవర్గానికి చెందిన భాస్కర్​రావు మిర్యాలగూడలో రాజకీయంగా నిలదొక్కుకునేందుకు నామినేటెడ్ పదవుల్లో రెడ్డి వర్గానికే ప్రియార్టీ ఇచ్చారు. కానీ ఇప్పుడు అదే సామాజిక వర్గం నుంచి బత్తుల లక్ష్మారెడ్డి పోటీ చేయడంతో రాజకీయం రసవత్తరంగా మారింది.