గూగుల్​ యాడ్స్​లో బీఆర్​ఎస్​ టాప్​.. ఏ సైట్ ఓపెన్ చేసినా కేసీఆర్ బొమ్మే

గూగుల్​ యాడ్స్​లో బీఆర్​ఎస్​ టాప్​.. ఏ సైట్ ఓపెన్ చేసినా కేసీఆర్ బొమ్మే
  • ఈ‌‌-పేపర్లలోనూ ప్రకటనలు.. హామీల ప్రస్తావన
  • యూట్యూబ్​ సినిమాల్లో కూడా యాడ్లు వచ్చేలా ఏర్పాట్లు  
  • ఓటు వేయాలంటూ ట్రూకాలర్, వాట్సాప్​లో రిక్వెస్టులు
  • ఈసీకి కష్టంగా మారిన డిజిటల్​ ప్రకటనల నిర్వహణ

యాదాద్రి, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల నాయకులు  చేస్తున్న ఖర్చుపై ఎన్నికల కమిషన్​ నిఘా వేయడంతో డిజిటల్  యాడ్లపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఏ వెబ్ సైట్​ ఓపెన్ చేసినా కేసీఆర్ ఫొటోలే వచ్చేలా ఏర్పాట్లు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ ఎంత ఖర్చు చేస్తున్నదో ఈసీ లెక్కలు వేస్తోంది.  ప్రధానంగా ఎలక్ట్రానిక్, ప్రింట్​ మీడియాలో రాజకీయ పార్టీలు ఇచ్చే ప్రకటనలను పరిశీలిస్తోంది. ఎక్కడికక్కడ కలెక్టరేట్ లో  ఏర్పాటు చేసిన మీడియా సెంటర్లలో టీవీలు ఏర్పాటు చేసుకొని న్యూస్​ చానెల్స్​ చూస్తూ వాటిలో వచ్చే యాడ్లను ఎన్నికల అధికారులు రికార్డు చేసుకుంటున్నారు. ప్రింట్​ మీడియాలో వస్తున్న అన్ని పేపర్లనూ పరిశీలిస్తున్నారు. ఆయా మీడియాలకు సంబంధించి యాడ్​ టారిఫ్​ తెప్పించుకొని లెక్కలు వేస్తున్నారు. దీంతో రాజకీయ పార్టీలు, పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. లెక్కలు కన్పించని విధంగా జాగ్రత్తలు తీసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందుకు సోషల్  మీడియాను విరివిగా వాడుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్  పార్టీ సోషల్ మీడియాలో యాడ్లను కుమ్మేస్తోంది. ఏ సైట్, ఈ పేపర్  ఓపెన్  చేసినా సీఎం కేసీఆర్  బొమ్మ వస్తున్నది. తమ పార్టీ గుర్తుకు ఓటేయాలని ప్రచారం చేస్తున్నట్లు ఆ ఫొటోలో ఉంటున్నది. 

లెక్కలోకి రాకుండా పోతున్న ఖర్చు

ప్రచార ఖర్చు లెక్కలోకి రాకుండా సోషల్​ మీడియా, డిజిటల్​ మీడియాను రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎక్కువగా వాడుకుంటున్నారు. వివిధ రూపాల్లో యాడ్లు ఇస్తున్నారు. వాట్సాప్​ అయితే లెక్కే లేదు. రాజకీయ పార్టీలు పాత గ్రూపులతో పాటు కొత్తగా గ్రూపులను క్రియేట్​ చేసుకొని ప్రచారంలో దూసుకొనిపోతున్నాయి. ఎక్కడికక్కడ స్థానికంగా ప్రచారం సాగుతూ ఉండడంతో ఎన్నికల టీం నిఘా వేయలేకపోతోంది. ఈ కారణంగా ఎన్నికల ఖర్చులోకి లెక్కలోకి రావడం లేదు. ఫేస్​బుక్​, ఇన్​స్టాలో ఎమ్మెల్యేలు ప్రచారం చేసుకుంటున్నారు. పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ఫేస్​బుక్​ ఖాతాకు 1.1 మిలియన్లు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్​రెడ్డికి 1.5 మిలియన్లు, సీఎం కేసీఆర్​ కు 8.7 లక్షలు, బీజేపీ ఎంపీ బండి సంజయ్​కు 3 లక్షల  మంది ఫాలోవర్లు ఉన్నారు. అలాగే ఒక్కో ఎమ్మెల్యేకు వారి వారి నియోజవర్గాల్లో పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. వారి వ్యక్తిగత పేజీల్లో ఎన్నికల ప్రచారం జరగుతూనే ఉంది. అవి వారి వ్యక్తిగత ఖాతాలు కాబట్టి.. ఫాలో అవుతున్న వారే చూసే అవకాశం ఉంది. ప్రతి ఎమ్మెల్యే ఫేస్​బుక్​ ఖాతాను ఎన్నికల కమిషన్​ పరిశీలించడం కొంత కష్టమే. వారందరూ ‘మీడియా సర్టిఫికేషన్  అండ్  మానిటరింగ్  కమిటీ’ సర్టిఫికెట్ తెచ్చుకున్నారా అన్నది పరిశీలించాల్సి ఉంది.

ALSO READ: ఈసారి మారిన పొత్తులు .. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల పోటీపై క్లారిటీ

గూగుల్​ యాడ్స్​లో బీఆర్​ఎస్​ టాప్​

డిజిటల్​ ప్లాట్​ఫాంపై బీఆర్ ఎస్​ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ ప్లాట్​ఫాంలో ఏ సైట్​ ఓపెన్​  చేసినా సీఎం కేసీఆర్​ బొమ్మ కనిపిస్తున్నది. ప్రధాన మీడియాకు చెందిన ఈ పేపర్ల సైట్  కోసం గూగుల్​ క్రోమ్​లో ఎంటర్​ అయితే కేసీఆర్​ భరోసా అంటూ పైన, కింద కేసీఆర్​ బొమ్మలు మాత్రమే యాడ్స్​లో  కన్పిస్తున్నాయి. దీనితో పాటు బీఆర్ఎస్​కు సంబంధించిన అనేక యాడ్లు వేర్వేరు సమయాల్లో వేర్వేరుగా కన్పిస్తున్నాయి. సేమ్​ టైం ఇద్దరు పక్కపక్కనే ఉండి గూగుల్​క్రోమ్​లో ఎంటరై సైట్​ ఓపెన్​ చేసినా ఒక్కొక్కరికి ఒక్కోరకంగా ప్రకటనలు కన్పిస్తున్నాయి. కనిపించిన ప్రకటనపై క్లిక్​ చేస్తే కేసీఆర్​ ఇచ్చిన 15 హామీలు ఈ యాడ్స్​లో వచ్చేలా బీఆర్ఎస్  ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా యూట్యూబ్​లో వచ్చే సినిమాలు, వీడియోల్లోనూ కేసీఆర్​ ప్రకటనలే కనిపిస్తున్నాయి. సినిమాలో ఎక్కడో ఒకచోట అర నిమిషం పాటు ప్రకటన ప్లే అవుతోంది. ఇక అల్లు అర్జున్ నటించిన ‘జులాయి’ సినిమా యూట్యూబ్​లో చూస్తుండగా మధ్యలో బీఆర్ఎస్​ ఎన్నికల ప్రచారం యాడ్​ వచ్చింది. అర నిమిషం యాడ్​లో కేసీఆర్​ను చూపిస్తూ ఓటేయాలని అందులో ప్రచారం చేశారు.